హస్తవాసి డాక్టర్: -- యామిజాల జగదీశ్

 నాకొక తమిళ మిత్రుడున్నాడు. ఆయన పేరు షణ్ముగవడివు. పండితుడు. హాస్యం ఆయన ప్రాణం. ఆయన ఉపన్యాసాలన్నీ జీవితపయనంలో చవిచూసిన సంఘటనలను చెప్పి నవ్వించడంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. 
ఆయన చూసిన ఓ వైద్యుడి కథ ఇది. ఆయన ఓ హస్తవాసిగా చెప్పుకుంటారు. మామూలుగా అయితే హస్తవాసి అంటే పాజిటివ్ గా చెప్పుకోవడం కద్దు. కానీ ఈ డాక్టర్ హస్తవాసి కాస్త భిన్నం. 
ఆ డాక్టరున్న ఊళ్ళోనే ఒకడున్నాడు. అతని తండ్రి మంచానపడ్డాడు. ఇవాళో రేపో పోతాడనే అంత్యదశలో ఉన్నారాయన. ఏ క్షణంలోనైనా ప్రాణం పోవచ్చని అనుకుని సమీప బంధువులకు టెలిగ్రాం ఇచ్చాడు. అది సెల్ ఫోన్లు లేని కాలం. 
అతని టెలిగ్రాం అందడంతోనే ఓ ఇరవై అయిదు మంది తరలి వచ్చేసారు. 
కానీ జరిగింది వేరు. ఇవాళో రేపో పోతాడనుకున్న పెద్దాయన పోవడం లేదు. ఊళ్ళ నించి వచ్చిన వాళ్ళందరూ మళ్ళా ఊళ్ళకెళ్ళి ఏమొస్తామన్నట్లు ఇక్కడే ఉండిపోయారు. ఓ వారం పది రోజులైంది.
దిగువ మధ్యతరగతి కుటుంబీకుడు. ఇంతమందికి అన్నపానాదులకవుతున్న ఖర్చును భరించలేకపోతున్నాడు. దిగాలుగా అటు ఇటూ తిరుగుతుంటే పొరుగింటతను పలకరించాడు. ఏమిటి దిగులుపడు తున్నావు అని అడిగాడు. 
అప్పుడతను విషయాన్ని చెప్పాడు. 
"ఇదేంటీ...ఈ విషయం నాకు మొదటే చెప్పాల్సిందిగా. మన ఊళ్ళోనే రెండు వీధులవతల ఓ డాక్టరున్నాడుగా. ఆయన దగ్గరకు తీసుకెళ్ళు మీ నాన్నని...ఆయన మిగిలిన పని కానిచ్చెస్తాడు....ఇలా అన్నానని అపార్థం చేసుకోకు.మీ నాన్నా చిన్నవారేం కాదు. తొంబైలో పడ్డారుగా" అన్నాడు పక్కింటతను.
వెంటనే అతను తన తండ్రిని డాక్టర్ దగ్గరకు తీసుకుపోయి విషయాన్నంతా చెప్పాడు. 
అతను చెప్పినదంతా విన్న డాక్టర్ "ఒట్టి తెలివితక్కువవాడివి నువ్వు. నీకు బుర్రలేదు. మొదటి రోజే నా దగ్గరకొస్తే ఈ పాటికి పది రోజులైపోయేదిగా. సరేకానీ ఇప్పటికైనా వచ్చావు. నీ పనై పోయింది...నువ్వు మీ నాన్నను మోసుకెళ్ళు. తత్తిమా ఏర్పాట్లు కానిచ్చుకో..." అంటూ ఆ ముసలాయన నాడి పట్టుకున్నాడు. 
మరుక్షణమే ఆ వృద్ధుడు టపా కట్టేసాడు. 
అంతా ఆయన చేతిమహత్యం అంటూ ఆ ఊళ్ళి వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆయన నాడి పట్టుకున్నాడంటే ఎంతటివారైనా పోవాల్సిందే తప్ప బతికే అవకాశాలంటూ ఉండవు. ఆయన తన దగ్గరకొచ్చే పేషంట్లను తీసుకుపొమ్మని చెప్పరు. ఎంతటివారొచ్చినాసరే మోసుకుపొమ్మనే చెప్తారు. ఆయనలా చెప్పారంటే మనిషి ఇక బతికే అవకాశమే ఉండదు. తుది శ్వాస పోవడం తథ్యం. ఇలా ఆయనను అందరూ "హస్తవాసి" అని అనుకునే వారు.
ఈ డాక్టర్ దగ్గరకు ఓమారు ఓ యువకుడు తన తండ్రిని తీసుకొచ్చాడు. డాక్టరా పెద్దాయనను పరీక్షించి "ఇదిగో అబ్బాయి...మీ నాన్నకిక వైద్యం అనవసరం. ఆయనకు ఏమడిగితే అది కొనిపెట్టేసే. తింటారు. అంతేతప్ప మందులూమాకులూ అంటూ డబ్బులు ఖర్చు పెట్టకు. వృధానే" అన్నారు. 
కానీ ఆ యువకుడికి డాక్టర్ మాటలు నచ్చలేదు. 
"ఏంటండీ మీరు చెప్పేది. నేను మా నాన్నను మా సొంతూరుకి తీసుకుపోయి అక్కడి డాక్టరుకి చూపిస్తాను" అన్నాడు యువకుడు. 
డాక్టరెంత చెప్పినా వినిపించుకోలేదు. 
"ఇంతకూ మీ సొంతూరేదీ?" అని అడిగాడు డాక్టర్. 
యువకుడు తంజావూరు అని చెప్పాడు. అయితే డాక్టర్ తంజావూరుకి ఓ మూడు నాలుగు ఊళ్ళ ముందున్న ఓ ఊరు పేరు చెప్పి అక్కడితో సరి అన్నాడు. 
యువకుడికి కోపమొచ్చి తన తండ్రితో ఓ కారేసుకుని బయలుదేరాడు. సరిగ్గా ఈ హస్తవాసి డాక్టర్ చెప్పిన ఊరొచ్చేసరికి ఆ పెద్దాయన ప్రాణం పోయిందట. 
కొన్ని రోజులకు ఆ యువకుడు నా మిత్రుడ్ని ఎందుకో కలిసాడు. అప్పుడీయన మీ తండ్రి ఎలా ఉన్నారు...కులాసానేనా అని అడిగారు. 
అయితే ఈ యువకుడు..."పోయారండి. ఆ హస్తవాసి డాక్టర్ చెప్పింది అక్షరాలా జరిగిందండీ...ఆయనది మామూలు నోరు కాదండి...ఆయన చెప్పినా వినకుండా మా నాన్ననేసుకుని సొంతూరుకి బయలుదేయానండి...ఈ డాక్టర్ చెప్పినంటే ఓ ఊరొచ్చేసరికి మా నాన్న పోయారండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చేమో కానీ ఈ డాక్టర్ దగ్గరకు మాత్రం వెళ్ళకూడదండి" అన్నాడు ఆవేశంగా.

కామెంట్‌లు