ఎంత చేసినా నిష్ప్రయోజనమే:-- యామిజాల జగదీశ్
 రోడ్డు పక్కన ఓ కుర్రాడు ఏదైనా పదిహేను రూపాయలు అంటూ వస్తువులను అమ్ముతున్నాడు.
ఓ పెద్దాయన అక్కడికి వచ్చి ఏదీ కొనకుండానే ఓ పది రూపాయలు ఆ కుర్రాడికి ఇచ్చి వెళ్లాడు.
పక్కనున్న ఆ కుర్రాడి మిత్రుడికి ఆశ్చర్యం.
ఏమిట్రా పది రూపాయలు ఇచ్చి ఏదీ కొనకుండా వెళ్ళిపోతున్నాడా పెద్దాయన. ఏమిటి సంగతి అని అడిగాడు మిత్రుడు.
వస్తువులు అమ్ముతున్న కుర్రాడు “ అదా, ఇంత చిన్న వయస్సులోనే వ్యాపారం చేయడానికి వచ్చేసావు. చదువుకోకూడదా అని ఓ మారు అడిగారు. చదువుతూనే ఉన్నానన్నాను. అలాగా. నిన్ను తలచుకుంటే ఎంతో గొప్పగా ఉంది. ఇదిగో ఈ పది రూపాయలుంచుకో అని ఇచ్చి ఏదీ కొనకుండా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇటువైపు ఎప్పుడు వచ్చినా ఆయన ఓ పది రుపాయలు ఇస్తారు. కానీ ఏదీ కొనకుండా వెళ్ళిపోతారు” అన్నాడు.
“అవునా.....చాలా మంచి మనిషిలా ఉన్నాడు” అన్నాడు మిత్రుడు.
“ఏమిటి మంచి మనిషీ...” అన్నాడు కుర్రాడు.
“ఎందుకురా అలా అంటున్నావు” అడిగాడు మిత్రుడు.
“ఒకప్పుడు నేను ఏదైనా పది రూపాయలకు అమ్మిన రోజులున్నాయి. ఇప్పుడు ఏదైనా పదిహేను రూపాయలకు కదా అమ్మతున్నాను. కానీ ఆ పెద్దాయన ఇప్పుడూ అదే పది రూపాయలు ఇచ్చిపోతున్నాడు” అన్నాడు కుర్రాడు.
కొందరికి మనం ఎంతలా సాయం చేసినా అది ఇలాగే ప్రయోజనం లేకుండా పోతుంది.