మాటల వాడకం: -- యామిజాల జగదీశ్

 మాటలెందుకసలు? అని ప్రశ్నించుకుంటే దానికి జవాబు మనమేం అనుకుంటున్నామో అవతలి వ్యక్తికి తెలియాలి. ఒకానొకప్పుడు ఒకరికొకరు సైగలు చేసుకునే వారు. తర్వాత మాట పుట్టింది. పుట్టుకొచ్చిన మాటలను ఎలా వాడాలన్నది కొందరికి జీవితాంతం తెలియదు. మాటలనెంతో జాగర్తగా వాడాలి. నోటికొచ్చిందల్లా మాట్లాడటం సరికాదు. ఆయుధాలతో చేసే గాయాలకన్నా కఠినమైన మాటలను ప్రయోగించి మనసును గాయపరిస్తే ఆ నొప్పి జీవితాంతం ఉంటుంది. 
అందుకే అంటుంటారు మాటలెలా ఉండాలంటే నెమలీక స్పర్శ ఎంత హాయిగా అనిపిస్తుందో అంతలా ఉండాలని. అంతేతప్ప శూలాలతో పొడిచినట్టు ఉండకూడదని. 
రష్యాకు చెందిన ప్రముఖ రచయిత టాల్ స్టాయ్ (1829 - 1910) జీవితంలో జరిగిన ఓ సంఘటన....
ఓరోజు టాల్ స్టాయ్ నడుచుకుంటూ పోతుండగా ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి
"అయ్యా!" అంటూ చెయ్యి చాచాడు. 
టాల్ స్టాయ్ జేబులో చెయ్యి పోనిస్తే చిల్లిగవ్వ కూడా లేదప్పుడు. దాంతో ఆయన మనస్సు బాధపడుతుంది ఏమీ ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేకపోయిందేనని. 
అప్పుడు టాల్ స్టాయ్ "సోదరా! ఇప్పటికిప్పుడు నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. మన్నించు‌" అంటారు.
అప్పుడా వ్యక్తి "నా యాచనలో ఇవాళ పొందినంత సంతోషం ఇంతకుముందెన్నడూ పొందలేదు. ఎవరైనా నాకు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. వస్తువు ఇచ్చి ఉండొచ్చు. కానీ మీరు నన్ను సోదరా అనడంతో మిమ్మల్నే నాకివ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మిమ్మల్నెప్పుడూ మరచిపోను. మీ మంచిమనసు ఎప్పుడూ వర్థిల్లాలి. బాగుండాలి" అంటాడు.
టాల్ స్టాయ్ వాడిన మాట సోదరా అన్నది ఎంత సున్నితమైందో ఎంత బలమైనదో గమనించాలి. 
మాట్లాడటంలోనే కాదు రాస్తున్నప్పుడు కూడా చాలా జాగర్తగా ఆలోచించాలి. రాసిన తర్వాత నాలుక్కరచుకోవడంకన్నా రాయడానికి ముందరే ఆలోచించి ఆచితూచి రాయడం ఎంతైనా ముఖ్యమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 
ఈ విషయమై నా జీవితంలో నాకు మా నాన్నగారి మాట మరచిపోలేనిది. 
నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఓ పెద్దాయన "జగదీశా! ఏం చేద్దామనుకుంటున్నావు?" అని అడగ్గా ఎంఎ తెలుగు చదవాలనుం దన్నాను. 
"దానికేం ప్రెసిడెన్సీ కాలేజీకీ వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకుందాం" అంటూ నన్ను అప్పటికప్పుడు ఆయనతోపాటు కాలేజీకి బయలుదేరమన్నారు. ఆయన ఇంటి దగ్గర బస్సెక్కాం. బస్సులో అవీ ఇవీ మాట్లాడుకున్నాం. ఓ అయిదారు బస్టాపులు దాటామో లేదో ఆయనో మాట అన్నారు. 
"మీ నాన్నగారు రిటైరైపోయారు. చదివించగలరో లేదో. డబ్బులకోసం ఆలోచించకు. నేను చదివిస్తాను. చదువుకో" అన్నారు. 
పాపం, ఆయన సదుద్దేశంతోనే ఆ మాట చెప్పి ఉండొచ్చు. కానీ నేను మరోలా అర్థం చేసుకున్నాను. మమ్మల్ని డబ్బులేని వాళ్ళుగా ఆయనెందుకు అనుకుంటున్నారు. మమ్మల్ని చులకనగా చూస్తున్నారా ఈయన అని ఏమేమో "అతి"గా ఊహించేసుకున్నాను. ఆయనను అపార్థం చేసుకున్నాను. దాంతో నేను అప్పటికప్పుడు "మీరు వెళ్ళండి కాలేజీకి. నాకు కాస్త పని ఉంది" అంటూ తర్వాతి స్టాపులో బస్సు దిగిపోయాను. 
రోడ్డుకి ఇవతలకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళే బస్సెక్కాను. వాళ్ళింటి దగ్గర బస్సు దిగి బస్టాపులో కూర్చుని ఓ ఉత్తరం రాసి ఆయన కుమార్తెకు ఇచ్చాను. ఆ ఉత్తరాన్ని ఇప్పుడు పొల్లుపోకుండా ఇక్కడ రాయలేను కానీ సారాంశమైతే చెప్పగలను. 
" ఎంఎ చదివిన వారికిచ్చే నీకు పెళ్ళి చెయ్యాలనుకుంటే ఆంధ్రదేశమేమీ గొడ్డుపోలేదు. బోలెడు మందుంటారు. చూసుకోమను. మా నాన్న రిటైరయ్యారని చెప్పడానికి ఆయనెవరు...." ఇలాటి మిటలతో ఉత్తరం రాసి యామిజాల జగదీశ్ అని సంతకం చేసాను. 
ఈ ఉత్తరం మా రెండు కుటుంబాల మధ్య బంధాన్ని విచ్ఛిన్నమవడానికి మూలకారణమైంది. 
అప్పుడు మా నాన్నగారు నాకు చేసిన సూచన
"ఎప్పుడైనా సరే సంతకం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఏం రాస్తున్నామో ఆలోచించాలి. అంతేతప్ప మాటలున్నాయి కదాని అనుకున్నదల్లా రాయకూడదు. పెద్దవారికైనాసరే సమవయస్కులకైనాసరే పిల్లలకైనాసరే ఏం రాస్తున్నాం ఎందుకు రాస్తున్నాం అని నిశితంగా ఆలోచించాలి. ఏదీ ఆలోచించకుండా రాసేసి ఆ తర్వాత అనుకోని చిక్కుల్లోపడితే లాభం లేదు. మాటల వాడుక విషయంలో చాలా జాగర్తగా ఉండాలి" అన్నారు. 
నా తొందరపాటుతనం, ఆవేశపూరిత రాత చేటు తెచ్చిపెట్టిందన్నది ఆలస్యంగా గ్రహించాను. ఏం లాభం? అప్పటికి మా రెండు కుటుంబాల మధ్య బంధం తెగిపోయింది.