'నమస్కారము'...-- ఎన్నవెళ్లి రాజమౌళి - కథల తాతయ్య


  రాజమౌళి! ప్రైవేటు టీచర్ ట్రైనింగ్ హైదరాబాద్ లో ఉంది. ట్రైనింగ్ చేద్దామా... అన్నాడు భూపతి రెడ్డి. సరే! అని నేను అనడంతో... ఇంకో ముగ్గురు, భూపతి రెడ్డి, నేను కలిసి హైదరాబాద్ వెళ్లి, ట్రైనింగ్ లో జాయిన్ అయ్యాం. అది గుర్తింపు లేని సంస్థ. రేపు గుర్తింపు వస్తది. మాపు గుర్తింపు వస్తుందని కరస్పాండెంట్ రెండు సంవత్సరాలు గడిపాడు. రోజురోజుకు ఇబ్బంది కాసాగింది. హైదరాబాదులో రూమ్ కి కిరాయి పెట్టడం, అక్కడ ఉండడం తలకు మించిన భారం కాసాగింది. ఈ కరస్పాండెంట్ తో అయితే లేదని, అప్పటి అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు జయపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం . ఆయన కరస్పాండెంట్ ను పిలిచి చీవాట్లు పెట్టాడు. వాళ్ల డబ్బులు వాళ్ళకి ఇవ్వమని బెదిరించాడు. ఏమి చేయాల్నో తెలువక ముఖ్యమంత్రి అంజయ్య దగ్గరికి వెళ్ళి కలిశాం. మా గోడు వెళ్లబోసుకున్నాము. అధికారులు పిలిచి విషయం తెలుసుకో గా.. ఇప్పటికే గవర్నమెంటు సంస్థలు ఉన్నాయి. మళ్లీ నీ ఈ ప్రైవేటు సంస్థలకు గుర్తింపు ఇస్తే... వాళ్లకు, వీళ్లకు ఉద్యోగం కల్పించడం ఇబ్బంది అవుతుంది సార్ అని అన్నారు. అదేదీ నాకు చెప్పొద్దు. నేను నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నేను చెప్పింది చేయాల్సిందే... గుర్తింపు ఇవ్వాల్సిందే.. అదీకాక, వీళ్లకు ఒక్కొక్కరికి పెళ్లిళ్లు అవడమే కాక, పిల్లలు కూడా అయ్యారు. వీళ్ళ బతుకులు ఏమి కావాలి అన్నాడు. అధికారులు కిమ్మనకుండా సరేనన్నారు. గుర్తింపు వచ్చింది. హాల్టికెట్ కూడా ఇచ్చారు. రాత్రి 12 గంటలకు మా శ్రీమతి లలిత చాయ్ చేసి ఇచ్చేది. నిద్ర వస్తుంటే నీళ్ళ బకెట్లో తలపెట్టి నాని పి, నిద్ర రాకుండా నట్టు చేసుకుంటూ చదివాను. నేను మొదటిసారే ఉత్తీర్ణత పొందాను. మా మిత్రులు తర్వాత తర్వాత పాస్ అయినారు. నేను టీచర్ అయ్యాక... అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారి ఫోటో తెచ్చుకున్నాను. రోజు లేవగానే ఆయన ఫోటో కు నమస్కారం చేస్తూ ఉంటాను!