తేనెలొలుకు తెలుగు-:- రామ్మోహన్ రావు తుమ్మూరి


 ‘కావ్యేషు నాటకం రమ్యం’ 

అన్న మాట చాలా సార్లు విని ఉంటాం. సంస్కృతంలో కాళిదాసు రచించిన ‘శాకుంతలం’గొప్ప రచనగా పేరు పొందిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఇవన్నీ మనకు కాస్తో కూస్తో సాహిత్య పరిజ్ఞానం ఏర్పడ్డ తరువాత తెలిసిన విషయాలు.ఒక్కసారి మవందరం మన బాల్యాల్లోకి తొంగి చూసినట్లయితే తప్పకుండా మనం చూసిన నాటకాలు గుర్తుకు వస్తాయి.

పల్లెల్లో చిరుతల రామాయణం,సుగ్రీవ విజయం వంటి యక్షగానాలు,చిందు బాగోతం, ఇలా జానపద కళా రూపాలయితే, పట్టణాల్లో,పెద్దపెద్ద  గ్రామాల్లో  సురభి కంపెనీ వారు గానీ కొన్ని నాటక సమాజాలు గానీ  సత్య హరిశ్చంద్ర, పాండవోద్యోగ విజయం, గయోపాఖ్యానము, చింతామణి, బాలనాగమ్మ,అల్లిరాణి,కనకతార,రంగూన్ రౌడీ, భక్తరామదాసు మధుసేవ పాలేరు వంటి ప్రసిద్ధ నాటకాలు అప్పట్లో విరివిగా ఆడేవారు.ఇప్పటిలా సినిమాలు, టీవీ సీరియళ్లు లేని కాలంలో అవే జనాలకు వినోద కాలక్షేపాలు. ఇదంతా అర్ధశతాబ్ది కిందటి ముచ్చట.

 అయితే అప్పుడు ప్దదర్శించబడిన దాదాపు అన్ని నాటకాల్లోనూ పద్యాలుం డేవి.ఆ పద్యాలు రాగయుక్తంగా పాడి హావభావాలతో పాత్రోచితంగా నటిస్తుంటే తెల్లవారు జాముదాకా నాటకాలు చూచేవాళ్లు.కరంటు కూడా లేని రోజుల్లో దివిటీల వెలుగులో, పెట్రొ మాక్స్ లైట్ల వెలుగులో ప్రదర్శించే వారు.అప్పటి నాటకాలు పామరులకు సైతం పద్యాలు నేర్పాయి.పొట్టచీరితే అక్షరమ్ముక్క రానివారు కూడా 

చెల్లియొ చెల్లకో తమరు సేసిన యెగ్గులు సైసిరందరున్

తొల్లి గతించె నేడు నను దూతగబంపిరి సంధిసేయ నీ

పిల్లలు పాపలున్ ప్రజలు పెంపువహింపగ సంధి సేసెదో

ఎల్లి రణంబె కూర్చెదవొ ఏర్పడజెప్పుము కౌరవేశ్వరా

ఎలుగెత్తి పాడేవారనేది 

అతిశయోక్తి కాదుగదా!

వీటితో పాటు సందర్భానుసారంగా కీర్తనలు,నృత్యగీతాలు,భజనలు ఇలా నాటక సాహిత్యానికి అప్పట్లో అత్యంత ఆదరణ ఉండేది.

రామదాసు నాటకంలో 

‘ఏ తీరుగ నను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా!

నా తరమా భవ సాగరమీదను నళినదళేక్షణ రామా!’

అలాగే 

‘సీతాకు జేయిస్తి చింతాకు పతకము రామచంద్రా’

‘రామరామ రఘురామ పరాత్పర రావణ సంహర రఘుధీరా’

ఇంకా ఎన్నో రామ దాసు రాసిన పద్యాలు అప్పటి ప్రజల నాలుకల మీద నర్తించేవి

చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర, హరిశ్చంద్రలో నక్షత్రకుడు,చిరుతల రామాయణంలో బుడ్డెన్ ఖాన్ వంటి హాస్య పాత్రలు నాటి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయిన పాత్రలు.వారి సంభాషణలు నాటి కళాస్వాదకులకు కంఠోపాఠాలు.

అత్తగారిచ్చిన అంటునామిడి తోట సుబ్బిశెట్టి పద్యం ఎంతో ప్రసిద్ధం

శోకరసప్రధానమైన హరిశ్చంద్ర నాటకంలో ముఖ్యంగా కాటి

సన్నివేశంలో జాషువా పద్యాలకు ఎంత ప్రాచుర్యం లభించిందో చెప్పలేం.

ఎన్నో ఏండ్లు గతించి పోయినవి కానీ  స్మశానస్థలిన్

కన్నుల్మోడ్చిన మందభాగ్యుడొకడైనన్ లేచిరాడు అకటా

ఎన్నాళ్లీ చలసమ్నులేని శయనమ్ములే తల్లుల్లాడిరో

కన్నీటంబడి కాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్


అలాగే ‘ఇచ్చోటనేగదా’,మాయామేయ జగంబె నిత్యమని సంభావించి’ పద్యాలు కూడా ప్రాచుర్యం పొంగాయి.


రాయబారం పద్యాలు 

‘జండాపై కపిరాజు.’

‘ముందుగ వచ్చితీవు మునుముందుగ అర్జును నేను జూచితిన్’

బావా ఎప్పుడు వచ్చితీవు’

పద్యాలు తెలుగు నాటకపద్యాలలో మణి రత్నాలు

సాహిత్యం ఒక ఎత్తైతే సంగీతం మరొక ఎత్తు.అప్పట్లో పద్యానికి వన్స్ మోర్ అనే విషయం నటుల గాయన పాటవానికి పరీక్షగా ఉండేది.బాలనాగమ్మలో 

ఆడుదినవ్వెనా అఖిల సర్వస్వమ్ము

అనేపద్యం ఆడవారి అన్ని కోణాలను ఎంతో రమ్యంగా వివరిస్తుంది.

అలాగే కృష్ణ తులాభారంలో ‘మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి’

బహుళ ప్రాచుర్యం పొందిన గీతం.

ఇంకా చెప్పాలంటే చాలానే ఉంది.కానీ నా ఉద్దేశం మిమ్మల్ని ఒకసారి మన తెలుగు నాటక సాహిత్యం వైపు దృష్టి సారించేలా చేయడమే.

 నల్లనయ్య నయగారాల నవనవోక్తులు, ’నవఖండ భూమండలాధిప మకుటతట ఘటిత మణి ఘృణి నిరంతర నీరాజిత నిజపాద పంకేరుహుండను’వంటి సుయోధనుని వాక్తటిల్లతలు,

’ధ్వాంతోధ్వాంత ధూమధూమకర జంఝామారుత శిలోచ్ఛయ భిన్న దంభోళినీ’వంటి మాయలఫకీరు ఉరుములవంటి మాటలు,

నారదుని  వాక్చమత్కృతులు,శకుని కపటపువంకర మాటలు, సుబ్బి శెట్టి ఎగపోతల బొంగురు గొంతు గరగరలు ఇలా చెప్పుకుపోతే అనేక పాత్రల పాత్రచిత్రణకై తెలుగు కవులు సృజించిన నాటక సాహిత్యం అపారం.తేనెలొలుకు తెలుగు భాష మధురిమకు నాటకసాహిత్యం కూడా ఎంతో తోడ్పడిందనటంలో సందేహం లేదు.