ఒక ఊరిలో ఓ బుజ్జి కుందేలు ఉంది.
దానికి అరిసెలు తినాలి అనే ఆశ కలిగింది.
వండమని అమ్మను అడిగింది.
"పొయ్యిలోకి కట్టెలు లేవురా బుజ్జోడా. అడవిలోకి వెళ్లి పట్టుకురా అలాగే వండుతాను" అంది అమ్మ.
కుందేలు కుశాలు పడింది.
నోట్లో నీళ్లు ఊరాయి.
లొట్టలువేస్తూ పాట పాడుకుంటూ అడవిలోకి వెళ్లింది.
చాలా పుల్లలు ఏరి మోపు కట్టుకుంది.
ఇంతలో ఓ సింహం వచ్చి మీద పడింది.
గట్టిగా పట్టుకుంది.
“అయ్యా! నన్ను చంపకు. పసివాడిని. నీకు
పుణ్యం ఉంటుంది. ఏం కావాలన్నా ఇస్తాను. అమ్మ అరిసెలు చేస్తాను అంది. ఎన్ని కావాలన్నా
పెడతాను. నన్ను వదులు" అంది బుజ్జి కుందేలు.
సింహం గర్జించింది. "అరిసెలు తినటానికి
నేనేమన్నా ఎలుకను అనుకున్నావా? వేలెడంత లేవు. అరిసెలు ఆశ చూపి తప్పించుకుపోవాలనే? ఆ
పప్పులేం ఉడకవు. ఉండు నీ పని పడతాను. పదా పోదాం. నా గుహలో ఉంచుతాను. తాళం
వేస్తాను. స్నానం చేసి వచ్చి తినేస్తాను" అన్నది.
బుజ్జి కుందేలును గుహలో బంధించింది.
స్నానానికి చెరువుకు వెళ్లింది.
"ఇప్పుడు ఎలా తప్పించుకోవాలబ్బా! ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. లేకపోతే కాసేపట్లో
సింహం నోట్లో ఉంటాను" అనుకుంది కుందేలు.
గుహలో అక్కడక్కడ పడి ఉన్న జంతువుల ఎముకలు ఏరుకుంది.
దండలాగా అల్లుకుని మెడలో వేసుకుంది.
ఏనుగు పుర్రెను తలకు తగిలించుకుంది.
ఎద్దు కొమ్ములు నెత్తికి పెట్టుకుంది.
పులి చర్మాన్ని మొలకు చుట్టుకుంది.
చచ్చి పడి ఉన్న నక్క నెత్తురు మూతికి రాసుకుంది.
వంట గదిలో బూడిద వళ్లంతా పూసుకుంది.
అచ్చం బ్రహ్మరాక్షసిలా తయారయింది.
సింహం ఈల వేసుకుంటూ వచ్చింది.
"మంచి విందు, భలే భలే విందు. వసందుగా
ఉంది. పసి కుందేలు మాంసం తిని ఎన్నాళ్లు
అయిందో? మెత్తగా మింగేయాలి. జున్ను
ముక్కలా నంజుకోవాలి. పరమాన్నంలా
జుర్రుకోవాలి" అనుకుంటూ తాళం తీసి తలుపు నెట్టింది.
ఎదురుగా ఉన్న బ్రహ్మరాక్షసిని చూసింది.
బెదిరి ఒక్క గెంతు గెంతి పరుగు లంకించుకుంది.
వెనక్కి చూడకుండా పారిపోయింది.
నీతి : ఉపాయాలు ఉంటే అపాయాలు ఏమీ చేయలేవు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి