స్వఛ్ఛ భారతీయులు: - సత్యవాణి
 ఎవరూ చెప్పనక్కరలేదు
చేయండాపనని
చీపురు చేత పట్టకనే
చెత్త ఏరేస్తారు చకచకా
ఫోటోలకు ఫోజులివ్వరు
వందిమాగదులు వెంట రారు
పత్రికలలో టీవీల్లో
వీరిగురించి రాతలక్కరలేదు 
ఒంటరి సైనికులు వారు
అపుడపుడు జంటగా
కుస్తీలు పడతారు చెత్తకై వారు
చెత్తను జాగ్రత్తగా పరిశోధించే పరిశోధకులు వారు
అణువణువుగాలిస్తారు చెత్తను
వారు చెత్తలో మణిమాణిక్యాలకై వెదుకులాడరు 
ధనంతో బలిసిన బాబులు
తాగి విసిరి పారేసిస్తే పగిలిన సీసాబుడ్లె వాళ్ళపాలిటి
పూటగడిపే కామధేనువులు
పొగరు బలసిన ఆసాములు
సగంకాల్చిపారేసిన సిగరెట్ పీకలెే వారికి అపురూపాలు
కడుపునిండిన బాబులు
కాలదన్నిన రొట్టెముక్కలకై
కుక్కలతో పందులతో పోరాటం చేసి చేజిక్కించుకొనే
యోధులువారు
ఆ మట్టికొట్టిన రొట్టెలతో ఆపూట
కడుపు నింపుకోవలనే ఆరాటం వారిది
దొరికిందా రొట్టెముక్క
ఆరోజు వారికిక పండుగే
లేదా ఆరోజుకిక పస్తుతో
వారి కడుపు మండుటే