యువరాజును కాపాడిన యువకుడు:-యామిజాల జగదీశ్
 రత్నగిరి రాజ్యానికి రాజు చంద్రసేనుడు. ఆయన భార్య మందాకిని. కొడుకు వీరసేనుడు. ఓరోజు రాత్రి తల్లి కొడుక్కి జాబిల్లిని చూపిస్తూ వెండి గిన్నెలో పాలన్నం కలిపి గోరుముద్దలు తినిపించడానికి నానా ప్రయత్నాలు చేసింది.  అయినా వీరసేనుడు అన్నం తిననంటూ మారాం చేస్తున్నాడు.  
దాంతో మందాకినికి కోపం వచ్చింది.
“నువ్వు అన్నం తినకుంటే బ్రహ్మరాక్షసికి నిన్ను అప్పగించేస్తాను” అని హెచ్చరించింది మందాకిని.
మందాకిని అలా చెప్తున్న సమయంలో ఆకాశంలో దుష్టదేవతలు విహరిస్తున్నారు.
వాళ్ళు ఆమె మాట విని తథాస్తు అన్నారు. అంటే చెప్పక్కర్లేదుగా దీని అర్థం. అలాగే కానివ్వు అని.
మరుక్షణం బ్రహ్మరాక్షసుడు ఎక్కడి నుంచో ఊడిపడి అక్కడికొచ్చి వీరసేనుడిని లాక్కుపోయాడు. ఈ పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని మందాకిని కంగుతింది. తాను కుమారుడితో అన్నం తినిపించడానికి చెప్పిందే తప్ప నిజంగా బ్రహ్మరాక్షసికి అప్పగించాలని కాదు. తాను మాటవరసకు చెప్పినా అది నిజంగానే జరిగిపోయేసరికి ఆమె నోటంట తొలుత మాట రాలేదు. అయితే క్షణాల్లోనే తేరుకుని గట్టిగా అరిచింది. రోదించింది. తన కొడుకుని బ్రహ్మరాక్షసి గుప్పెట్లోంచి కాపాడివ్వమని పెద్దపెద్దగా అరిచింది. ఆమె ఆర్తనాదాలు విని అందరూ పరుగు పరుగున వచ్చారు. తన కొడుకుని బలవంతంగా లాక్కుపోతున్న బ్రహ్మరాక్షసుడి గురించి చెప్పింది మందాకిని. తన నాథుడికీ చెప్తూ చెప్తూ ఆయనమీద వాలిపోయింది.
దాంతో రాజు ఆందోళన చెందాడు.
తన కొడుకును ఎవరైతే కాపాడుతారో వారికి అయిదు ఊళ్ళు పాలించే ప్రధానమంత్రి పదవి ఇస్తానని ప్రకటించాడు రాజు. ఊరంతా దండోరా వేయించాడు. అయితే ఓ యువకుడు ముందుకు వచ్చాడు. తాను యువరాజుని కాపాడి మీ అప్పగిస్తానని భరోసా ఇస్తూ ఒకే ఒక్క కత్తితో బయలుదేరాడు.
అతను అడవి మార్గంలో పోతుంటే ఓ చోట ఓ విచిత్ర దృశ్యాన్ని చూశాడు. 
 అదేంటంటే, కట్టెలకు నిప్పంటించి కాళ్ళను అందులో ఉంచుకుని ఏమీ జరగనట్లు చలికాచుకుంటోంది ఓ ముసలమ్మ.
తన వంక విచిత్రంగా చూస్తున్న ఆ యువకుడిని చూసి ముసలమ్మ “ఏంటీ చూస్తున్నావు....ఎముకలు కొరికే చలి. భరించలేకే ఈ పని చేస్తున్నాను” అని చెప్పిందా ముసలమ్మ. పైగా ఆమెది వికారమైన భీకర రూపం.
యుకుడికి ఆమె మాటలు విస్మయం కలిగించాయి. ఒరలోంచి కత్తి తీసాడు. అది చూడగానే ఆ ముసలమ్మ ఓ రాక్షసిగా మారిపోయింది. నేను ఒక స్త్రీని. నన్నుగానీ చంపావంటే నీకు పాపం చుట్టుకుంటుందని హెచ్చరిస్తుంది.
