చేమంతి:-రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

 చేమంతి పూవంటి చెల్లెల్ని ఈయవే – అంటూ పాడుకుంటూ కోరుకుంటూ గొబ్బి పూజ చేసే ఆడపిల్లలు గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ పాడే పాటలో చేమంతి పూ ప్రసక్తి ఉంటుంది
చేమంతిని చామంతి, సేమంతిక, సేవంతి, శతపత్రిక, గొజ్జగి మొదలైన పేర్లతో పిలుస్తారు. రేకు చామంతి, ముద్ద చామంతి, నక్షత్ర చామంతి, గడ్డి చామంతి మంచి వాసననిచ్చే కస్తూరి చామంతి – ఇలా చామంతి ఎన్నో రకాలుగా ఉంది.  ఈ చామంతి తెలుపు, పసుపు రంగుల్లో ఎక్కువ కనబడుతుంది. క్రైశాంతిమం అంటూ ఆంగ్లభాషలో  పిలువబడే ఈ చామంతి పూలలో గడ్డి చామంతి అన్నిటికన్నా పెద్దదిగా, నక్షత్ర చామంతి అన్నిటికన్నా చిన్నదిగా ఉంటుంది.
సన్నని తొడిమలు, రేకులు గల ఈ చామంతి ఈనాడు సంవత్సరం పొడవునా దొరుకుతూనే ఉంది. అందంగా ముద్దుగా ఉండే ఈ పూలు – సువాసన గలిగిన ఈ పూలు తోటలలో పెంచబడే ఈ పూలు దేవుడి పూజలో వాడబడతాయి. ముదితలు జాడల్లో ముడులలో మాలలు కట్టి పెట్టుకోటానికి, పూల గుత్తులు కట్టటానికి, గులాబులు చమ్కీ మొదలైన వాటితో కలిపి దండలు కట్టటానికి చామంతులు వాడబడుతున్నాయి. ఇంకా ఔషధ తయారీలోను ఈ పూలు అవసరమౌతున్నాయి. స్త్రీలు తమ జడనలంకరించుకోటానికి బంగారుతో చామంతి పూవు ఆకారంలో ఉండే  చామంతి బిళ్ళను చేయించుకుంటారు.
బతుకమ్మ పండుగ రోజు, పూల యాగాల లోను ఈ పూవుంటుంది.
 ఈ పూవు పేరునుపయోగించి –
“గొజ్జంగి తేటలో మజ్జనంబాడి జరీ ముద్ద వల్వ ధరించి, యుల్లి  పొరమించు పల్చ నంగరఖా బిగింపించి
పటు రాజనపు కోలపాగ జుట్టి” –
(పైడిపాటి సుబ్బరాయశాస్త్రి – కవి గండపెండేరము) అంటూ కవిత్వము చెప్పబడింది. వ్యవహారంలో చామంచి అంటూ పిలువబడే ఈ పూలను ఇష్టపడని వారుండరు.
హేమంత సేమంతికలు...అంటూ,
చేమంతులతో హేమంతం ..అంటూ కృష్ణశాస్త్రి అనే కవి కవిత్వంలోను తొంగి చూసిందీ పూవు.