సూర్యుడి అహం:-- యామిజాల జగదీశ్

 కోడి కూసింది. కొక్కరొక్కో అన్న కోడి  కూత వినడంతోనే సముద్రంలో స్నానం చేసి పైకొచ్చాడు సూర్యుడు.
"రా, తమ్ముడూ రా!" అంటూ తన అలల చేతులను చాచాడు సముద్రుడు. అంతే కాదు, ఎంతో ప్రేమతో సూర్యుడిని స్వాగతించాడు. కానీ సూర్యుడికి అది నచ్చలేదు.
"నేను నీకు తమ్ముడా....ఛీ! ఛీ!! నీకు నేను తమ్ముడినా....? ఈ ప్రపంచం  యావత్తుకీ నా వల్లే వెలుగందుతోంది. నేనెక్కడా? నువ్వెక్కడా? నువ్వెప్పుడూ నన్ను తమ్ముడూ అని పిలవకు. ఆ మాటను నీ బుర్రలోంచి చెరిపేసే" అన్నాడు సూర్యుడు.
"కావచ్చు. కాదనను. నువ్వు నా కంటే శక్తిమంతుడివే కావచ్చు. అయితే నేం....నిన్ను ప్రేమించకూడదా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?" అని అడిగాడు ఎంతో వినమ్రంగా సముద్రుడు.
"అబ్బే లేదు....నిన్ను నా సోదరుడిగా అస్సలు ఊహించలేను...తప్పుకో పక్కకు. చిన్నవాళ్ళు పడీ పడీ ఆరాధిస్తేనే పెద్దవాళ్ళు స్వీకరిస్తారు. అంతేతప్ప ప్రేమ చూపిస్తే కరిగిపోయి స్వీకరిస్తారనుకోకు...." అని చెప్పి పైకెళ్ళిపోయాడు సూర్యుడు.
"రారా వచ్చేవా! ఇంతసేపూ ఎక్కడికెళ్ళావు? ....రారా" అంటూ మేఘాలు ఎంతో ఆశతో వచ్చి సూర్యుడుని స్పృశించాయి.


దాంతో సూర్యుడికి చిర్రెత్తుకొచ్చింది. "ఛీ! పక్కకు తప్పుకో....నేనెవరో నేనేంటో నీకు తెలీదులా ఉంది. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే గొప్పవాడిని. అటువంటి నేనెక్కడా? మీరెక్కడా? మీరు నన్ను స్పృశిచండమా...? ఇంకోసారి ఇలా నన్ను స్పృశించకండి... దూరం జరగండి. మీ నీడ కూడా నన్ను తాకకూడదు" అంటూ ఇంకా పైకి వెళ్ళాడు సూర్యుడు.
అప్పుడు గాలి "నాకైనా నిన్ను స్పృశించే చనువు ఉందనుకోనా? లేక నాకూ లేదంటావా ? " అని అడిగింది.
మళ్ళీ సూర్యుడు తన గొప్పలే చెప్పుకున్నాడు. 


"నాలాగా ఈ ప్రపంచానికి వెలుగినిచ్చే శక్తి ఎవరికీ లేనేలేదు. నువ్వు నా కాలిగోటికి కూడా పనికిరావు" అన్నాడు సూర్యుడు.
"నిజమే నేను నీలాగా ఈ ప్రపంచాన్ని వెలుగుతో నింపలేను. నాకది అసాధ్యం....చేతకాదు కూడా..." అని చెప్పి తల వంచుకుంది గాలి.
"మంచిది...ఇప్పటికైనా నువ్వేంటో నీకు తెలిసింది...నీకు నేను కావాలనుకుంటే నా శరణు వేడుకో ...నీ కష్టాలు ఏవైనా ఉంటే చెప్పుకో..." అన్నాడు సూర్యుడు. 


అనంతరం సూర్యుడు ఇంకా పైపైకి పోయాడు.గాలి – సూర్యుడు మధ్య జరిగిన సంభాషణను విన్న వర్షం "నిన్ను ఆరాధిస్తాను. భక్తితో నిన్ను ప్రార్థిస్తాను" అంటూ తన భక్తిని ప్రదర్శించింది.
"నువ్వు నాకు నచ్చావు. మంచిది. ఇలాగే ప్రార్థించాలి నన్ను నువ్వు...సరేనా...మిగిలిన వారికి నీకు తెలిసినదాంట్లో కనీసం రవ్వంతైనా తెలిస్తే బాగుండేది" అన్నాడు సూర్యుడు.
ఇంతలో సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమైంది.
తాను అస్తమిస్తే ఈ ప్రపంచమే అస్తమించాలి చీకట్లో మగ్గాలి అనుకుంటూ పర్వతశిఖారల మాటుకు వెళ్లాడు సూర్యుడు.
"నువ్వు అస్తమించినంత మాత్రాన ఈ ప్రపంచం అస్తమించదు...అది తన పని తాను చేసుకుపోతుంది...నీకు మళ్ళీ రేపు ఉదయం వరకూ పనీపాటా లేదు... నువ్వు అస్తమించాల్సిందే" అంది పర్వతం.
"నువ్వు చెప్పడం విచిత్రంగా ఉంది వినడానికి...నేను అస్తమిస్తే ఈ లోకం యావత్తూ అస్తమించాల్సిందే. అందుకు తిరుగులేదు. నేను లేకుంటే ఇంకెవరీ ఈ ప్రపంచానికి?" అన్నాడు సూర్యుడు.
అప్పుడు పర్వతం "అదిగో అటు చూడు....అక్కడో పూరిపాక కనిపిస్తోందా....చూడు...." అన్నాది.
సూర్యుడు పూరిపాక వంక చూశాడు.
ప్రశాంతంగా ఉంది. ఏ మాత్రం హడావుడి లేకుండా ఆ పూరిపాకలో ఓ దీపం వెలుగుతుండడం కనిపించింది. ఆ వెలుగుతో పూరిపాక కాంతివంతమై కనిపించింది. తన ప్రమేయం లేకుండానే దీపం వెలుగుతూ కాంతి ప్రసరించడంతో సూర్యుడి అహం అణిగింది ఆరోజుతో.