అయినా యువకుడు ఏ మాత్రం వెరవకుండా ఆ ముసలమ్మను కత్తితో పొడిచి హతమారుస్తాడు.
మరుక్షణమే అతని ముందర ఓ అందమైన గంధర్వ కన్య ప్రత్యక్షమైంది.
“యువకుడా, నీ సాహసానికి కృతజ్ఞతలు. నేను ఒకానొకప్పుడు ఓ ముని తపస్సుకు భంగం కలిగించినప్పుడు ఆయన నన్ను ఓ వికారమైన ముసలమ్మవవుతావని  శపించాడు. అప్పుడు నేను ఆయన కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డాను. అయితే అప్పుడు అతను నిన్నెవరైతే కత్తితో హతమారుస్తారో అప్పటి వరకూ నీ రూపమిదే అని చెప్పాడు. నీ చర్యతో నా వికారరూపానికి  విముక్తి కలిగింది. నన్ను శాపవిముక్తిడిని చేశావు కనుక నీకు నేను సాయం చేస్తాను...నీకేం కావాలో చెప్పు” అని అడిగింది ఆ గంధర్వ కన్య.
యువకుడు తనెందుకు బయలుదేరానో అనేది వివరంగా చెప్తాడు.
అచను చెప్పినదంతా విన్న ఆ కన్య “సరే నీకు నేను సాయం చేస్తాను. నువ్విప్పుడే నాతో రా. మీ యువరాజుని ఎత్తుకుపోయిన బ్రహ్మరాక్షసుడు మరెవరో కాదు. అతనున్న చోటు నాకు తెలుసు. నన్ను నమ్మి నాతోరా. నీకు ఆ రాక్షసుడు ఉండే గుహ చూపిస్తాను. అక్కడతను నిద్రపోతూ కనిపిస్తాడు. అతను ఏడాదిలో ఆరు నెలలు నిద్రపోతాడు. ఆరు నెలలు మేల్కొంటాడు. ఇప్పుడతను నిద్రపోతున్న కాలం. కనుక నీకు ఓ కమండలంతో మంత్రజలాన్ని ఇస్తాను. ఆ నీటిని అతనిపై చల్లు. దాంతో అతను పెద్దగా అరుస్తూ నీ వంక చూస్తాడు. కానీ నిన్నేమీ చేయలేడు. అతనిలోని శక్తి హరించుకుపోతుంది. అతని అరుపులు విని ఓ డేగ అక్కడకు ఎగురుకుంటూ వస్తుంది. అందులోనే అతని ప్రాణం ఉంది. వెంటనే నువ్వు నీ కత్తితో దాన్ని నరికేస్తే అతను చనిపోతాడు...” అంటూ అతనిని గుహ దగ్గరకు తీసుకుపోయి లోపలకు పొమ్మంటుంది.
ఆమె చెప్పినట్లే ఆ రాక్షసుడిపై మంత్ర జలాన్ని చల్లడంతోనే పెద్దగా అరుస్తూ యువకుడి వంక చుస్తాడు. కానీ ఏమీ చేయలేడు. క్షణాల్లో డేగ రావడం దాన్ని యువకుడు తన కత్తితో నరకడం, రాక్షసుడు చనిపోవడం వంటివన్నీ చకచకా జరిగిపోతాయి. మరుక్షణం అతను అక్కడున్న యువరాజుకు విముక్తి కల్పించి రాజుకు తీసుకొచ్చి అప్పగిస్తాడు. తమ కొడుకును చూసి రాజదంపతులు తెగ ఆనందిస్తారు. ఆ యువకుడికి తాను ప్రకటించినట్లే అయిదూళ్ళు ఇచ్చి ప్రధానమంత్రిగా పాలింటే హక్కు కల్పిస్తాడు రాజు.
పిల్లలూ...ఎప్పుడూ మేలు చేకూర్చే మాటలు మాట్లాడండి. అంతేతప్ప అనవసరమైన మాటలతో కాలక్షేపం చేస్తూ ఎవరి సమయాన్ని వృధా చేయకండి. ఎవరినీ నొప్పించకండి.
-      
కామెంట్‌లు