నమ్మకం:-- యామిజాల జగదీశ్
 నమ్మకం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఒకప్పుడు ఏర్పరచుకున్న నమ్మకం కొంత కాలం తర్వాత సన్నగిల్లుతుంది. పరిచయస్తులూ సన్నిహితులూ చెప్పే మాటలతో మనం నమ్ముకున్న నమ్మకాలు స్థిరంగా ఉండవు. ప్రతి ఒక్కరూ చెప్పేది మన మంచి కోసమే కావచ్చు. కానీ మనకంటూ మనమంటూ ఏర్పరచుకున్న నమ్మకాన్నే గాలికొదిలేసి ఇంకెవరో ఏదో చెప్పారని అప్పటి వరకూ ఉన్న నమ్మకాన్ని నమ్మడం మానేసేవాళ్ళను చూస్తూ ఉంటాం. అందుకే మన నమ్మకాన్నే మనం అప్పుడప్పుడూ సమీక్షించుకోవడం అవసరం. నమ్మకంమీద నిశ్చిత్తాభిప్రాయం లేక బలహీనపడితే పరిణామాలూ మారిపోతాయి.
అనగనగా ఓ జ్ఞాని. ఆయన సంచారం చేస్తూ ఉంటారు. అలాగు ఓ ఊరుకి వెళ్ళారు. ఆ ఊరి చివరున్న చెరువు దగ్గరకు వెళ్ళారు. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. చెరువులో స్నానం చేసి వెళ్దామనుకుంటారు. అయితే విప్పిన బట్టలకాకుండే తన దగ్గరున్న మరొక జత పంచ గట్టుమీద పెట్టి చెరువులో దిగాలనుకుంటారు. ఎవరైనా తన బట్టలు చూసుకుంటే బాగుంటుందనుకుంటుని అటూ ఇటూ చూస్తారు. ఒక్క మనిషీ కనిపించలేదు. ఏదైతే అదే అవుతుందనుకుని బట్టల సంచిని గట్టుమీద ఉంచి చెరువులోకి దిగుతాడు. 
కాస్సేపటికి అటువైపుగా ఓ మంచి మనిషి వస్తాడు. మంచి మనిషి అని ఎందుకంటున్నానంటే అతనంటేనూ అతని మాటలంటేనూ ఆ ఊళ్ళో అందరికీ ఇష్టం. అతనెప్పుడూ నలుగురికీ నాలుగు మంచి మాటలు చెప్తుంటాడు. తనకు చేతనైన మంచీ చేస్తుంటాడు. అందుకే అతనిని అందరూ మంచి మనిషి అని పిలుస్తుంటారు. ఆ మంచిమనిషికి గట్టుమీది బట్టలు కనిపిస్తాయి. వాటిని చూసిన మంచి మనిషి ఎవరో బట్టలు ఇక్కడుంచి స్నానం చేయడానికి చెరువులో దిగినట్టున్నారు, ఎవరైనా ఈ బట్టలు ఎత్తుకుపోవచ్చేమో అనుకుని తాను వాటికి కాపలా కాస్తాడు. 
చెరువులో దిగిన జ్ఞాని స్నానం కానిచ్చుకుని ఓ అర గంట తర్వాత గట్టుమీదకు వస్తారు. ఆయనను చూస్తూనే ఈ మంచి మనిషి "ఈ బట్టలు మీవేనా? నేనే ఇంత సేపటి నుంచీ జాగర్తగా చూసుకుంటున్నాను" అంటాడు.
అప్పుడా జ్ఞాని "అదేంటీ...ననా పైవాడిని అంటే దేవుడిని నమ్మి స్నానానికి వెళ్తే ఆయన కాస్తా మీకా పని అప్పగించి వెళ్ళిపోయేడా?" అంటాడు. 
సరి అదలా ఉండనిచ్చి మరొక విషయానికొస్తాను. అనగనగా ఓ ఆశ్రమం. ఆ ఆశ్రమానికో గురువు. ఆయనను కలవడం కోసం దూరప్రాంతం నుంచి ఓ పెద్దాయన ఒంటె మీద వస్తారు. ఆశ్రమం దగ్గరకు రావడంతోనే ఈ పెద్దాయన ఒంటె మీద నుంచి దిగి ఆశ్రమంలోకి వెళ్తారు. ఆ పెద్దాయనను చూసి రండి రండి అనగానే నమస్కరిస్తూ బహుదూరం నుంచు వచ్చానంటారు. ఎలా వచ్చారని ఆశ్రమ గురువు అడగ్గా తాను ఒంటె మీద వచ్చానంటారు పెద్దాయన. 
ఒంటెను వాకిట్లో కట్టేసేరుగా అంటారు గురువు. 
కట్టడమెందుకండీ అని ప్రశ్నిస్తారు పెద్దాయన. 
అలా అంటారేంటీ....కట్టకపోతే అది ఎటైనా వెళ్ళిపోవచ్చు లేదా ఎవరైనా తరలించుకునిపోవచ్చు ...ఎందుకైనా మంచిది దాన్ని కట్టేయండి అన్నారు గురువు.
"కట్టడమెందుకండి...అంతా దేవుడే చూసుకుంటాడు. అతనిపై నాకు పూర్తి నమ్మకముంది" అంటారు పెద్దాయన. 
అందుకే నమ్మకాలు ఒక్కోరకంగా ఉంటాయి. ఎవరినో ఒకరిని నమ్ముతాం. కానీ ఆ నమ్మకం ఎప్పటికీ నిలకడగా ఉంటుందా అనేదే ప్రశ్న. పరిస్థితులకు అనుగుణంగా ఈ నమ్మకాన్ని మార్చేసుకునే వాళ్ళూ ఉంటారు. అందుకే అంటాను. నమ్మకం అనేది బలమైన మాట.  నమ్మకం అనే మాట మారనిదే కానీ మనమే నమ్మకాన్ని మార్చేస్తుంటాం. అందుకే గుడ్డిగా ఏదీ నమ్మకూడదు. ఒకదానిపై నమ్మకం కలిగిన తర్వాత దాన్ని సమీక్షించుకోవలసిన అవసరం ఉంటుంది. 
ఏమంటారు?