దెయ్యం సాయం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ)౼ దార్ల బుజ్జిబాబు

        ఒక అడవిలో ఓ పేద తోడేలు ఉంది.
       దానికి ఆహారం దొరకటం కష్టంఅయింది.
       పస్తులతో చస్తూ ఉంది.
       ఆహార సంపాదన కోసం మరో ఊరికి  బయలుదేరింది.
       చాలా దూరం నడిచింది. 
       బాగా అలసట వచ్చింది. 
       దారిలో పెద్ద ఊడలమర్రి ఉంది. 
       ఆ చెట్టు క్రింద కూర్చుంది. 
       చల్లటి గాలికి కునుకుపట్టింది.
       గుర్రుపెట్టి నిద్రపోయింది.
       ఆ చెట్టు మీద ఓ కొరివి దెయ్యం ఉంది. 
       అది చాలా మంచిది.
       ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంది.
       అవసరం అయిన వారికి కావలసినంత సాయం చేస్తుంది.
       నిద్రపోతున్న తోడేలును దెయ్యం చూసింది.  
       దివ్యదృష్టితో దాని స్థితిగతులు తెలుసుకుంది.
       "అయ్యో! ఈ తోడేలు చాలా కష్టాలలో ఉంది.
       భార్య, పిల్లలు వదిలేసి పరదేశానికి పోతుంది.
       దీనికి ఏదైనా సహాయం చేస్తాను. 
       నా పేరు చెప్పుకొని బ్రతుకుతుంది" అనుకుంది. 
       దగ్గరలో బందిపోటు దొంగల గుహ ఉంది. 
       అందులో దొంగిలించిన బంగారు నగలు చాలా ఉన్నాయి.
       దెయ్యం ఆ గుహలోకి వెళ్లి కొన్ని నగలను మూట
కట్టుకుంది. 
       వచ్చి నిద్రలో ఉన్న తోడేలును లేపింది. 
       “తోడేలు తమ్ముడూ! లే... లేచి ఇటు చూడు. 
       పగటి నిద్ర దరిద్రానికి మూలం.
       ఇదే నీ పేదరికానికి కారణం. 
       నిన్ను చూస్తుంటే నా గుండె కరిగిపోతుంది.
       ఇవిగో... ఈ బంగారు సొమ్ములు. 
       అమ్ముకో...సొమ్ము చేసుకో" అని చెప్పింది.
       తోడేలు కళ్లు మెరిశాయి.
       మూటను తీసుకుని నివాసానికి పరుగెత్తింది. 
       నగలు ఆ దేశపు రాణివి.
       నెల క్రితం బందిపోటు దొంగలు దాడి చేసి దోచుకువెళ్లారు. 
       వారి కోసం భటులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
       ఇల్లిల్లూ వెదుకుతున్నారు. 
       తోడేలు ఇంట్లో నగలు దొరికాయి.
       దానిని రాజ భవనానికి తీసుకువెళ్లారు.
       బందుపోటుగా భావించారు. 
       మరణశిక్ష విధించారు.
       నీతి : ఉచితంగా వచ్చేవాటి కోసం ఆశ పడకూడదు.