మువ్వన్నెల పతాకం -మణిపూసలు :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
మువ్వన్నెల పతాకమా 
నా హృదిలోని గీతమా 
స్వేచ్ఛ స్వతంత్రముల 
ఆహ్లాదపు పరిసరమా !

భారతకోకిల పాడెను 
భావన మదిలో నిండెను 
జయహే భారత జననీ 
రంజిత శుభచరణములను !

కడలి అలల ఘోషవలెను 
నినాదముల వినిపించెను 
వందేమాతరమనుచును 
పిడికిళ్లను బిగియించెను !

తెలతెల్లని పావురములు 
గుడి శిఖరము జేగంటలు 
గుండెమీది జెండాతో 
వీధివీధినా బాలలు !

పింగళి వెంకయ్య సృజన 
టంగుటూరి గుండెలోన
సూర్యకుమారి గీతాలు 
దుర్గాబాయి ధైర్యమున !

నితాంత నవ నీరాజన
స్వరములన్ని దిక్కులన 
సమతా మమత సాధనకు 
కాంక్షలు మదిన పొంగిన !

ఎగరాలిక పతాకమా 
రెక్కలుతో విహంగమా 
భారతధాత్రి హాసములు 
మలయానిలము సాగుమా !
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