కొసరుబేరం:- సత్యవాణి కుంటముక్కుల

 మా రవణగారి కొట్లో ఉప్పుతో తొమ్మిదేకాదు,పంతొమ్మిదో ,పాతికో అంతకంటే ఎక్కువో దినసరి వెచ్చాలమ్మేవారు.
         అంతఎక్కువకాదుగానీ గురుమూర్తిగారి కొట్లోకూడా సరుకులలాగే  ఎక్కువగానే అమ్మేవారు.
ఆపక్కన పోలీస్ కొట్టు ,గీలీస్ కొట్లు వుండేవికానీ,అబ్బే వీటికీ వాటికీ పోలికేలేదు.చింతపండుందాంటే ,ఉప్పట్టికెళ్ళండీయాల్టికి,రేపిత్తాను సింతపండనేరకం మిగతావాళ్ళందరూ.
                        అయితే రవణగార్కి గురుమూర్తిగార్కి చుట్టరికముండడమేకాదు,లౌక్యంగూడాబాగా తెలిసి వుండడంవల్ల, ఏదైనా లేకపోయినా, లేదనకుండా మనల్ని మాటల్లోపెట్టి పక్కనున్న ఆ చుట్టం కొట్టునుంచి క్షణంలో తెప్పించిమనంఅడిగిన సరుకు తెప్పించి ఇచ్చేసేవారు.
                        అయితే  వాళ్ళ కొట్టుముందర "అరువు రేపు" అన్న అట్టముక్కమీద నీలిమందుతోరాసిన  పెద్ద పెద్ద అక్షరాలు అర్థంఅయ్యేవికావు ఎందుకంటే నాకు ఆవయసులో చాలా విషయాలు తెలియవు,అందులో అరువంటే ఏమిటో అసలే తెలియదు.
               మా రవణగారి కొట్టుకీ,గురుమూర్తిగారికొట్టుకీ సాధారణంగా పెద్దిళ్ళవాళ్ళెవరూ బేరానికి(కొనడానికి) ఎప్పుడోకానీవచ్చేవారు కాదు ఎందుకంటే వాళ్ళు కొనేవి పంచదార, కరెంటు అప్పటి ఇంరాలేదుకనుక కిర్సనాయిలు,సబ్బులు వంటివి మాత్రమే కొనేవారు.అవేనా ఎందుకంటే ,వాటిని పొలాల్లో పండించలేరుకనుక.
          అందుకనే చిల్లర శ్రీమహాలక్ష్మి అనుకొంటూ  షావుకార్లు చిన్నచిన్న సరుకులబేరాలమీదే దృష్టిపెట్టేవారు.
           పాకల్లోనిపిల్లలు
 జుట్టువిరమోసుకొని,పైన ఏమీలేకుండా అర్థనగ్నంగా ఆడపిల్లలూ,నగ్నంగానొ,చిన్నగోచీగుడ్డెట్టుకొనో మొగపిల్లలూ
బేరాలకు వచ్చేవారు. ఏ సమయంలో అంటే ఉదయాస్థమయ సమయాల్లో.
ఎందుకంటే ఆ సమయాల్లోనే సీసాల్లో నూనిసుక్క అయిపోయిందనో,కూరలోవేసే వర్ర అయిపోయిందనో,శారెట్టడానికి సింతపండైపోయిందనో ,దీపంబుడ్లో సమురైపోయిందనో గుర్తొస్తుందివాళ్ళ అమ్మలకి.అప్పుడు పాతగ్రైప్ వాటర్ సీసాలకుతాడుకట్టిన సీసాలను ఆ బుడ్డోళ్ళ చేతికిచ్చి,రూపాయో పాపాయో చెతిలోపెట్టి నూని,కిర్సనాయిల్ ,వర్ర మొదలైనవి తెమ్మని ఈ కుర్రగాళ్ళను తోలేస్తారు కొట్లమీదకి. ఆకుర్రగాళ్ళు ఆటల్లోపడి మేంపోం,మేం ఆటాడుకోవాల అంటే ,కొట్టుమీదకెల్లి సామాన్లి కొంటే కొసరెడతార్రా ఎర్రెదవా! ఎల్లు ,ఎల్లి సావుకార్ని కొసరడుగెహే! అని వాళ్ళను బెలిపించి పంపిస్తారు కొట్లమీదకి.
             ఇంక అలాంటి సమయంలో చూడాలి షావుకార్లవిన్యాసం.ఈపిల్లకాయలు ఒకేసారి పదులు పాతికమందిలు కొట్టుదిగువను మూగేస్తారు.అవును వాళ్ళమ్మలంతా పొద్దున్నైతే కూడొండి కూలికి పోవాలన్న తొందరా,మళ్ళీ సాయంత్రం కూలినుంచి తిరిగొచ్చి కూడొండి బిడ్డలకు పెందరాళే పెట్టాలనే ఆరాటం.ఏరోజు సరుకులారోజే. పిట్టను కొట్ట -పొయ్యలో పెట్టా బతుకుయెమరి.అందుకనే ఆసమయాల్లో అంతరద్దీగా వుంటుంది పాకల్లోని పిల్లకాయలతో షావుకార్ల కొట్టుముంగిట.
