పులిహోర గోంగూర -బాల గేయం (మణిపూసలు):-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
పులిహోర గోంగూర 
ఓ పట్టు పట్టాలిర
వేడి వేడి అన్నము
నెయ్యితో తినాలిర !

గంపెడు గోంగూరను 
గప్ చిప్ గ ఒలిచాను 
కడిగి ఆరబెట్టియు 
కడాయిన వేశాను 

అమ్మ వేయించినది 
అంత చల్లారింది 
కారం ఉప్పు చింత
కలిపేసి  రుబ్బింది 

తెల్ల గోంగూర ఇది 
తాళ్లుగా ఉంటుంది 
పల్లి నూనె పోపును 
పచ్చడికి కలిపింది

శనగ,మినప్పప్పులు 
ఆవ, కరేపాకులు 
 వేయించి కలుపగా 
పులిహోరగా రుచులు!

తెలుగోళ్ల గోంగూర
గొప్పగా ఉండేర 
దేశ విదేశాలకు 
దివ్యంగ నచ్చునుర !