2007 మార్చిలో ఇంటర్ ఎగ్జామ్స్ వ్రాసి మేలో జరిగే ఎంసెట్టు కు ప్రిపేరవుతున్నారు. మా అబ్బాయిలు. కేవలం మన రాష్ట్రంలోని ఎంసెట్టే కాకుండా ఆల్ ఇండియా నిర్వహించే ఎయిమ్స్, జిప్ మార్, బిహెచ్ యు, మణిపాల్ వంటి నేషనల్ ఎగ్జామ్స్ కు కూడా అటెండ్ అయ్యారు. అందులో మణిపాల్ యూనివర్సిటీ వాళ్ళు ఈ సంవత్సరం కొత్తగా ఆన్ లైన్ ఎగ్జామ్ పెట్టారు. ఈ ఎంట్రెన్స్ లో మా చిన్నబాబుకి సీటు వచ్చింది. నేషనల్ కాంపిటీషన్ ఎగ్జామ్ లో మా బాబుకి సిటోచ్చింది అని సంతోషించే లోపు అక్కడ వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ. వర్షాలు చాలా ఎక్కువ అని తెలిసిన వాళ్ళు చెప్పారు. సరే ఆ కాలేజీ వాతావరణం ఎలా ఉందో పరిసరాలు ఎంతో చూసొద్దామని మణిపాల్ వెళ్ళాలనుకున్నాం. మణిపాల్ కు ట్రాన్స్ పోర్ట్ ఏది డైరెక్ట్ గా లేదు. హైదరాబాదు నుండి బెంగుళూరు వెళ్ళి అక్కడ పనిచూసుకొని సెక్యూరిటీ చెక్ కు టైముండడంతో స్టాల్స్ అన్నీ తిరిగి చూస్తున్నాం. ఇంతలో ఒకతను బ్రీఫ్ కేసు పట్టుకొని ముందుకి వచ్చి అక్కడి కుర్చిల్లో కూర్చున్నాడు. ఎస్పీ బాలసుబ్రమణ్యం లా ఉన్నాడే అనుకోని పరీక్షగా చూస్తే ఆయనగాన గంధర్వుడు ఎస్పీ బలుయే. ‘పాడుతా తీయగా’ మొదలైన దగ్గర్నుంచి ‘ఈయన ఈ కార్యక్రమాన్ని ఇంత అధ్బుతంగా ఎలా నిర్వహించగలుగుతున్నాడు’ అనుకుంటూ క్రమంగా ఒక్కటి కూడా వదలకుండా చూసేస్థాయికి వచ్చాము. తెలుగు భాషపై ఆయనకున్న పట్టు మన సంస్కృతి పై ఆయనకున్న గౌరవం ఈ ప్రోగ్రామ్ కు ముందు మామూలు ప్రజానీకానికి తెలియదు. పాటలు అధ్బుతంగా పడుతారని మాత్రమే తెలుసు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పిల్లలకు సంగీతం పట్ల అభిమానం పెరగడానికి, పిల్లల వేషధారణలు చూడముచ్చటగా ఉండటానికి, తెలుగును చక్కగా ఉచ్ఛరించడానికి ఆయన చేసిన ప్రోగ్రాములే కారణం. అలా చూస్తుంటే ఇవన్నీ గుర్తుకొచ్చాయి. బాలు కూడా మా విమానమే ఎక్కడు అంటే తాను మంగుళూరు వెళుతున్నడన్నమాట. ఎంతో ఇష్టమైన బాలును చాలా దగ్గరగా చూడగలిగినందుకు సంతోషంగా ఉంది.
