ఆంధ్ర బజారు:-- యామిజాల జగదీశ్

 ఇదొక మాస పత్రిక. నూట అయిదేళ్ళ క్రితం మల్లాది సుబ్బారావు గారి సంపాదకత్వంలో ప్రారంభమైన పత్రిక. ఇది పన్నెండు పేజీల పత్రిక. ఈ పత్రిక తాలూకు కొన్ని సంచికలను చూసాను. 
నేను ఇక్కడ చెప్పబోయే సంచిక 1917 జూన్ నెలలో వెలువడింది. అప్పటికిది  ఏడో సంచిక. 
ఈ సంచికలో "మన దరిద్రత" అనే వ్యాసాన్ని మొదటి పేజీతోసహా మూడున్నర పేజీలలో ఇచ్చారు. దారిద్ర్యం ఎలా పీడిస్తుందో ఇందులో చెప్పుకొచ్చారు. పేదరికం వలన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయనే వేదాంతులు ఉన్నప్పటికీ వాటి వల్ల మనం నిత్యమూ చవిచూడాల్సి వచ్చేది అనర్థాలేనని పేర్కొన్నారు. వ్యాధి, నీరసం, అర్ధాయుస్సు, అవినీతి, బుద్ధిమాంధ్యం వంటివి దరిద్రత వల్ల తలెత్తుతాయన్నారు.
ఇక రెండవ వ్యాసం చెన్నపురాంధ్ర సభ – విద్యాశాక వారి వారి గ్రంథాలయోద్యమం. చెన్నపురిలో ఆంధ్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వారి పురోభివృద్ధికోసం తోడ్పడే సంఘాలు లేవనే ఉద్దేశంతో ఈ సభ వివిధ శాఖలతో నెలకొల్పబడి చేస్తున్న పనులను ఈ వ్యాసంలో ప్రస్తావించారు. అప్పట్లో ఈ సభకు రావు బహద్దూర్ పిట్ట త్యాగరాయ శెట్టిగారు అధ్యక్షులు. వేదము వేంకటరాయశాస్త్రిగారు గ్రంథాలయాధికారిగా వ్యవహరించారు.
మూడో వ్యాసం విద్యావిషయానికి సంబంధించినది. ఈ వ్యాసంలో ఓ చోట అర గంట కంటే ఏ క్లాసు విద్యార్థులనైనా తోటలలో ఉంచటం మంచిది కాదని సూచించారు. ఉపకరణాల పేర్లను పిల్లలకు తరుచూ టీచరే చెప్పాలన్నారు.
తర్వాతి వ్యాసం వ్యవసాయానికి సంబంధించినది. బొప్పాయి చెట్టు గురించి ఇచ్చారు. బొప్పాయి చెట్లలో పదమూడు రకాలు ఉన్నాయన్నారు. ఉష్ణ దేశాలలో మొగ చెట్లు కాపు కాయవని, చల్లని శీతోష్ణం గల చోట్ల మొగ చెట్టు ఎంత ఎత్తుగా పెరిగితే అంతగా వాటికి కాపు కాసే గుణం ఉంటుందన్నారు. 
అలాగే ముష్టి సుబ్బయ్యగారి వ్యాసం కూడా ఈ సంచికలో ఇచ్చారు. అది కాలమానం గురించి. 
పరిశ్రామిక విషయంగా అరటి నార గురించి పదో పేజీలో మరొక వ్యాసం ఇచ్చారు. నారను ఉడకబెట్టడం వల్ల బరువు తగ్గుతుందని ఈ వ్యాసంలోమి మొదటి వాక్యం.
పదకొండో పేజీలో తమ పత్రిక ప్రకటన ధరలను పేర్కొన్నారు. తమ మాస పత్రికను ప్రతి నెలా వందల కొద్దీ చదువుతున్నారని, తెలుదు దేశంలోనే కాకుండా తెలుగు వారు ఎక్కడుంటే అక్కడికల్లా ఈ పత్రికను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. 
ఇది వ్యాపార పత్రిక కనుక ఇందులో ప్రకటనలు వెలువడితే అది వ్యాపారులకు ఎంతో లాభదాయకమని తెలిపారు. మొదటిపేజీలో ప్రకటనకైతే నెలకు అయిదు రూపాయలు, మూడు నెలలకు పదిహేను రూపాయలు, ఆరు నెలలకైతే ముప్పై రూపాయలు, ఏడాదికైతే యాభై రూపాయలని రేట్లు ఇచ్చారు. అలాగే అర్థ పేజీ, పాతిక పేజీ ప్రకటనలకు కూడా వివిధ రేట్లు ఇచ్చారు.
చివరి పేజీలో వ్యాపార సూచిక ఇచ్చారు. ఈ కాలమ్ కింద పేరు, విలాసం ప్రచురించడానికి ఒక పంక్తికి మూడు అణాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ పేజీలోనే మరొక ప్రకటన కొఠి సాంబశివరావు అండ్ కంపెనీ వారిది. ఇది మదరాసులోని పార్క్ టౌన్ లో వెంకటాచల మొదలి వీధిలో ఉంది. ఈ సంస్థ వద్ద గోడలకు సున్నానికి బదులు వేసే డిస్టెంపరు రంగులు, నీటితో కలిపి గోడకు రాసినంతమాత్రాన శాశ్వతంగా నిలిచిపోయే రంగులు, అక్కడక్కడ ఏ విధమైన డాగులైనా అయితే నీళ్ళతో కడిగేస్తే తిరిగి తళుకుమనే రంగులు ఈ సంస్థ వారి దగ్గర దొరుకుతుందన్నారు.