పెన్సిల్ బాక్సులో రాసి రాసి అరిగిపోయిన
ఓ పెన్సిల్ ముక్క అప్పుడే తనతో చేరిన కొత్త పెన్సిలుని స్వాగతించింది.
అరిగిపోయిన పెన్సిల్ తన అనుభవాలను చెప్పడం మొదలుపెట్టింది....
మొదటిది...
నువ్వు ఒంటరిగా పని చేయడం లేదు. నిన్నొకరు చేత్తో తీసుకుంటేనే పని చేయడం మొదలుపెడతావు.
రెండవది....
నీ బయట ఉన్న భాగం కన్నా లోపల ఉన్న నల్లటి (ఇంగ్లీషులో lead అంటారు) భాగమే ముఖ్యమైనది.
మూడవది...
నిన్ను అప్పుడప్పుడూ చెక్కుతూ ఉంటారు.
నువ్వెప్పుడల్లా చిన్నబోతుంటావో అప్పుడల్లా నిన్ను చెక్కడానికి ఈ మనుషులు ఏమాత్రం ముందు వెనుకలు ఆలోచించరు. నువ్వందుకు సిద్ధపడాల్సిందే.
నాలుగవది....
అతి ముఖ్యమైనది. నువ్వు రాస్తున్నప్పుడు తప్పులు దొర్లుతాయి. నీలో వెనుకభాగాన ఉన్న రబ్బరుతో చెరిపి నిన్ను సరిగ్గా రాయిస్తుంటారు.
ఇన్ని రోజులూ రాసి రాసి అరిగిపోయిన పాత పెన్సిల్ మాటలు కొత్త పెన్సిలుకే కాదు మనిషి జీవితానికీ పాఠమేసుమీ.
ఇటువంటి జీవితపాఠాలను అప్పుడప్పుడూ మరచిపోవడమే మన బాధలకు, ప్రశాంతత లేకపోవడానికీ కారణం.
ముందుగా చెప్పాలంటే నేనుగా రాయలేను. ఒకరు నన్ను చేతుల్లోకి తీసుకోవాలి. అతనే పరమాత్మ. అతనే నాకు అండ. నన్ను చేతుల్లోకి తీసుకుని రాయిస్తుంటాడు. అతని రాత దారి తప్పదని నమ్మాల్సిందే. ఆ పరమాత్మ చేతిలో నేనొక ఆయుధం. భగవద్గీతలో పదకొండో అధ్యాయంలో ముప్పై మూడో శ్లోకంలో కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు...
"కీర్తి పొందు. శత్రువులను జయించు. సర్వసంపదలతో తులతూగే రాజ్యాన్ని అనుభవించు. వీరందరూ నాతో ఎప్పుడో హతులయ్యారు. నువ్వు నిమిత్తమాత్రుడవు"
ఎదుట ఉన్నవారందరూ చనిపోతారని నువ్వనుకుంటున్న వారందరూ నాతో ఇప్పటికే కూలబడ్డవారే. నువ్వు నా చర్యకు ఓ పరికరానివి అని కృష్ణుడంటాడు.
హస్తినాపురం ధర్మబద్ధంగా పాలింపబడాలని నేను నిర్ణయించేసానంటాడు.
యుద్ధం ముగిసాక అర్జునుడు చెప్పాడట...
నేనే ఎక్కువమందిని కూల్చానని. కానీ భీముడేమో ఎక్కువ మందిని తానే కూల్చాడని చెప్పాడు.
దాంతో కృష్ణుడు ఇద్దరినీ కురుక్షేత్రానికి తీసుకుపోయాడు.
అక్కడ ఘటోత్కచుడి కుమారుడు బర్బరీకుడిని చూసి "బర్బరీకా! నువ్వీ యుద్ధరంగంలో అర్జునుడి బాణాలను ఎక్కువగా చూసావా లేక భీముడి గదను చూసేవా అని కృష్ణుడు అడుగుతాడు.
అప్పుడు బర్బరీకుడు "కృష్ణా! నీ చక్రాన్నే నాలుగుదిశలా తిరగడం చూసా"నన్నాడు.
ఇంతకూ ఈ బర్బరీకుడు సామాన్యుడు కాడు. ఘటోత్కచుని కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణుని చేత వధించబడ్డాడు. అతని తల్లి పేరు మౌర్వి. బర్బరీకుడు చిన్ననాటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచాడు. అస్త్రశస్త్రాల మీద బర్బరీకుడికున్న పట్టు ఇంతా అంతా కాదు. అతని పట్టు చూసి దేవతలు ముచ్చటపడతారు. అంతేకాదు, అతనికి మూడు బాణాలిస్తారు. ఆ మూడు బాణాలతోపాటు అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేని విధంగా ఓ వరాన్ని ప్రసాదించారు. ఓవైపు బర్బరీకుడు పెరుగుతుండగానే, కురుక్షేత్రం సంగ్రామం ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది.
అతను ఏ పక్షాన ఉంటే ఆ పక్షం బలపడుతుంది. అతను బలహీన పక్షాన నిలబడి పోరాడితే ఆ పక్షానికి బలమంతా వచ్చేస్తుంది. ఈ విషయం తెలిసి
బర్బరీకుడిని తప్పించడం కోసం కృష్ణుడు,
"కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఓ వీరుడి తల బలి కావాల్సి ఉంది. నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు. కనుక నీ తలనే బలిగా ఇవ్వాలి" అని కోరతాడు.
బర్బరీకుడు మరొక్క మాట మాటాడక తన తలను బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు.
కానీ బర్బరీకుడు కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని ఉందనీ, కనుక చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించాలని కోరతాడు. కృష్ణుడు అలాగే అంటాడు.
అలాగు, బర్బరీకుడి తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా నిలిచిపోయింది.
బర్బరీకుడు పూర్వజన్మలో శాపగ్రస్తుడైన ఓ యక్షుడు.
మన జీవితమూ అంతే.
నేను నాదీ అనేది తీసేసి నువ్వు నీదీ అని కృష్ణుడి పాదాలకు శరణాగతి చెందడమే తగు. ఆ అనుభవం అమితానందం. రామనామం శివనామం ఇందుకే. మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికే.
మన సుఖదుఃఖాలూ, లాభనష్టాలూ, జయాపజయాలూ, మానావమానాలూ
అన్నీనూ అతని కృపతోనే జరుగుతున్నాయి. అలాగైతే నా వంతు నా పాత్ర ఏమిటని అడగొచ్చు. నేను దాసుడిని. ఆయనే స్వామి అని గ్రహించడమే మన పాత్ర. నేనూ అనే అహంకారం లేనప్పుడు మనం అణకువతో ఉంటాం.
కృష్ణుడే రక్ష రక్ష.....
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామరామ హరే హరే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి