అనగనగా అమోఘపురమనే ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఎప్పుడు తీయటి పండ్లు కాస్తూ చల్లని నీడని ఇచ్చేది. ఆ చెట్టు ఎవరు ఎప్పుడు పెట్టారో ఎవ్వరికీ తెలియదు కానీ పండ్లను కోసుకోవడానికి మాత్రం పోటీ పడేవారు. ఇదంతా గమనిస్తూనే ఉన్న ఆ మామిడి చెట్టు " నా పండ్లు ఎంతో గొప్పవి " అని విర్రవీగసాగింది. "నేను లేకపోతే వీరు ఏం చేస్తారో చూద్దాం" అనుకుని ఒక ఏడాది పండ్లను పండించలేదు. ఆకులు రాలడం మొదలయింది, చెట్టు ఎండిపోసాగింది. ఎవరికివారే మనకెందుకులే అనుకున్నారు తప్ప పట్టించుకోలేదు. దీంతో చెట్టుకు కోపం వచ్చింది." ఇన్ని ఏళ్లుగా నా పండ్లను తిని, ఇప్పుడు నేను పండ్లు ఇవ్వకపోతే పట్టించుకోరా" అని సహనాన్ని కోల్పోయింది. అటుగా వెళ్తున్న వారిపై కొమ్మలను పారేయసాగింది. చెట్టు వాలకం చూసిన గ్రామస్తులు చెట్టుకు దెయ్యం పట్టిందని, చెట్టును నరికేయాలని అనుకున్నారు. అసలుకే మోసం రావడంతో చెట్టు దిగాలుపడిపోయింది. ఇదంతా గమనిస్తున్న ప్రకృతమ్మ "ఇప్పుడు బాధ పడి ఏమి లాభం? నువ్వు నాలో ఒక భాగం. కానీ నువ్వు నీ ధర్మం విస్మరించావు అందుకే ఈ శిక్ష" అంది. "ఇప్పుడు ఏమి చేయాలి " అని అడిగింది. "లాభాపేక్ష లేకుండా నీ పని నువ్వు చెయ్యు" అని ప్రకృతమ్మ చెప్పగానే తెల్లారేసరికి మామిడిచెట్టు బోలెడన్ని పండ్లతో కళకళలాడింది. ఇది చూసిన గ్రామస్తులు తమ చెట్టు బాగా అయిపోయిందని సంతోషపడ్డారు, మామిడిపండ్లను కోసుకుని ఇష్టంగా తిన్నారు. "చూసావా సహనం కోల్పోయి నీ ఉనికికే ప్రమాదం తెచ్చుకున్నావు, ఇప్పుడు చూడు ఎంతమంది నిన్ను ఇష్టపడుతున్నారో" అని ప్రకృతమ్మ అనగానే "నాకు బుద్ధి వచ్చింది" అంటూ మామిడి చెట్టు తప్పు ఒప్పుకుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి