కోడిపుంజు విజయం (కథ) ---సరికొండ శ్రీనివాసరాజు


  రామయ్య అనే రైతు ఒకరోజు బాగా అలిసిపోయ, ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొమ్మ మీద కోయిల శ్రావ్యంగా పాడుతుంది. అది తనివి తీరా వింటూ అక్కడే ఉండిపోయాడు రామయ్య. ఇంతలో రామయ్య భార్య వైదేహి వచ్చి, "ఇంటికి రావా? ఎంతసేపు ఇక్కడ నిల్చుంటావు?" అంది. "ఈ చెట్టు మీద కోయిలమ్మ పాటను వింటే నాకు ఇక్కడి ఉండబుద్ధి అవుతుంది." అన్నాడు రామయ్య. "ఓ కోయిలమ్మా! మా ఇంటికి రావమ్మా! లేకుంటే మా రామయ్య మా ఇంటికి వచ్చేట్లు లేడు." అన్నది వైదేహి. రామయ్య ఇంటికి బయలుదేరాడు.


       కోయిల నిజంగానే రామయ్య ఇంటివద్దకు వచ్చింది. ఇంటి మీద ఉన్న వేపచెట్టుపై వాలింది. రామయ్య కోడిపుంజును పెంచుకున్నాడు. కోడిపుంజు కొక్కొరోకో అవసాగింది. కోయిల కోడిపుంజు వద్దకు వెళ్ళి, "ఇక ఆపుతావా నీ పాడుగోల. కర్ణ కఠోరంగా ఉంది. నీ యజమాని నిన్ను రోజూ ఎలా భరిస్తున్నాడో! నా శ్రావ్యమైన గొంతు విని,‌ మీ యజమాని నన్ను ఇక్కడికి ఆహ్వానించాడు తెలుసా? ఇక నిన్ను వెళ్ళగొట్టడం ఖాయం." అంది. కోడిపుంజు ఎంతో బాధ పడింది. 

       ఆ రాత్రివేళ కోయిల అదేపనిగా కూయసాగింది. రామయ్యకు నిద్ర పట్టలేదు. కోపంతో కోయిలపై ఒక రాయి విసిరాడు. కోయిల అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మరునాడు ఉదయం అదే చెట్టుమీదకు కోయిల వాలింది. ఊరికి వెళ్ళడానికి సిద్ధమైన రామయ్య వైదేహితో "చూశావా? అలారం ఎందుకో మోగలేదు. ఉదయం ఐదు గంటలకే కొక్కొరోకో అంటూ నన్ను లేపింది. ఈ కోడిపుంజు ఈరోజు నా పాలిట దేవుడు." అన్నాడు రామయ్య. కోయిల వైపు గర్వంగా చూసింది కోడిపుంజు. కోయిల అవమానంతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అందుకే మన గొప్పతనాన్ని చూసి విర్రవీగ రాదు. ప్రతి జీవితంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించి ఇతరులు గౌరవించాలి.