                     ఇంక ఆసమయంలో మా రవణా ,గురుమూర్తి,పోలీసూ లాంటి షావుకార్లకి రెండుచేతులూ వందచేతులౌతాయి.అర్థనా కిర్సనాయిలెయ్యండి, బేడకాసు నూనెయ్యండి, రూపాయ వర్రెట్టండి  అంటూ వూదరగొట్టేస్తారు పిల్లలు.ఆ సమయంలో పెద్దబేరాలొచ్చినా
కాసేపు మీరుపక్కనుండండిం.ఈళ్ళగోలవదలగొట్టి మీకాడకొస్తాను అని ప్రక్కనుంచేస్తారు వారిని.
              మరదే షావుకార్ల వ్యాపార రహస్యం. ఈ చిల్లర అణా కానీ బేరాలు రోజుకి రెండుపూటలా పండే నిత్యపంట .ఇందులో గిట్టినట్టు వారానికో నెలకో వచ్చే ఒక పెద్దబేరంలోలాభంగిట్టదు.
           సరే మళ్ళీ కుర్రబేరాలదగ్గరకొద్దాం.నాకు ముందు  అర్థనాకిర్సనాయిలు పొయ్యమని ఒకడంటే,నాకుబేడకాసు నూనెయ్యండని మరొకడంటాడు. బేగాతేకపోతే మాఅమ్మతంతాది, నాకుముందు రూపాయి వర్రెట్టండి అటుంది బుర్రబరబరా గొక్కుంటూ ,పైనగుడ్డేసుకోని ఇంకొకపిల్ల.అందరూ ఒకేసారి గోలగోలగా ఒకరినొకరు తోసుకుంటుా ,నాకు ముందెయ్యండంటే నాకుముందెయ్యండని,ఒకరినొకరు తోసుకొంటుంటే,వాళ్ళచేతుల్లోని గ్రైప్ వాటర్ గాజుబుడ్డిలు గలగలమని చప్పుడుచేస్తుండగా,ఏటి నేనుముందొచ్చేనంటే నేనుముందొచ్చేనని ఒకరినొకరు తోసుకుంటుా,గోలగోలగా మాట్లాడుతున్నా,"ఉండండెహె గోలసెయ్యకండి,అంటూ బొంగురుగొంతులతో షావుకార్లు కసిరేసరికి బిక్కచచ్చినట్లున్న కుర్రగాళ్ళు, మళ్ళీ  అదేగోల నాకుముందంటే ,నాకుముందని.అదేమిచిత్రమోగానీ,ఎవరెవరేమడిగారో వాళ్ళకి అవే ,అవే క్షణాలమీద  అవధానాల్లో అవధాని ఎలా అయితే పృఛ్ఛకులడిగినప్రశ్నలకు ఎవరికి వారికి ఎలాగైతే ధీటుగా జవాబిస్తాడో,అలాగే సరుకులందిస్తారు.అంతేకాదు,"ఏరా మీఅమ్మ చేపలపులుసు బాగా వండుతుందటకదా!నాక్కాస్త తెస్తావేంట్రా "అంటే,"పోండి కోమటాయనా!మీరు నీచు తినరుగందా"అంటూ పకపకా నవ్వుతారువాళ్ళు.
                షావుకారిచ్చిన     సరుకులు తీసుకొనిపోతారా ఆ పిల్లకాయలు,అలా పోతే వాళ్ళు గడుగ్గాయలెలాఅవుతారు ?
             ఏయండీ!కోమటాయనా! సిన్న బెల్లంముక్క కొసరెట్టండి అంటాడొకడు,ఏయండీకూసిన్ని బఠానీగింజలెట్టండి అటాడొకడు, కాసింత సెనగపప్పెట్టండి అంటుందొకచిన్నపిల్ల.కొట్టుముందు పిల్లకాయల గడబిడ అంతా ఇంతాకాదు.
                మాషావుకార్లు రవణా గురుమూర్తి వగైరాలకు చిరాకన్నది ఏమిటో తెలియనట్లుగా,తియ్యతియ్యగా కసురుకొంటూ," ఉండండేస్  అంటూ ముందే చితకొట్టుకొని వుంచుకొన్న చీమ తలకాయంత చిన్నచిన్న
బెల్లంముక్కలను చిన్నగాళ్ళచేతిలో ఎత్తిపడేస్తారు. గుల్లశనగపప్పు,బఠానీగింజలూ నోటితో లేదనకుండా చేత్తో లేదన్నట్లు చిటికెడేసి గింజలు చిన్నారుల చేతుల్లో పోస్తారు.
అప్పుడు ఆ పిల్లలమొహాల్లో ఆనందంచూడాలి అప్పటికప్పుడు.మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీఈ కథంతామామూలే. మళ్ళీ షావుకారుల కొట్టుల్లో చిల్లరబేరాలుా మొదలు,పిల్లకాయల కొసరు బేరాలూ మొదలు,షావుకార్లకి ఊపిరాడని హడావిడీ మొదలు.
            ఇంతకీ ఆ బుడ్డోళ్ళకి కొసరెందకెట్టాలంటారా? అదే బిజనెస్ టెక్నిక్ .చిన్న కొసరు పడేస్తే ,కుర్రబేరాలు పక్కకెక్కడికీ పోవు.చిల్లరబేరాలు సిరిపంటలని మా షావుకార్లకి బాగాతెలుసు.