గొణుగుడే గొణుగుడు:-- యామిజాల జగదీశ్
 ఆఫీసు నుంచి ఇంటికి వచ్చీరావడంతోనే కృష్ణారావు గొణగడం మొదలుపెట్టాడు. మానవత్వం చచ్చిపోయిందే....స్వార్థం పెరిగిపోతోంది రోజురోజుకీ...పోయేటప్పుడు ఏమన్నా తీసుకుపోతారా....లేదే అంటూ అరుస్తున్నాడు.
"ఏంటండీ ఏమైంది? ఆఫీసులో ఎవరన్నా ఏదన్నా అన్నారా?" అడిగింది భార్య జయ.
"ఆఫీసుకేం, లక్షణంగా ఉంది. ఉదయం ఆఫీసుకి పోతున్నప్పుడు ఎస్ ఆర్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఓ రోడ్డుప్రమాదం. ఆటో డ్రైవర్ స్టాట్ లో పోయాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ పెద్దాయనకు తీవ్రగాయా లు. వాళ్ళావిడకు ఓ మోస్తరు గాయాలు. కాపాడండి కాపాడండి అంటూ అరుస్తున్నారు. కానీ ఒక్కరూ వారి దగ్గరకు వెళ్ళడం లేదు. భయం....భయం.... పోలీసులవద్దకూ కోర్టుకీ ఏం తిరుగుతాం విచారణకూ...సాక్ష్యం చెప్తే ఏమవుతుందోనని భయం....ఛీ ఛీ ఏంటీ సమాజం...ఒక్కరికైనా మానవత్వం లేదా...." అని అన్నాడు కృష్ణారావు. 
"మీరు సాయం చేసారాండీ?" అడిగింది భార్య జయ.
"ఏమిటా ప్రశ్న? మా ఆఫీసు మేనేజర్ నాకేమన్నా మావగారా? టైమ్ కి ఆఫీసుకి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుంది. అప్పుడు రోడ్డున పడతాం" అన్నాడు కృష్ణారావు.