భలే అమ్మాయి (కథ) సరికొండ శ్రీనివాసరాజు


  " నిన్ను మీ పెద్దమ్మ ఇంటికి పంపడం పొరపాటు అయింది. అక్కడ క్యారంబోర్డు ఆటకు బానిస అయినావు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒకటే నస క్యారం బోర్డు కొనివ్వమని. నాలుగు రోజుల నుంచి సరిగా అన్నం తినడం లేదు. అసలే మీ నాన్నకు వచ్చేది అంతంత జీతం. కొనలేము. అర్థం చేసుకోవాలి కానీ ఇలా మమ్మల్ని వేపుకు తింటే ఎలా?" అని సిరిని కసిరింది తల్లి శివాని. అయినా సిరిలో మార్పు రాలేదు. సామదానభేద దండోపాయాలను ప్రయోగించినా అదే మంకుపట్టు. 

చివరికి తండ్రి పరమేశు కూతురిని వెంట తీసుకుని వెళ్ళి, వెయ్యి రూపాయల ఖరిదైన క్యారంబోర్డు కొని ఇచ్చాడు. "నాలుగు రోజులైంది కడుపు నిండా అన్నం తిని. ఈరోజైనా మంచిగా తిను." అని అన్నాడు పరమేశం. అలాగే అని తల ఊపింది సిరి. ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో ఓ పన్నెండేళ్ళ బాలుడు వెక్కి వెక్కి ఏడుస్తూ కనబడ్డాడు. పరమేశు ఆ బాలుని దగ్గరకు వెళ్ళి, కారణం అడిగాడు. "మా అమ్మకు జలుబు, విపరీతమైన జ్వరం, దగ్గు, తలనొప్పులు ఉన్నాయి. డాక్టర్ రాసిన మందులు తెమ్మని అమ్మ నాకు మందుల చిట్టీ, వెయ్యి రూపాయలు ఇచ్చింది. డబ్బులు ఎక్కడో పోయాయి. అసలే నిరుపేదలం. అమ్మను ఎలా కాపాడుకోవాలి?" అని మరింత గట్టిగా రోదించసాగాడు ఆ బాలుడు. వెంటనే పరమేశు షాపుకు వెళ్ళి క్యారంబోర్డు వాపస్ ఇచ్చాడు. తెలిసిన షాపే కనుక షాపు యజమాని వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చాడు. "ఇంకోసారి క్యారంబోర్డు కొనిస్తాలే తల్లి." అంటూ కూతురికి చెప్పాడు. సిరి మౌనంగా, ముభావంగా ఉంది. 

 ఇంటికి వెళ్ళిన వెంటనే సిరి తల్లితో "అమ్మా! నాకు చాలా ఆకలిగా ఉంది. అన్నం పెట్టమ్మా." అంది. శివాని సంతోషంతో అన్నం పెట్టింది. సిరి మరీ మరీ పెట్టించుకుని కడుపు నిండా అన్నం తిన్నది. ఆశ్చర్యపోయాడు పరమేశు.