మా ఇంటి వరండాలు!: దోర్బల బాలశేఖర శర్మ

 నేను పుట్టి పెరిగిన రామాయంపేటలోని ఒకప్పటి మా ఇల్లు నాపై ఎంతగా ప్రభావం చూపిందంటే, అసలు 'సొంత ఇళ్లంటే' కనీసం ఇంత విశాలంగానైనా వుండాలనేంతగా. అందుకేనేమో, ఇరుకిరుకు ఇళ్లపై నేను పెద్దగా మనసు పారేసుకోలేదు. (ఇప్పుడున్నది అపార్టుమెంటులోని ఫ్లాటే అయినా కొంచెం విశాలమైన వరండాతోనే ఉన్నది). చూడటానికి అది పాత ఇల్లే కావచ్చు. ఆధునిక సౌకర్యాలు ఏవీ లేకపోవచ్చు. కానీ, ఆ కాలంలో, అప్పటి పరిస్థితుల్లో అదే ఎంతో ఎక్కువ. మన తల్లితండ్రులే మనకు ఆదర్శమనుకుంటే, మన పితృదేవతలే మనకు గొప్ప శ్రేయోభిలాషులు అనుకుంటే, వాళ్ళు నడయాడిన ఇంటిని "పవిత్ర ప్రదేశం'గా చూడాలి. కొత్త సౌకర్యాలు కావాలనుకుంటే, ఇంటి ఆత్మ చెడకుండా ఆధునీకరించు కోవచ్చు. ఈ విషయంలో నాది పూర్తి వైఫల్యమే. నన్ను నేను క్షమించుకోవడం తప్ప, మరేమీ చేయలేని నిస్సహాయత.
రామాయంపేటలోని ఒకప్పటి మా ఇంటి వరండాలలోని నా జ్ఞాపకాలను ఏరుకోవడం తప్ప, ఇప్పుడు మరేమీ చేయలేను. అవి దాదాపు చతుషాల (నాలుగు వైపులా ఖాళీ ప్రదేశం, మధ్యలో ఆకాశం కనిపించేలా వుండే పెద్ద గచ్చు) వరండాలు. తూర్పు వీధిలోని పెద్దర్వాజ లోపలి నుంచి ఇంట్లోకి వెళితే చిన్న వరండా, దీనిని ఆనుకొని కొనసాగే దక్షిణం వైపున్న వంటింటి గోడ వరండా, ఎదురుగా పడమర పెరటి గోడను ఆనుకొని ఉన్న ప్రధాన వరండా, ఉత్తరం రోడ్డు వైపున్న కొత్త ద్వారంలోంచి, దివాన్ ఖానా గుండా లోపలికి వెళితే వచ్చే కొత్త వరండా ... అన్నీ ఒక్కచోట ఎంతో విశాలంగా ఉండేవి. పెద్ద గచ్చు పైనుంచి కనిపించే ఆకాశం. పుష్కలంగా వచ్చే సూర్యరశ్మి, వర్షపు జల్లు, అప్పుడప్పుడూ విసిరేసినట్లుగా వచ్చిపడే వడగళ్ళు, అడపా దడపా దాడి చేసే కోతులు, వాటిని భయపెట్టడానికి కర్రలు పట్టుకొని నిలబడే పిల్లలం, ఏడాదికోసారి పైకప్పులపైకి ఎక్కి మేస్త్రీ వర్షం నీళ్లు కురవకుండా గూనపెంకుల్ని (ఉరుపులను) సవరించే దృశ్యాలు.
ప్రతీ సంవత్సరం ఉగాది నుంచి తొమ్మిది రోజులపాటు ఈ వరండాలలోనే 'శ్రీరామనవమి నవరాత్రులు' ఘనంగా జరిగేవి. సీతారామ కల్యాణానికి అయితే బిక్కనూరు నుంచి మా మేనత్త, మేనబావల కుటుంబాల వాళ్ళందరూ విధిగా హాజరయ్యేవారు. ఊళ్లోని భక్తులతో వరండాలన్నీ నిండిపోయేవి. మంత్రపుష్పం సమయానికి కనీసం పదిమంది అయినా పెద్దగా దీర్గాలు తీస్తూ పోటాపోటీ అన్నట్టుగా చదివే వారు. కనీసం పాతిక ముప్పయి మందిమి కూర్చుని పంక్తి భోజనాలు చేసేంత విశాలమైన వరండాలు అవి.  
మా నలుగురు అన్నదమ్ముల పెళ్లి స్నాతకాల నుంచి ఒక్కగానొక్క చెల్లె పెళ్లి వరకు అనేక కార్యక్రమాలకు ఈ వరండాలే వేదికలయ్యాయి. అటువంటి ఆ మధుర, ఆత్మీయమైన జ్ఞాపకాలను ఎలా మరిచిపోగలం?