ఆమె కోసం !!:- -- కె ఎస్ అనంతాచార్య

 అగాధ సముద్రాన్ని  ఆవాహనచేసుకొని
 మళ్లుగా పంచే ఆత్మీయత 
నమ్రoగా  కదిలి ఎగసిపడే కరుణా తరంగాలు
  ఊపిరి తో
గుస గుసగుసలాడే  శబ్దపల్లవాలు
 కొసరి కొసరి  వడ్డించే మమతలు
రెండక్షరాల ప్రేమ ను
ఉగ్గుపాలతో అందించిన అమ్మ !
పాశంలో బంధించే ప్రేయసి
రాఖీలో తళ తళలాడే  చెల్లి 
ఒకే ఇంతి బహురూపాల  పూబంతి
ఆమె లేని ఇల్లు గువ్వలేని గూడు
మువ్వలేని నాట్యం
  ముగ్గు చెదిరిన ముంగిలి 
రూపం  అపురూపం  
ఆమె సామాన్య తరుణి కాదు 
అనితర సాధ్యమై
 ఆకాశానికి ఎగిరిన లోహ క్షిపణి
  
ప్రాణాన్ని  అడ్డువేసి ప్రేమ కుట్లు తో నిలబెట్టే  సావిత్రి  
చీకట్ల పై సంధించిన అక్షర శరం  
ఆమె ఎప్పుడూ త్యాగమయి 
 కన్ను బాధను 
పెదాలు చిరునవ్వును ఏక కాలంలో
చిందించే అనురాగ మయి !
 పనిలో కదిలే పొద్దు తిరుగుడు పువ్వు రాత్రి పూట వికసించిన కలువ
ఇంటి గౌరవం  నిలబెట్టిన  నిచ్చెన  నిచ్చెలి
 కీలక నిర్ణయాల లో కరివేపాకు అయినా  మర్యాదను దాచలేని వ్యాపకం!
 ప్రేమ్ కట్టి ఆరాధించే జ్ఞాపకం ! 
జన్మ కారణాన్ని మరిస్తే  నిన్ను గోడ మీద నల్ల బొగ్గు గీతలుగా మారుస్తారు  పువ్వుల్ని నలిపేస్తే  పచ్చని రుధిరo నిన్ను వధిస్తుంది వారసత్వం అందిస్తూ కనిపించే బ్రహ్మ ఈ నాగరికత నిలిపే కొమ్మ
 నిత్యం సత్యమై ఆమె కోసం కదిలే దివిటీలు
 కావాలి 
ఆరాధించే ఆప్తుల మవ్వాలి
( మహిళా దినోత్సవం సందర్భంగా)