మరకమంచిదే: -సత్యవాణి

 అది తరగతి గది
తెలినురగల నవ్వులతో
రవ్వలలా వెలుగుతున్న
మొఖాలతో
మొగ్గలు తరగతి గది ప్రవేశం చేశారు
మంత్రించినట్లు
నవ్వులాగిపోయాయి 
శారీరక విజ్ఞానశాస్త్రపాఠం 
టీచర్ విశదీకరిస్తోంది 
అర్థమయ్యీ అవ్వకుండావుంది తరగతి విద్యార్థులకు అది
టీచర్ ఒక మొగ్గను ప్రశ్నించిది
పాఠంలోని విషయం
చివాలున లేచింది మొగ్గ
ఆమె తెల్లని స్కర్ట్ పై ఎర్రటి మరక
మొగ్గ విచ్చుకొంది
తరగతిలో కోలాహలం
గుసగుసలు 
పకపకలు వికవికలు
 బిత్తరపోయింది మొగ్గ
సిగ్గుతో తలదించుకొంది
కనులనుండి ధారలుగా కన్నీరు
తరగతిలోని మరిన్ని మొగ్గలు
మరింతగా సిగ్గుతో ముడుచుకుపోయాయి
భయంతో బెంబెలెత్తాయి
పాఠం బోధించే టీచర్ 
మొగ్గప్రక్కకొచ్చింది
ఆ చిన్నారి మోమును పైకెత్తింది
కనులనీరు వత్తింది
హత్తుకొంది మొగ్గను హృదయానికి
శరీర నిర్మాణ శాస్త్రపాఠాన్ని
మరింతగా విపులీకరించింది ఆమె
స్త్రీలుగా జన్మించిన
మాఅమ్మా
మీఅమ్మా
మా అక్క 
మీఅక్క
మీ కనులెదురుగా వున్న నేను
రేపు కాబోయే మీభార్యలు
అందరూ ఈ స్థితి దాటవలసిందే
పరిపూర్ణమైన స్త్రీగా అంగీకరిస్తూ ప్రకృతి ప్రసాదించిన ప్రశంసా పత్రమిది
మొగ్గ సగర్వంగా తలనెత్తింది
ఆమెకనులలో ఒక మెరుపు
టీచరుకి నమస్కరించి
కదిలింది మొగ్గ
తడబడని అడుగులతో
తనదైన ఈ ప్రపంచంలోనికి