శ్రమలోదాగినస్వర్ణం:--.డా.బెల్లంకొండనాగేశ్వరరావు., చెన్నై

 అమరావతినగరంలో శివయ్య అనే వ్యవసాయకులి ఉండేవాడు.ఒకరోజు పొరుగు గ్రామంలో పూరిఇల్లు కప్పే పని పూర్తిచేసుకుని అమరావతికి బయలుదేరాడు శివయ్య.వస్తు గ్రామపొలిమేరలలోని సదానందుని ఆశ్రమానికి వెళ్ళాడు.శివయ్యను చూసిన సదానందుడు'ఏం నాయనా! ఇలావచ్చావు'అన్నాడు.
'స్వామి నేను ఉన్నంతలో సాటివారికి సహయపడుతూనే వచ్చాను.అటువంటినాకు ఇంతటి కష్ణతరమైన జీవితమా?తప్పుడు దారిలో పయనించి నాకళ్ళముందు ఎందరో ధనవంతులుగా మారారు.ఇదేమి న్యాయం?'అన్నాడు శివయ్య.
'నాయనా అధర్మం తాత్కాలికంగా విజయం సాధించినా నీతి,నిజాయితి,సత్యం చివరకు విజయంపొందుతాయి.నేను నీకు చేయగలిగిన సహాయం ఏదైనా  చేస్తాను నీకోరిక ఏమిటో చెప్పు'అన్నాడు సదానందుడు.
'స్వామి నాకష్టంతో బంగారుమయమైన జీవితం లభించేమార్గంచెప్పండి.మీరు చూపించిన మార్గాన్ని అనుసరిస్తా'అన్నాడు  శివయ్య.
క్షణకాలం ఆలోచించిన సదానందు తన కుటీరంలోనికి వెళ్ళి మూతిభాగం గుడ్డతోకప్పిన ఓరాగిచెంబు తెచ్చి శివయ్యకు అందించి 'నాయనా ఇందులో 96 రాగి నాణాలుఉన్నాయి.నువ్వుకష్టపడి నాలుగు బంగారునాణాలు ఈ చెంబులోవేసి ఎప్పటిలా గుడ్డకట్టి మరుదినం చెంబు నేలపై బోర్లించి చూడు వందబంగారునాణాలు కనిపిస్తాయి.అలా జరగకపోతే నీ శ్రమలో ఏదో లోపంఉన్నట్లు.అప్పుడు మరలా మరో నాలుగు బంగారు నాణాలు సంపాదించి ఈ చెంబులోవేస్తే తప్పకుండా నీబ్రతుకు బంగారుమయం అవుతుంది'అన్నాడు సదానందుడు.
సదానందుని మాటలకు సంతసించిన శివయ్య ఆయనకు నమస్కరించి రాగి చెంబుతో ఇల్లుచేరాడు.మరుదినంనుండి శివయ్య,అతనిభార్య శ్రమించి పదిలంగా ధనం దాచసాగారు.రెండు సంవత్సరాల కాలంలో నాలుగు బంగారు నాణాలు సంపాదించి రాగి చెంబులోవేసి ఉదయం రాగిచెంబు బోర్లించిచూడగా శివయ్యవేసిన నాలుగు బంగారు నాణాలే అలానే ఉన్నాయి. మిగిలినవన్ని రాగినాణాలుగా కనిపించాయి.అప్పుడు గుర్తుకువచ్చియి సదానందునిమాటలు.నీశ్రమలో ఏదైనా లోపం ఉంటే బంగారునాణాలు లభించవు అని.తనశ్రమలో ఏదో లోపం ఉందని అనుకున్న శివయ్య మరలా రెండు సంవత్సరాలు కష్టించి నాలుగు బంగారు నాణాలు సంపాదించి రాగిచెంబులో వేసి మరుదినం రాగి చెంబు బోర్లించిచూసాడు.శివయ్యవేసిన ఎనిమిది బంగారునాణాలు తప్ప మిగిలిన రాగినాణాలు అలానే ఉన్నాయి.రాగిచెంబుతో సదానందుని ఆశ్రమంచేరి 'స్వామి తమరు చెప్పినట్లే మొదట నాలుగు బంగారు నాణాలు వేసాను చెంబులోని నాణాలు మారలేదు.నాశ్రమలో లోపం ఉందని మరోనాలుగు బంగారునాణాలు వేసాను అయినా రాగి చెంబులోని నాణాలు మారలేదు'అన్నాడు.
చిరునవ్వుతో సదానందుడు 'నాయనా ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? మాయలు మంత్రాలతో ఈలోకంలో ఎవ్వరు ధనవంతులుకాలేరు.నీశ్రమలోనే స్వర్ణం దాగిఉంది అదినీకు తెలియజేయడానికే అలాచెప్పాను.పట్టుదలగా శ్రమించి ఎనిమిది బంగారు నాణాలు సంపాదించావు.ఈబంగారు నాణాలతో వ్యవసాయభూమి కొనుగోలుచేయి.ఆభూమిలో ఎప్పటిలా శ్రమించు.బంగారు పంటలు పండించు న్యాయమార్గాన కొద్దికాలంలోనే నీవు ధనవంతుడివి కాగలవు.ఎప్పటికైనా మనిషి శ్రమలో బంగారం దాగి ఉంది అని తెలుసుకోవాలి.సంపాదించిన ధనాన్ని పొదుపుగా రేపటి అవసరాలకు వాడుకో'అన్నాడు సదానందుడు.