మర్చిపోలేని అనుభవం : భగీరథ

 50 సంవత్సరాల తరువాత మర్చిపోలేని అనుభవం 
నేను చదువుకున్న పావులూరు ఉన్నత పాఠశాలను 50 సంవత్సరాల తరువాత సందర్శించడం చెప్పలేని అందాన్ని ఇచ్చింది. 
ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో పావులూరు లో జిల్లా పరిషత్ హై స్కూల్ ను 1951లో ప్రారంభించారు. . పావులూరు చుట్టు  ప్రకలవున్న వున్న అనేక గ్రామాల నుంచి విద్యార్థులు ఈ స్కూల్ కు వచ్చి చదువుకునేవారు. మా నాగండ్ల గ్రామం నుంచి కూడా అనేక మంది పిల్లలు వెళ్లి చదువుకునేవారు. అప్పట్లో రవాణా సౌకర్యం లేదు. ఉదయం 4 కిలోమీటరు  సాయంత్రం 4 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లేవారు . 
1966-67లో నేను ప్రాథమిక  విద్య అనంతరం పావులూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతిలో చేరాను . 1970-71లో 10వ తరగతి అనంతరం హైదరాబాద్ వచ్చి ఇంటర్మీడియట్ లో చేరాను . నాగండ్ల గ్రామం నుంచి దాదాపు 30 మంది పిల్లలం చదువుకోడానికి వెళ్ళేవాళ్ళం . ఇందులో ఐదుగురు ఆడపిల్లలు కూడా ఉండేవారు . ఎండలో , వానలో , చలిలో అలా కబుర్లు చెప్పుకుంటూ వెడుతూ ఉండేవారు . ఉదయం బయలుదేరి మధ్యలో వున్న చిన్న నీటి కుంట  దగ్గర ఆగేవాళ్ళము. ఆ కుంట గట్టు మీద పెద్ద చింత చెట్టు ఉండేది . ఆ చెట్టు మీద దెయ్యం ఉంటుంది అనే ప్రచారం వల్ల అక్కడికి ఒంటరిగా వెళ్లేవాళ్లం కాదు . ఆ తరువాత పెద నక్కలపాలెం ఎదురుగా సున్నం బట్టి , దాని ప్రక్కనే మంచి నీటి బావి ఉండేది. అక్కడ కాసేపు ఆగి మంచి నీరు త్రాగేవాళ్ళము . ఆ సమయంలో స్కూల్ ఫస్ట్ బెల్ వినిపించేది . అక్కడ నుంచి కబుర్లు మానేసి పరిగెత్తుతూ వెళ్లి పోయేవాళ్లము 
ఇక స్కూల్ లో వీరారెడ్డి మాష్టర్ , బద్రిరెడ్డి  మాష్టారు , రాఘవరెడ్డి మాష్టారు , వెంకటేశ్వర్లు మాష్టారు , మాధవరావు మాస్టారు, హిందీ మాస్టారు , సైన్స్ మాష్టారు  తదితరులు మాకు పాఠాలు చెప్పేవారు. 
నాకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వ్యాసరచన ,  వ్యక్తృత్వ పోటీలు , నాటికల పోటీల్లో అనేక బహుమతులు వచ్చాయి. . 10వ తరగతి లో  విద్యార్థి నాయకుడుగా పోటీచేసి గెలిచాను   (ఎస్ .పి .ఎల్ ) అది మర్చి పోలేని అనుభవం . 
50 సంవత్సరాల తరువాత నేను చదివిన స్కూల్ ను చూడటానికి వెళ్లడం నిజంగా మధురానుభవమే . అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది . స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ వచ్చింది , మరో కొత్త భవనం ఏర్పడింది . ప్రతి రోజు ఉదయం సమయంలో స్కూల్ మధ్య ఆవరణ లో ప్రార్ధన జరిగేది . అక్కడ సరస్వతి విగ్రహం వుంది .  నేను చదివిన 10 వ తరగతి గదిలో చాలాసేపు వున్నాను . ఆ సమయంలో నాకు విద్య చెప్పిన గురువులందరూ గుర్తుకొచ్చారు . వారికి మనస్సులో స్మరించుకున్నాను . 
పావులూరు హై స్కూల్ జీవితం మర్చిపోలేనిది . మధురమైనది .