విమానం బయలుదేరిన తరువాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది ఆకాశంలో. మబ్బులన్నీ గుంపులు గుంపులుగా సూర్యుణ్ణి బయటకు రాకుండా ఘోరావ్ చేస్తున్నాయి. ధవళవర్ణంలో స్వచ్ఛంగా చాలా పెద్దగా, అందంగా విమానానికి అడ్డంగా ఉన్నాయి. విమానంలో నుంచి మబ్బుల్ని ఇంతకు ముందు ఎన్నోసార్లు చూశాను. కానీ ఇంత ఆహ్లాదంగా, మనోహరంగా ఎప్పుడు కనిపించలేదు. ఈ దారంతా పశ్చిమ కనుమలు వ్యాపించి ఉండటం వలన ప్రయాణంలో అలసట తీర్చుకోవటానికి కొండలపై వాలాయో ! లేదా ఆ కొండలపై సమావేశం నిర్వహించుకుంటున్నాయో ! అవి గాఢంగా, దగ్గర దగ్గరగా ఉండటం వల్ల రధం, డైనోసార్, ఏనుగు, అశ్వం ఇలా రకరకాల ఆకరాల్లో కనిపిస్తున్నాయి. అలా ఆకారాల్ని ఊహిస్తూ వాటి మధ్యలో నుండి విమానం వెళుతుంటే ఏ దేవలోకం లోనో ఉన్నట్లనిపించింది. ఇలా పరవశించి చూస్తుండగానే విమానం ఒక చిన్న జర్క్ ఇచ్చింది. ఉలిక్కిపడి ఎదురుగా చూస్తే చుట్టూ మేఘాలే. విమానం ఆ మేఘాలను చీల్చుకొని పోతున్నట్లనిపించింది. ఒక్కక్షణం భయం కలిగింది. పొగమంచులో చిక్కుకొని విమానాలు కూలిపోయాయి అని వార్తల్లో చూస్తాం కదా! విమానం పడదు కదా! అని భయమేసింది. ఎటు చూసిన మబ్బులే తప్ప ఆకాశమే కనిపించట్లేదు. ఈ ఊహరగానే అప్పటి దాకా ఆహ్లాదంగా, అందంగా కనిపించిన మబ్బులు వికారంగా, నోళ్ళు తెరుచుకున్న దెయ్యాల్లా కనిపించాయి.
మంగళూరు ఎయిర్ పోర్ట్ చాలా చిన్నది. దీన్ని బాజ్పే ఎయిర్ పోర్ట్ అని కూడా అంటారు. ఇక్కడ మంగళదేవి ఆలయం చాలా బాగుంటుందట. ఆ అమ్మవారి పేరు మీదగానే ఈ ఉరుకు మంగుళూరు అనే పేరు వచ్చిందట. ఇక్కడ నుంచి మణిపాల్ 60 కి.మీ. ఉంటుంది. టాక్సీ మాట్లాడుకొని వెళ్ళేటప్పుడు దారిలో డ్రైవర్ ఇవన్నీ చెప్పాడు. ఇంకా ఇక్కడికి దగ్గర్లో మూకాంబిక ఆలయం ఉంటుందట. ఇవన్నీ చూడమన్నాడు. కానీ మనకు టైమేది అనుకుని దారిలోని పొలాలు, చెట్లు చెమల్ని చూడటంలో నిమగ్నమైపోయాం.
ఉడిపి చేరుకొని అక్కడ హోటల్లో లాగేజీ పెట్టి మణిపాల్ వెళ్ళాం. అరేబియా సముద్రపు ఒడ్డున, పెద్ద పెద్ద బిల్డింగులతో ప్రపంచంలోని విజ్ఞానమంతా తెచ్చి ఇక్కడే కుమ్మరించరా అనిపిస్తుంది. పెద్దగా ఊరేమీ లేదు. కాలేజీల బిల్డింగులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇదే మణిపాల్. నీలంగా ఉన్న సముద్రం పై ఎగిసిపడే అలలు, పచ్చని కొబ్బరి చెట్లు. వాతావరణం ఆహ్లాదంగానే ఉన్న ఎండమాత్రం మండిపోతుంది. ఇక్కడ వర్షపాతం ఎక్కువన్నారు. కానీ మేమున్న రెండు రోజులు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు.మెడిసిన్, ఇంజనీరింగ్, నర్సింగ్, ఫార్మసీ, మేనేజిమెంట్, మాస్ కమ్యూనికేషన్ వంటి ఇరవై ఇన్ స్టిట్యూట్ లు, సుమారు నూట ఎనబై కోర్సులతో స్వయం ప్రతిపత్తి గల మణిపాల్ యూనివర్సిటీ సరస్వతీ దేవి పుట్టినిల్లా అనిపించేలా ఉంది. సుమారు 30 దేశాల నుంచి పదిహేను వేల మండి విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇక్కడ చేరుతున్నారంటే ఇదెంత విజ్ఞాన భండాగారమో కదా! 1953లో డా..టి.ఎమ్.ఎ. పాయ్ మొదటగా ఇక్కడ ‘కస్తూర్బ మెడికల్ కాలేజీ’ని స్థాపించాడు. ఇది క్రమక్రమంగా అంచెలంచెలుగా పెరిగి ‘మణిపాల్ యూనివర్సిటీ’గా పేరు మార్చుకొని 1993లో భారత ప్రభుత్వం చేత ‘డీమ్డ్ యూనివర్సిటీ’గా గుర్తింపు పొందింది. ఇండియా లోని బెస్ట్ మెడికల్ కాలేజీలలో ఇది ఐదవర్యాంక్ సంపాదించింది.
