ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం

నా సిన్న తనంల  

అరుసకు

బావ, బామ్మర్డులు,

అదినె, మరదల్లు

బావ, మరదల్లు అయేటోల్లు 

గీ 'ఓలి' పండుగ ఆడుకునేటోల్లు. 

మా మల్లారం ల

జీవయ్య దొర సెలుకల 

మోతుకు సెట్లు బగ్గుంటేటివి.

గట్లనే ఎంకయ్య దొర సెలుకల గుడ కొన్ని మోతుకు సెట్లుండేటివి. 

గా మోతుకాకుల తొని 

ఇత్తార్లు కుట్టి టోల్లు.

లగ్గాలకు,పురుల్లకు,

పుట్టెంటిలకు,ఇది,అదని

కాదుల్లా, ఏ కార్యమైనా

ఇత్తార్లల్లనే తినేటోల్లు


మోతుకు పూలతోని 

రంగు తయారు జేసేటోల్లు

ఒకల్లకొకొల్లు

మొకానికి, సెంపలకు

కుంకుమ రుద్దుకునేటోల్లు,

శానా మంది

ఒకల్ల మీద ఒకల్లు

కుంకుమ లీల్లు జల్లుకునేటోల్లు

తక్కువ  మంది

మోకానికి కచ్చురం గీరెల కున్న

కందెన గుడ పూసుకునేటోల్లు.

కొందరికి రంగులు పూపిచ్చు కోవడం ఇట్టం లేకపోతే  బయపడి 

ఉరికె టోల్లు.

అయిన గని ఆల్లను దొరికిచ్చుకొని రంగులు పూసెటోల్లు

పన్నెండు కొట్టినంక 

బాయిల కాడికి వోయి 

రీన్ సబ్బును బగ్గ రుద్దుకొని

తానం జేసెటోల్లు.

అంగీలకు,లుంగీలకు 

పిడిక సబ్బు పెట్టినా

రీన్ సబ్బు ఎంతవెట్టి ఉతికినా

గా రంగు మరకలు 

పోయేటివి కాదుల్లా!


ఓసారి ఏమైందంటే..

జంగం పెద్ద ముత్తయ్య 

పరాశ్కానికి

అరుసకు మరదలు అయ్యే  

ఓ ఆడి మనిషి మొకానికి 

కందెన పూసిండట.

గంతే.. ఆమెకు నచ్చక నలుగుట్ల పంచాతి వెట్టింది.

ఒక్కటుల్లా

పరాశ్కం ఆడినా,

కైత్కాల్ జేసినా సంబురం

గావాలే గని

మనుసుకు కొద్దిగ గుడ

బాద అనిపియ్యద్దుల్లా.

పండుగలకు,పబ్బాలకు

ఆడుకుంట, పాడుకుంట

సుట్టు పక్కలోల్ల తోని

మంచిగ కలిసి మెలిసి ఉండుకుంట,

కట్టమైనా, సుకమైనా  పంచుకుంట బతుకుడే

పల్లెల నీతి, రీతి

ఔ మల్ల!