పిచుకమ్మ కథ:- సత్యవాణి

  అనగనగా ఒక ఊరిలో ఒకతాతా మనవడు వున్నారు. ఆమనవడికి తన తాతచెప్పే కథలంటే చాలా ఇష్టం. తాత ఎన్నికథలు చెప్పినాసరే,ఆమనవడు "మరొకటి చెప్పు తాతయ్యా,ఇంకొకటి చెప్పు తాతయ్యా!" అంటూ ఎన్నికథలు చెప్పినా మరోటీ,మరోటీ అంటున్నాడు.
     అప్పుడు తాత మనవడితో ,"ఒరేయ్ !కన్నా!ఈరోజు "పిచ్చుకల దినొత్సవమట"అందుకని నీకు నేను ఒక పిచ్చుక "కథ" చెపుతాను.మరినేనెంత పెద్దకథ చెప్పినా సరే,వద్దు, ఇకచాలు అనకూడదు సరేనా?"అన్నాడు.మనవడు సంతోషంగ,"బలే బలే చెప్పుతాతయ్యా!పిచ్చుకలంటే నాకు బలే ఇష్టం.నువ్వు పిచ్చుకలగురించి ఎంత పేద్ద కథ చెప్పినా "చాలు"అనను.అలాగే ఈరోజు స్కూల్లో మా మాష్టారు నీలాగే పిచుకల గురించి చెప్పారు.పిచ్చుకలు పర్యావరణ ప్రేమికులట.పైగా రైతులకు మంచి మిత్రులట.పంటచేలకు పట్టి, అనేకరకాలుగా పంటకు హానిచేసే పురుగులను ఈ పిచ్చుకలు ఏరుకుని తిని,రైతుకూ, పంటకూ ఎంతో మేలుచేస్తాయిట.పిచ్చుకలు లొకపోవడంమూలంగానే, పంటలకు  హానిచేసి,పంటల దిగుబడిని తగ్గించే పురుగులను చంపడానికి అనేకరకాలైన హానికారకాలైన పురుగు మందులు రైతులు వాడుతున్నారట. ఆ విషతుల్యమైన పురుగుమందులు ,జీవజాలానికే కాదు పర్యావరణానికే చేటుచేస్తోంది.మానవులకూ,పక్షులకూ,జంతువులకూ కూడా అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయట."వాళ్ళ మాష్టారు చెప్పిన విషయాలు చక్కగా గడగడా చెప్పి ,ఇప్పుడు చెప్పుతాతయ్యా! పిచ్చుకగురించి ఇంకా ఏమిచెపుతావో"అన్నాడు.
       "సరే! చెపుతున్నాను మరి .మధ్యవద్దు అననని మాటిచ్చేవు గుర్తుంచుకో!నువ్వుగనుక మధ్ధలో "చాలు,ఇంక ఆపు"అన్నావంటే,నువ్వు నాకు వారంరోజులు కథలు నాకు చెప్పాలి ,సరేనా? అని  హెచ్చరించి  కథ మొదలుపెట్టాడు తాతయ్య.
     "అనగా అనగా ఒకరైతున్నాడు. ఆరైతు చక్కగా పంట పండించుకొని, కుప్పలు నూర్చుకొని, ధాన్యాన్ని గుట్టగా పోసుకొన్నాడు. ఆగుట్ట ఎంతవుందంటే ,చిన్నసైజు కొండంతవుంది.
      ఒక పిచుకమ్మ ఆ ధాన్యపు గుట్టను చూసింది.అదిసంతోషంగా ఆ ధాన్యం ప్రోగుదగ్గరకొచ్చి,తన బుల్లి నోటితో ఒకటో రెండో ధాన్యంగింజల్ని కరచిపట్టుకొని ,తుర్రు..మని దాని గూటిలోకి వెళ్ళి,దాని పిల్లలనోటిలో ధాన్యంగింజల్ని పెట్టి,మర్ల తుర్రు..మని ధాన్యంగుట్టదగ్గరకు వచ్చింది.మర్లా ధాన్యంగింజల్ని నోటకరచుకొని తుర్రు..,మని  దాని గూటిలోకి చేరి దాని పిల్లల ధాన్యంగింజల్ని పెట్టేసి మర్లాతు...ర్రు మని ధాన్యం కుప్పదగ్గరకు వచ్చి,ధాన్యంగింజలను ముక్కున కరచుకొని,మళ్ళీతు..ర్రు మని గూటికి ఎగిరి....మళ్ళీ తుర్రుమని.....వచ్చి....మళ్ళీ తుర్రు.....మళ్ళీ.....తుర్రు
 బాబిగాడికి తాతయ్య చెప్పినకథవింటుంటే, నవ్వువచ్చింది.తాతయ్య తు..ర్రు తు..,ర్రు మని చెపుతూనేవున్నాడు.బాబిగాడు  నవ్వలేక పొట్టపట్టుకొని,"తాతయ్యా! తాతయ్యా !ఇంకా ఎంతసేపుంటుంది ఈకథ "అని అడిగాడు. అప్పుడు తాతయ్య "అప్పుడే ఎలా ఆపుతానురా?ధాన్యంగుట్టంతవుందికదా!పిచ్చుక మరి ఎన్నిసార్లు తు..ర్రుమని వెళ్ళిందో!తుర్రుమని ఎన్నాసార్లు వచ్చి ధాన్యంగింజలు పట్టికెళ్ళాందో చూప్పాలిగాదా!"అన్నాడు. "ఆపుతాతయ్యా! బాబోయ్ ! నవ్వలేకపోతున్నాను.ఆపుతాతయ్యా! నేను ఓడిపోయాను.వారంరోజులు నువ్వు చెప్పినకథలే నీకు చెపుతాను." అని బాబిగాడు తనఓటమిని ఒప్పేసుకొన్నాడు.
    "మరి తాతంటే ఏమనుకొన్నావురా భడవా!"అంటూ మనవడిని తాత ముద్దాడాడు.