నేను 1960 తొలినాళ్ల నుంచి యాంగాంగ్ వర్సిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. అంతకుముందు మూడేళ్లపాటు మా వూరు టాంగ్‌డ్విన్-ఇ లో మిడిల్‌స్కూల్ టీచర్‌గా పనిచేశాను. చెప్పడానికి కొంత అతిశయోక్తిగా వుంటుందేమోగానీ, పెెద్ద శ్రమలేకుండా, తక్కువ నైపుణ్యంతోనే రెండు స్థాయిల్లోనూ మంచి ఉపాధ్యాయుడననే అనిపించుకున్నాను. అయితే 1963లో నేను మా వూరు వెళ్లినపుడు జరిగిన ఒక సంఘటన కంగారు పెట్టిందనాలి.
స్కూలు సెలవల తర్వాత కొత్త సెమిస్టర్ ఆరంభ సమయంలోనే నేను మా వూరు చేరుకున్నాను. అప్పటికే నేను 'మంచి టీచర్' స్థాయిలో గౌరవం అందుకుంటున్నాను. టాంగ్‌డ్విన్‌లో ఒక చిన్న మ్యూజియం కూడా ఏర్పాటయింది. నా స్నేహితులతోపాటు నన్ను కూడా దానికి డైరెక్టర్‌ని చేశారు. అక్కడే దాదాపు ప్రతీ సాయింత్రం స్నేహితులం కలుస్తుండేవాళ్లం. మ్యూజియంకి వెళ్లే దారిలో పగోడా సమీపంలోని ఒక ప్రైమరీ స్కూల్లో నా స్నేహితుడు యాన్ సీన్ ఆర్ట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ అతని కోసం బయట వేచివున్నానని కబురు పంపడం అతను రావడం పరిపాటి. కిండర్‌గార్టెన్‌లో కొత్తగా చేరిన పిల్లలకి చదవడం, రాయడం నేర్పడమూ అతగాడి పనే.
ఒకరోజు అతన్ని క్లాస్ అయ్యాక మ్యూజియం దగ్గరికి రమ్మని చెప్పడానికి వెళ్లాను. అపుడతను బోర్డు మీద ఏదో బొమ్మ వేస్తున్నాడు. ఐదేళ్ల వయసు పిల్లలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. నేనూ అదేమిటా అని చూశాను. అది ఒక ప్రముఖ కార్టున్‌లో బొమ్మ అని నేను గుర్తించినట్టే పిల్లలూ ఇట్టే పట్టేశారు.
''మాస్టారూ, అది తాబేలు!'' ఒకడు అరిచి చెప్పాడు.
బొమ్మకి ఒక చేతి కర్రను తగిలించాడు ఈ మాస్టారు.
''తాబేలు చేతికర్ర పట్టుకుంది!'' అన్నదో పిల్ల.
''అది పైప్ కాలుస్తోంది!'' అన్నాడు మరో పిల్లవాడు.
యాన్ సీన్ పిల్లలవంక తిరిగి, ''ఒకరోజు, మాస్టర్ తాబేలుగారు వాకింగ్‌కి వెళ్లారు, ఆయన ఎవర్ని కలిశాడో మీకు తెలుసునా?''
బోర్డు వంక తిరిగి తాబేలు పక్కన మరో బొమ్మ గీయనారంభిచాడు.
''కుందేలు!'' అన్నారు ఈసారి క్లాసులో పిల్లలంతా.
''అవును. మాస్టర్ తాబేలుగారితో కుందేలు ఏమన్నదంటే...''
తాను వెళ్లగానే కథ చెపుతుంటాడు. నాకు అవేవీ పెద్దగా గుర్తు లేదు. నేనే కేవలం చేయి వూపి వెళిపోయాను.
''నువ్వూ విను, బాగుంటుంది!'' నవ్వుతూ అడిగాడు. సాయింర్రతం కలుస్తాలే అని వచ్చేశాను.
రెండు మూడు రోజులు అతను బొమ్మలు వేయడం, పిల్లలకి ఆసక్తిగా కథలు చెప్పడం గమనించాను. ఇది కాకుండా వేరే ఏమీ చెప్పడం లేదేమి? అనీ అడిగాను.