ఉడిపి అనగానే శాఖాహార ఫలహారాలకు పెట్టింది పేరు. అంతేకాదు సిండికేట్ బ్యాంకు కూడా ఇక్కడే పురుడు పోసుకుందట. ఇక్కడంతా కోంకణ్ రైల్వే. సాయంకాల సమయంలో మార్పే బీచ్ కు వెళ్ళాం. అక్కడ ఉన్న ఒంటెల పై మా పిల్లలు ఎక్కి తిరిగి వచ్చారు. ఈ బీచ్ లోని నీళ్లలోనే శ్రీకృష్ణ విగ్రహం పడవనడి పే వాళ్ళకు దొరికిందట. ఆ విగ్రహాన్ని శ్రీ మధ్వాచార్యులు ఉడిపిలో ప్రతిష్టించారట. ఇది 13వ శతాబ్దంలో జరిగిన విషయం. మాల్పే బీచ్ నుండి శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళేసరికి చీకటి పడింది. మేం వెళ్ళేసరికి స్వామివారు రథంలో ఊరేగుతున్నారు. రథం దీపాలతో చక్కగా అలంకరించబడి ఉన్నది. చాలా మంది స్త్రీలు హారతులు పట్టుకొని రథం చుట్టూ నిలుచోని ఉన్నారు. ఈ రథం చెక్కతో చేయబడి రాగి, బంగారాలతో తాపడం చేశారట. దీనిని శ్రీ విద్యామాన్య తీర్థ స్వామీజీ కృష్ణ మఠానికి దానంగా ఇచ్చారట. చాలా మంచి సమయానికి వచ్చామే అని సంతోషపడుతూ లోపలికి వెళ్ళాం. గుడి వెనక భాగం నుంచి స్వామిని దర్శించుకోవాలి. మామూలుగా అన్నీ దేవాలయాల్లో లాగా స్వామి ఎదురుగా ఉండదు. వెనక్కి తిరిగి ఉంటాడు. అదీ నేరుగా దర్శించుకోవటమే. ఓ కిటికీలో నుంచి మాత్రమే దేవుణ్ణి దర్శించుకోవాలి. పూజలు కూడా అలాగే చేస్తారు. ఈ కిటికీకి ‘కనకన కిండి’ అని పేరట. దీనికో కథ చెప్పారు అక్కడి ఆలయపూజారులు. 16వ శతాబ్దంలో శ్రీవాదిరాజు పరిపాలనా కాలంలో ‘కనకదస’ అనే కృష్ణభక్తుడు ఈ ఆలయానికి వచ్చినప్పుడు కులం కారణంగా ఆలయ ప్రవేశం జరగలేదు. అందుకని స్వామివారి విగ్రహం వెనకానున్న కిటికీ దగ్గర కూర్చుని కృష్ణుని చూస్తుండేవాడట. స్వామి అతని భక్తికి మెచ్చి ముందు నుంచి వెనకకు అతనివైపు తిరిగాడ. అందువల్ల ఆలయ ముఖద్వారం ఒకవైపు స్వామి వారి ముఖం మరొక వైపు ఉంటాయి. ఈ కిటికీ మీద మహావిష్ణువు దశావతారాలు చెక్కబడి ఉంటాయి. శ్రీ మహావిష్ణువు భక్త సులభుడు అనడానికిది తార్కాణం. ఇక్కడి ప్రజలు తుళు, కన్నడ, కొంకిణి భాషల్లో మాట్లాడుతున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి