ముఖంలో ప్రేమ కనిపించాలి:-- యామిజాల జగదీశ్
 నటి ఈశ్వరి చిన్నారికి గోరు ముద్దులు తినిపించడంకోసం వంట గదిలోంచి హాల్లోకి వచ్చింది. 
ఆమె చేతిలో వెండి గిన్నె చూడటంతోనే చిన్నారి పరుగులు పెడుతోంది. 
వెంటే నటి ఈశ్వరీ పరుగులు తీస్తోంది. 
"నా బుజ్జికదూ....నా బంగారు కదూ...నువ్వు గానీ తినకపోతే ఈ అన్నమంతా జాబిల్లికి పెట్టెస్తాను" అంటూ ఏవేవో చెప్తోంది నటి. 
ఇంతలో డైరెక్టర్ కట్ కట్ అన్నాడు. 
"ఏంటమ్మా? ఇప్పటికి ఆరు టేకులయ్యాయి. మాటలు వరకూ పరవాలేదు కానీ ముఖాన కోపం కనిపిస్తోంది. చిన్న పిల్లలు ఎంత విసిగించినా ముఖాన కోపం కనిపించే కూడదు. ప్రేమే ఉండాలి...ఈసారైనా సరిగ్గా చెయ్యండి" అంటుంటే ఈసారి టేక్ ఓకే అవుతుందండి అంది నటి.
ఆరోజుకి షూటింగ్ అయింది. నటి ఈశ్వరి ఇంటికి వచ్చింది. ఆమె ఇద్దరు పిల్లలూ పనమ్మాయి దగ్గర బుద్ధిగా కూర్చుని ఆమె చెప్తున్న మాటలు వింటూ అన్నం తినడం చూసి నటి ఈశ్వరి కంగుతింది.