''పిల్లలకి రాయడం, చదవడం ఎప్పుడయినా చెప్పగలను. కానీ వీళ్లకి కావలసింది బడి పట్ల ఆసక్తి. అది పెంచడానికి వాళ్లను ఉత్సాహపరచడానికి ఇదంతా. నిజానికి ఇదే ఎంతో అవసరం, ముఖ్యం'' అన్నాడు.
అతను చెప్పింది ఆలోచించాను. నిజవేననిపించింది. మర్నాడు అతని స్కూలుకి వెళ్లి చాలాసేపు ఆ బోధనా విధానాన్ని పరిశీలించాను.
ముందువరుసలో ఒక పిల్లాడు టీచర్ చెప్పేది వినడం లేదు, బోర్డు చూడటం లేదు ఏకబిగిన ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో క్లాసులో వెవరికీ అర్ధం కాలేదు. సీన్ మాత్రం మధ్య మధ్యలో కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. బయట చెట్టుకింద ఒక పెద్దావిడ కూచునుంది. బహుశా ఆమె ఆ పిల్లాడి అమ్మమ్మ అయి వుంటుంది. కొంతసేపయ్యాక సీన్ వచ్చి, ''మేడమ్ థార్, మీ పిల్లవాడు బాగానే చదువుతున్నాడు. మీరు ఇక్కడే వుంటే వాడు సరిగా చదవడు, రాయడు. మిమ్మల్నే చూసి ఏడుస్తున్నాడు. దయచేసి ఇంటికి వెళిపోండి!'' అని చెప్పాడు.
ఆమె కదల్లేదు, అతనికి విసుగొచ్చింది. ''పిల్లలకంటే ఈ పెద్దవాళ్లకు నచ్చజెప్పడమే మహాకష్టం బ్రదర్'' అన్నాడు నాతో. అది విన్నాక ఆమె మెల్లగా వెళిపోయింది. మావాడు లోపలికి వెళ్లి పిల్లాడి వంక నవ్వుతూ చూశాడు. వాడు ఏడుపు మరింత పెంచాడు. ''పిల్లలూ వీడొక్కడే ఏడిస్తే బాగోదు, మీరూ గట్టిగా ఏడవండి ఒక్కసారి, బాగుంటుంది'' అనగానే క్లాసంతా వాళ్ల అరుపుతో మారుమోగింది. పిల్లాడు కంగారు పడి ఏడుపు ఆపేశాడు! సీన్ తన పాఠం కొనసాగించాడు.
మర్నాడు అతని క్లాసుకి ముందుగానే వెళ్లాను. నిన్న ఏడిచిన పిల్లాడు మౌనంగా వున్నాడు. సీన్ క్లాసులోకి వెళ్లి ''ఇవాళ మీ అందరికీ స్వీట్లు తెచ్చాను. తింటారా?'' అని అన్నాడు. అంతే వెంటనే పిల్లలంతా ఆనందంతో గెంతులేశారు.
ముందుగా ఎవరికి కావాలో చేతులెత్తండి అన్నాడు టీచర్. ఒక్కళ్లిద్దరూ చేతులెత్తారు. టీచర్ అనుకున్నట్టుగా నిన్న ఏడిచిన పిల్లాడు చేయి ఎత్తకపోగా ఆ డబ్బాలో నిజంగా స్వీటు వుందా అన్న అనుమానంతో టీచర్‌వంక చూశాడు. నేనూ!
యాన్ సీన్ ఒకటి రెండు స్వీట్ల బొమ్మలు బోర్డుమీద గీసి అక్కడి నుంచి తీసి ఇస్తున్నట్టు నటించాడు. పిల్లల ఆయన చేతుల్లోంచి వాటిని లాక్కోవడంలో పిల్లల గోలతో క్లాసంతా హోరెత్తింది. ఒకరిద్దరు అవి గుండ్రంగా వున్నాయని, ఒకపిల్ల చతురస్రంగా వుందని మరో పిల్ల పలకలుగా వుందని.. పట్టుకుని చూస్తూ తింటున్నారు. వాళ్లలోనూ తుంటరులు ఉన్నారు. ఒకడు తనకిచ్చింది బాలేదని ముందు వరసులోకి విసిరాడు. అది అక్కడున్నవాడి తలకి తగిలింది, ఒక పిల్లయితే ముందు వరసలోని పిల్ల ముఖానికి రాసింది, మరో పిల్లాడు ఏకంగా పైకి విసిరాడు. అంతా నవ్వులూ, గోల గోలగా మారింది. నిన్న ఏడిచినవాడూ తెగ నవ్వుతున్నాడు. మొత్తానికి పిల్లలంతా జీవితంలోని గొప్ప ఆనందాన్ని చవిచూస్తున్నట్టుంది. వారిలో స్నేహ భావం పెంపొందించడానికి చేసిన ఆట మొత్తానికి విజయవంతమయింది.
