ఇది మాఊరేనా?:- సత్యవాణి
 మాఊరు మాఊరేనా
మారిపోయిందేమిటిలా
ఓ....హో...అని  ఇక్కడ అరిస్తే
అద్దరికి వినిపించే ఆ అరుపులేవీనాడు
ఆహో.....యయ్ అని అరచే
ఇద్దరినినుంచి వచ్చేజవాబులేవీనాడు
కుమ్మరి గంగన్న 
కుండలపై చరిచే 
చెక్కల దరువుల చప్పుళ్ళేవీ ఏమైపోయాయి
కమ్మరి సోమలింగం
కమ్మరిశాలలో
కమ్మరంలో వినిపించే
సుత్తి చప్పుళ్ళేవీనాడు
తూతిక వాళ్ళింట్లోంచి
టిక్ టక్ టిక్ టక్ మని వినిపించే
మగ్గం చప్పుళ్ళేమైపోయాయి
పంచముల వాడనుంచి
వినిపించే 
తాటిమట్టలనుండి నారతీసే
టక టక్ టక్ టక్ చప్పుళ్ళెప్పుడు ఆగిపోయాయి
చాకి రేవులో వినిపించే
హిస్సు హస్సు హిస్సు హస్సమని వినిపించే
 లయబధ్ధమైన  శబ్దాలేవీవానపడవేం
మంగలప్పలసామి
సన్నాయి రాగాలెేమాత్రం వినిపించటంలేదెందుకో
పల్లకీబోయిల
అహోం  ..ఒహోం ..అహోం..
అహోం ... ఒహోం.. శ్రమగీతాలేవీ చెవలనేపడటంలేదు
చేలపనుల్లో అలుపు తెలియకుండాపాడే
ఆడ కూలీల జానపదాలేవీ ఇప్పుడు
అర్థరాత్రి కుప్పనూర్పుల్లోపాడే
హరి హరీ నారాయణో 
ఆదినారాయణో అనిపాడే
ఆపాటలెప్పుడు మాయమైపోయాయి
పిల్లకాయల మారాములతోగూడిన
నసుగుడు  ఏడుపురాగాలేవి అసలు విపించటంలేనేలేదు
ఒలే ...ఒసే...ఓలమ్మీ అనే
ఆప్యాయత పలకరింపులేవి
రోకలి దంపుల దరువులు ఏవీ
దంపుడు పాటల మెప్పుళ్ళేవీ
పశుల గిట్టల చప్పుళ్ళేవీ
పంతుళ్ళ పవిత్ర మంత్రాలేవీ
రామకోవెళ్ళ చెక్కభజనలేవీ
రాత్రి వెన్నెలలో పిల్లల ఆటపాటలేవీ
 ఏవీ   ఇవన్నీ 
ఎక్కడా వినిపించవేం
ఎందుకు ఊరిలా నిశ్శబ్దంగా మారిపోయింది
అసలిది నా ఊరేనా
నాదని పొరపడుతున్నానా