పుస్తకం -(బాల గేయం)--ఎం. వి. ఉమాదేవి -నెల్లూరు
పుస్తకమంటే నాకిష్టం 
దాన్లో కథలు మరి ఇష్టం 
రంగు రంగుల బొమ్మలతోటి 
జంతువుల పాత్రలు  నాకిష్టం!

ఋషులూ దేవతలుంటారు 
రాజులు రాజ్యం చేస్తారు 
సైన్యం యుద్ధం చాతుర్యంతో 
ఆపే కిటుకులు చెప్తారు !

సైన్సూ సూత్రం చదవాలోయ్ 
మేధకు పదును పెట్టాలోయ్ 
ఏమిటి ఎందుకు ఎలా అంటూ 
ప్రశ్నలు బుర్రలో నిండాలోయ్ !

హస్తకళలనూ చదవాలి 
మస్తుగా బొమ్మలు చెయ్యాలి 
మొక్కల పెంపకం తెలియాలి 
సముద్ర వింతలు చూడాలి !

పాటలు పద్యం నేర్చుకొని 
నాటకమొకటి వెయ్యాలోయ్ 
సమాజసేవ గురించి చదివి 
సాహసాలనే చెయ్యాలోయ్!