మంత్రపు నాణాలు (బుజ్జిపిల్లలకు బుజ్జికథ): ౼ దార్ల బుజ్జిబాబు

   ఒకరోజు ఎలుగుబంటి, ఒంటె కట్టెలు తేవటానికి అడవికి వెళ్లాయి.
       చెట్లను నరకటం మొదలు పెట్టాయి. 
       అప్పుడే అటుగా వస్తున్న సింహం చూసింది. 
       అది ఆ అడవికి రాజు,
       "ఎవర్రా మీరు అడవిని నరుకుతున్నారు? ఇది
నా సామ్రాజ్యం అని తెలియదా? ఇందులో పూచిక పుల్ల అయినా పోవటానికి వీలులేదు. మర్యాదగా బయటకు పదండి. లేకుంటే మీ ప్రాణాలు తోడేస్తా." అన్నది.
       బంటి, ఒంటె  చేతులు కట్టుకున్నాయి. 
       భయంతో వణికి పోయాయి.
       ఇలా అన్నాయి. "మృగరాజు! మేం నీరు పేదలం. 
కట్టెలు కొట్టటమే మా జీవనం. వీటిని అమ్మి రూకలు తెస్తాం. సూకలు కొంటాము. ఇంటి అవిడ జావ చేస్తుంది. 
అదే పిల్లలకు భోజనం" అని వాటి దీనగాథను వినిపించాయి.
       "అలాగా నా దేశంలో పేదలు ఉండటానికి వీలులేదు. నా వెంట రండి. విలువైన కానుకలు ఇస్తాను.  సుఖంగా బ్రతకండి"  అన్నది సింహం.
        అవి రాజును వెంబడించాయి.
        వాటికి చెరొక మూట ఇచ్చింది. 
       "ఇవి మంత్రించిన బంగారు నాణాలు, అవి ఎంత ఖర్చు చేసినా తరగనే తరగవు. మీరు మంచివారు కనుక ఇస్తున్నాను. తరతరాలు తినండి" అన్నది సింహం.
        వాటిని తింటూ పనిచేయకుండా బతకవచ్చు అనుకున్నాయి. బంటి, ఒంటె. 
       సంతోషంగా ఇంటికి వెళ్లాయి.
       మూటలు విప్పి చూశాయి.
       అందులో నాణాలు లేవు. 
      పండ్ల చెట్లు విత్తనాలు ఉన్నాయి. 
      "రాజు మోసం చేశాడు" అనుకున్నాయి. 
      “వీటిని బయటకు విసిరేద్దాం" అన్నది బంటి. 
       "వద్దు వద్దు ఇందులో ఏదో మర్మం ఉంది. నాటి చూద్దాం" అంది ఒంటె. 
       విత్తనాలు నాటాయి. 
       చెట్లు మొలిచాయి. 
       కాపుకు వచ్చాయి. 
       ఎన్నో రకాల పండ్లు కాచాయి. 
       వాటిని అమ్మేశాయి బంటి, ఒంటె.
       ఎంతో ధనం సంపాదించాయి.
       ఒకరోజు సింహం వచ్చి చూసింది.
       ఎంతో సంతోషించింది. 
       "ఆ రోజు మీకు నిజమైన బంగారు నాణాలు ఇచ్చి ఉంటే సోమరులు అయ్యేవారే.  విత్తనాలలో ఎంత మహత్తు ఉందో చూశారా?  ప్రతిరోజు బంగారు గుడ్లు పెడుతున్నాయి.  ఉపాధి కల్పిస్తున్నాయి" అన్నది సింహం.
నీతి :  ఆకలిగా ఉన్నవారికి  అన్నం పెట్టటం కాదు, సంపాదించే మార్గం చూపాలి.