మర్నాడు బోధనావిధానంలో ఈ కొత్త విధానాన్ని అందుకోవాలని అనుకున్నాను.
''ఇవాళ మామిడిపండ్లు తిందాం. అన్నీ తియ్యగా బావుంటాయి... అన్నట్టు వాటి గురించి కొంచెం తెలుసుకుందాం'' అంటూ బోర్డు మీద మామిడిపండు బొమ్మ వేసి వీటిలో కొన్ని తీయనివి, కొన్ని పచ్చివీ వుంటాయి అన్నాడు. రెండు బొమ్మల్ని చూస్తూ పిల్లలంతా నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం అంటూ చేతులూపి సమాధానం చెప్పారు. వారిలో ఆ పండు చేతిలో వున్నంతగా ఉత్సాహపడుతున్నారు. కొందరయితే బొమ్మ వేయడం ఎలా అన్నదీ చెబుతున్నారు! వారిలో వారు చర్చించుకుంటునన్నారు. నాకు ఎంతో ఆశ్చర్యమేసింది.మొత్తానికి పళ్లు కోయడం, తినడం చెప్పడంలోని ఆంతర్యం మయిన్మార్ అక్షరమాల గురించి వాళ్లకి వివరించడం!
పిల్లలు వృత్తాలు గీస్తూనే అక్షరాల వొంపులూ తెలుసుకుంటున్నారు. కొందరు పలకలమీద రాసి టీచర్‌కి చూపించారు. ''ఇది తీయగా వుంది, ఇది కాస్త పుల్లగా వుంది..'' అని టీచర్ సరదాగా చిన్నపాటి మార్పులు చేర్పులు చెప్పాడు. ఒకపిల్లాడు వెనక్కి వెళ్లి బొమ్మని సరిచేసుకు వచ్చి చూపించాడు. ''భేష్, ఇది చాలా బావుంది రా'' అన్నాడు వెన్నుతట్టి. పిల్లాడి ఆనందానికి అంతేలేదు. దాన్ని తిన్నంత ఆనందం మొహంలో విప్పారింది. నిన్న ఏడ్చినవాడు చూపగానే ''ఒరే, ఏడవడమే కాదు బొమ్మ కూడా బాగానే వేశావురోయ్!'' అన్నాడు టీచర్ సరదాగా తల నిమురుతూ. వాడికి క్లాసు లీడర్ అయినంత ఆనందం!
మర్నాడు మరో కొత్త పాఠం మొదలయింది. క్లాసులో ప్రతీ ఒక్కరినీ నిలబడి వాళ్ల పేర్లు చెప్పమన్నాడు. బోర్డు మీద అక్షరమాలలోని మొదటి అక్షరం క రాశాడు.
''ఇప్పుడు మీ పేర్లు చెప్పండర్రా.. ఒకరి తర్వాత ఒకరు. భలే వుందిరా.. చాలా మంచి పేరు.. ఏం పేరు పెట్టార్రా మీవాళ్లు... అన్నట్టు టీచర్‌కీ ఒక పేరుంటుందిగదా! అది 'క' .. మర్చిపోవద్దు, మీరూ మీమీ పేర్లతోనే పిలుచుకోండి.'' అన్నాడు. ఇలా ఆ రోజంతా అక్షరమాల చెప్పించాడు అందరిచేత.
నేను నా స్నేహితుడి పనితీరు చూసి చాలా ఆశ్చర్యపోయాను. అందులో గొప్పతనాన్ని గ్రహించాను. గొప్ప టీచర్ అని పేరున్న నేను నిజానికి ఇతనిలా పిల్లలకి ఉపయోగకరంగా పనిచేస్తున్నానా అనిపించింది.
(మయిన్మార్ కథ)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి