చూడటం కన్న ఆడటం మిన్న (కథ) --సరికొండ శ్రీనివాసరాజు

     పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో అమ్మమ్మ ఇంటికి చేరారు అక్కా చెల్లెళ్ళ పిల్లల బృందం. అక్కడ ఆ పిల్లలు మేనమామ పిల్లలతో కలిశారు. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అయ్యాక తల్లిదండ్రుల వద్ద మొబైల్ ఫోన్స్ తీసుకుని పక్క పక్కనే కూర్చొని ఛాటింగ్ మొదలు పెట్టారు. అమ్మమ్మ వాళ్ళ వద్దకు చేరి, "అందరూ ఒకచోట చేరారు కదా! సరదాగా ఏమైనా ఆటలు ఆడవచ్చు కదా!" అన్నది. ఈ మాటలను ఎవరూ పట్టించుకోలేదు.
       సాయంత్రం అయింది. అందరూ కలిసి టి. వి. ముందు చేరారు. ఐ. పి‌ ఎల్. మ్యాచ్ మొదలైంది. ఆట ఆసాంతం మన పిల్లల బృందం అంతా వీక్షించారు. ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయారు. రాము, సోమూలు సంతోషంలో మునిగిపోయారు. విష్ణు ఎంతో విచారంగా ఉండిపోయాడు. అన్నం కూడా సరిగా తినలేదు. సోము వెళ్ళి విష్ణును హేళన చేశాడు. విష్ణు సోమూను కొట్టాడు. సోము ఏడుపు మొదలు పెట్టాడు. "రేపు మా హైదరాబాద్ మ్యాచ్ ఉంది. హైదరాబాదు గెలవాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం." అని దివ్య లలితతో అంది. "అవును పందెం కాద్దామా రేపు ఏ జుట్టు గెలుస్తుందో!" అని లలిత వాసూతో అన్నది.
       తెల్లారింది. టిఫిన్స్ అయ్యాక తాతయ్య తన మనవళ్ళు, మనవరాళ్ళతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. "చూడరా సోము! భారత్, ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎవరు గెలవాలని కోరుకుంటాం?" అని అడిగాడు తాతయ్య. అందరూ కలిసి ఒకేసారిగా "భారత్" అని అన్నారు. "మీ అభిమాన ఆటగాడు ఎవరు?" అని హరిని అడిగాడు తాతయ్య. "రోహిత్ శర్మ." అన్నాడు హరి. "ఒక ఆస్ట్రేలియన్ బౌలర్ విరాట్ కోహ్లీని ఔట్ చేస్తే నీకు ఎలా అనిపిస్తుంది?" అన్నాడు తాతయ్య. "ఆ బౌలరుపై విపరీతమైన కోపం వస్తుంది." అన్నాడు హరి. "మరి నీ అభిమాన ఆటగాడు రోహిత్ శర్మ కదా!" అన్నాడు తాతయ్య. "కోహ్లీ కూడా భారతీయుడే కదా తాతయ్యా! ఎవరు ఔటైనా మన దేశపు జట్టుకే కదా నష్టం. మన భారతీయుడు త్వరగా ఔటైతే మనకు బాధే కదా తాతయ్య." అన్నాడు హరి. "మరి ఐ.పి.ఎల్.లో మన భారతీయులను విదేశీ బౌలర్లు ఔట్ చేస్తే ఎగిరి గంతులు వేస్తాం కదా!" అన్నాడు తాతయ్య. ఖంగు తిన్నారు అందరూ. 
        "అమ్మా దివ్య! నీ అభిమాన జుట్టు హైదరాబాద్ కదా! ఎందుకు?" అన్నాడు తాతయ్య. " మన ప్రాంతం మీద మనకు అభిమానం ఉండాలి కదా తాతయ్యా!" అన్నది దివ్య. "నేనూ దివ్య ఇద్దరం నిజమైన ప్రాంతీయ అభిమానులం. మిగతా వారంతా ఈ ప్రాంతద్రోహులు." అంటూ పగలబడి నవ్వింది లలిత. "వెరీ గుడ్! మీ ప్రాంతీయ అభిమానానికి జోహార్లు. ఉన్న ప్రాంతం కన్నతల్లి లాంటిది కదా!" అన్నాడు తాతయ్య. "ఔనౌను." అంటూ ఎగిరి గంతులు వేశారు దివ్య, లలితలు.. "మరి అందులో తెలుగు ఆటగాళ్ళు ఎందరు? కనీసం కెప్టెన్ అయినా తెలుగు వాడా! ఇదేమి ప్రాంతీయ అభిమానం?" అన్నాడు తాతయ్య. తెల్ల మొహాలు వేశారు ఇద్దరూ.
       "అంతర్జాతీయ క్రికెట్ పోటీలు మన అభిమానుల్లో ఐక్యతను పెంచితే ఇలాంటి ఆటలు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళలోనే చీలికలు తెస్తున్నాయి. ఇలాంటి ఆటల గురించి ఆలోచించి ఒకరితో ఒకరు కొట్టుకోవడం, అలిగి అన్నం తినకపోవడం అవసరమా? ఎప్పుడో ఎవరూ లేనప్పుడు బోర్ కొడితే కాలక్షేపం కోసం ఇలాంటి ఆటలు చూడాలి. గెలుపు ఓటముల గురించి ఆలోచించవద్దు. మీరంతా ఒకచోట కలిశారు కదా! మీరే ఇలాంటి ఆటల పోటీలు పెట్టుకుని గెలవడానికి ప్రయత్నిస్తే ఎంత బాగుంటుంది." అన్నాడు తాతయ్య. "ఈ ఆలోచన బాగుంది." అన్నది అమ్మమ్మ. "మీకు నచ్చిన ఆటలు ఏమిటో చెప్పండి." అన్నాడు తాతయ్య. "క్రికెట్, షటిల్, క్యారమ్స్, చెస్." ఇలా లిస్టు చెప్పారు పిల్లలు. "అయితే మీరే ఈ ఆటల పోటీల షెడ్యూల్ రూపొందించుకోండి. రోజులో ఏ సమయంలో ఏ ఆటలు ఆడాలో నిర్ణయించుకొని ఆటల షెడ్యూలును రూపొందించుకోండి. మనం ఆడే ఆటల వల్ల మనం శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతాము. గెలుపు ఓటములను ఆటలో అరటిపండులా స్వీకరిస్తాము. సెల్ ఫోన్లతో కాలక్షేపం, సమయం వృథా చేస్తూ టి.వి. చూడడం వల్ల లాభం లేదు." అన్నాడు తాతయ్య. తాతయ్య ఆలోచన అందరికీ నచ్చింది. సెలవులను ఆటపాటలతో ఆనందంగా గడిపారు పిల్లలు.