వెదురు :--లీలా కృష్ణ.-తెనాలి.

 నా పేరు వెదురు .
నేను పటుత్వంలో పెద్ద ముదురు.
 కుదురు లేకుండా ఎదగడంలో నాకు సాటి లేరు ఎవరు .
వంద అడుగుల ఎత్తు దాకా ఎదగడమే నా నుదురుకున్న పొగరు.
వెయ్యికి పైగా జాతులను కల్గి ఉన్న మా ఖ్యాతిని .. పొగుడుతారు అందరూ.
నేను దట్టంగా పెరిగిన ప్రదేశాన్ని.. అరణ్యం అంటారు కొందరు.
మానవులు.. తమ స్వార్ధ ప్రయోజనాలకై నన్ను వాడుకుంటారు .
రకరకాల పాండాలు.. నా వెదుళ్ళని ఆరగించుటలో... నిష్ణాతులు.
ఇంకో అడుగు ముందుకేసిన మానవులు ... వారి రోగ నివారణకై... నా శక్తియుక్తుల్ని హరిస్తున్నారు.
నన్ను నిలువునా చీల్చి ,వంతెనగా మార్చి.. నిరంతరం నాపై నడుస్తున్నారు మనుషులందరూ.
వెదురు బొంగులో చికెన్ అంటూ , నా దేహానికి మాంసాన్ని అంట గట్టింది ..ఈ లోకం తీరు.
బోయల భుజాలపై , మహారాణిలా ఊరేగుట నాకెంతో గర్వం.
ఆ నలుగురి భుజాలపై.. అశుభయాత్రలో పాలుపంచుకోవడం నా ఖర్మం.
ఆకాశమే హద్దుగా ఎదగడమే.. నే పొందిన వరం.
వేరెవరో అవసరాలకు  నన్ను వాడుకోవడాన్ని... సమ్మతించింది నా  మంచితనం.
ఎంత ఎత్తు ఎదిగినా, తుదకు నేలలో లీనమవ్వటం తథ్యం అని నిరూపించడమే నా జీవన సారాంశం.
నన్ను నరికి కొందరు బుట్టలు, చాటలు, పేపరు వంటి  రూపాలను ఇచ్చి.. పొట్ట పోసుకోవటం గమనార్హం.
నాదైన రూపాన్ని రకరకాలుగా మార్చేలా చేసింది మానవుడి అవసరం.
అదే చందాన.. పరమాత్మ సైతం.. అవసరమైన ప్రతిసారీ రూపాంతరం చెందడం సర్వ సహజం.
ఏ జన్మ పుణ్యమో .. వెదురు గ్రోవినై.. ఆ వేణు మాధవుని శ్వాసను ఆస్వాదించాను ఆజన్మాంతం