నా రాతాకోతా తాహతకు మించినదే!!:--- యామిజాల జగదీశ్
 నేనెలా రాయడం మొదలుపెట్టాను? ఎలా చదవడం మొదలుపెట్టాను? వంటి ప్రశ్నలకు జవాబు మా అమ్మే. 
నాతో అఆలు రాయించింది అమ్మే. అక్షరాల కూర్పుతోపాటు పదాలను ఎలా పలకాలో నేర్పిందీ అమ్మే....
కానీ అచ్చులో పేరు చూసుకోవాలి అనే ఆశ కలగడానికి కారకులు మాత్రం మా నాన్నగారే. 
ఆయన రాసిన వ్యాసాలూ పద్యాలూ అవి పోస్టులో పంపడం, అవి అచ్చయిన పత్రికలూ ఇంటికి రావడం, అవి చూసి నాకూ ఏదో ఒకటి రాయాలని అనిపిస్తుండేది. అయితే ఆ ఆశ నిజమే. కానీ రాసే శక్తేదీ? భావాలున్నా భాష మీద పట్టు లేదుగా.  కానీ ఆశ గతించలేదు. వెంటే ఉంటూ వచ్చింది.
మొట్టమొదటగా అచ్చులో నా పేరుమీద చూసుకున్న రచన రామకృష్ణపరమహంస చెప్పిన కథనే తిరగరాసాను. కోడంబాక్కం (మద్రాసు) నుంచి వెలువడిన "మిలియన్ జోక్స్" అనే మాసపత్రికలోనే మొట్టమొదటిసరిగా నా పేరు చూసుకున్నా. ఆ కథ రాయించింది మా నాన్నగారే. రామకృష్ణా మఠం వారు పరమహంస చెప్పిన కథలను కొరకరాని కొయ్యలాటి భాషలో ఓ పుస్తకం వేసారు.ఆ పుస్తకం నాకిచ్చి వాటిలో కొన్ని రాయించారు నాకు తెలిసిన మాటలతో. నాన్నగారు వాటికి తుదిమెరుగులు దిద్దారు.   
కథ అచ్చవడం కన్నా అచ్చులో నా పేరు చూసుకోవడం ఎంతో ముచ్చటేసింది. ఆ తర్వాత నీతికథలు ఏదో ఒకటి రాయిస్తుండేవారు. 
మా నాన్నగారిలా కాదుగానీ శైలిలో చలంగారిని అనుకరిస్తూ రాయాలనే ఆశ ఉండేది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కవితా సంపుటాలకు చలంగారి అనువాదాలు గీతాంజలి, వనమాలి, ఫలసేకరణ, కాన్క వంటి పుస్తకాలను మా అన్నయ్య ఆనంద్ పుణ్యమాని చదివినప్పుడు ఆ రచనాతీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. నేను రాస్తే అలాగే రాయాలి అనుకుని వాటిని ఒకటికి రెండుసార్లు చదివాను. కానీ కలం పట్టుకుంటే అవే మాటలు పడేవి తప్ప నేననుకున్నవి రాయలేకపోయాను. కారణం, నాకు భాష మీద పట్టు లేకపోవడమే. ఇప్పటికీ అంతే. భాష విషయంలో నేను తగిన కృషి చేయలేదన్నది నిజం.
"అమ్మభాష"ను ఓ క్రమపద్ధతిలో చదవలేదు. వ్యాకరణం తెలీదు. అలంకారాలు తెలియవు. ఛందస్సు పూజ్యం. అయినా చదివేందుకు ఇంట్లో పుస్తకాలకు కొదవలేదు. ఇల్లు చిన్నదే అయినా మా నాన్నగారి పుస్తకాలనేకం. అవి తిరగేస్తుండేవాడిని. వావిళ్ళ సంస్థవారు తాత్పర్య సహితంగా వెలువరించిన ప్రబంధాలను చదువుతుండే వాడిని. అందులోని సారాంశంకన్నా మాటలవాడుకపై దృష్టి పెట్టే వాడిని. జయదేవుడి గీతగోవిందాన్ని ఎంతో ఇష్టపడి చదివేవాడిని. 
పత్రికారంగంలో ప్రవేశించడానికి ముఖ్యకారకులు సుప్రసిద్ధ పాత్రికేయులు జి. కృష్ణగారు. ఆయనను ఆదర్శంగా తీసుకునే అడుగిడి దాదాపు ముప్పై ఏళ్ళు కొనసాగినా రాణించలేకపోయాను. అందుకు కారణం తగినంత కృషి చేయకపోవడమే. సబ్ ఎడిటర్ అవడానికి కారకులు రమణ, కె.ఎన్.వై పతంజలిగారు. 
అయితే ఏదో ఒకటి రాయిస్తూ నన్ను ప్రోత్సహించిన వారిలో మరచిపోలేని వారు స్వామి సుకృతానంద గారు (శ్రీరామకృష్ణ ప్రభ), అప్పారావుగారు (బుజ్జాయి), డివిఆర్ భాస్కర్ గారు (సాక్షి), టి. వేణుగోపాల్ గారు సాక్షి), శ్యామల గారు (వార్త), వేదాంతసూరి గారు (మొలక). 
రచనా పరంగా నాకు తృప్తినిచ్చినవి జెన్ కథలు, గీతాంజలి (అనువాదం, బుజ్జాయి మాసపత్రిక), గాంధీజీ జీవితంలో సంఘటనలు (ఏడేళ్ళుపైగా వెలువడ్డాయి బుజ్జాయిలో), నెపోలియన్ జీవిత గాథలు (బుజ్జాయి), పుట్టిపెరిగిన మద్రాసుతో నాకున్న అనుబంధం, ముచ్చట్లు (మొలక, వెబ్ మ్యాగజైన్)
నన్ను ప్రభావితం చేసిన రచయితలు చలంగారు (తెలుగులో), ఎస్. రామకృష్ణన్ (తమిళం).
ఇంగ్లీషు రాకపోయినా అమ్మభాష మీద గట్టి పట్టు లేకున్నా నలబై ఏళ్ళుగా అవీ ఇవీ రాస్తూనే ఉండటం పెద్దల ఆశీస్సులనే అనుకుంటాను. అంతేతప్ప నా అరకొర జ్ఞానానికి ఇంత సుదీర్ఘకాల రచనాప్రక్రియ నా స్థోమతకు మించినదే.

కామెంట్‌లు