శక్తి:- సత్యవాణి
ఎంత శక్తి విత్తుకు
కరకు రాతి బండలపై
చరచరా మొలకెత్తుతుంది
ఏముందక్కడ 
చిటికెడు మన్నా
పురిషెడు నీరా
తనపై తనకు నమ్మకంతప్ప

ఎంత శక్తి విత్తుకు
సముద్రపు అగాధాలలో
సహనంతో మొలకెత్తుతుంది
ఏముందక్కడ
కఠినజలంతప్ప కాలూనడానికి


ఎంత శక్తి విత్తుకు
కోట కొమ్ములపై వాటంగా
మొలకెత్తుతుంది
ఏముందక్కడ
చెరిగిపోయిన చరిత్ర ఆనవాళ్ళుతప్ప