మంచి మాటలు: -- యామిజాల జగదీశ్


 అనగనగా కాశీలో ఓ బిచ్చగాడుండేవాడు. చేతులు చాచి ధర్మం చేయండి బాబూ అని డబ్బులడిగేవాడు. అడుక్కోవడమే అతని జీవితం. 

ఒకానొకమారు ఓ జ్ఞాని కాశీకి వచ్చాడు. ఆయనను కలిసిన బిచ్చగాడు "నా జీవితాన్ని మార్చడానికి ఏదైనా ఉపదేశించండి" అని అడిగాడు. 

జ్ఞాని "రేపటి నుంచీ నువ్వు ఎవరినీ డబ్బివ్వండి బాబూ అని అడగడం మానేసి మీరు చల్లగా ఉండాలి. బాగుండాలి అని దీవించు. ఇలా చేసుకుంటూపోతే నీ జీవితం మారిపోతుంది" అన్నాడు.

బిచ్చగాడికి జ్ఞాని మాటలపై నమ్మకం కలుగలేదు. అయినా జ్ఞాని మాటను కాదనలేక చూద్దాం ఏం జరుగుతుందో అని దారిన పోయే వారందరినీ చల్లగా ఉండాలి. బాగుండాలి అని మనసారా చెప్పడం మొదలుపెట్టాడు.

ప్రారంభంలో ఇందుకు పెద్దగా స్పందన లభించలేదు. కానీ కొన్నిరోజులకే అతని మాటలకు విశేష స్పందన లభించింది. శుభకార్యాలు చేయాలనుకున్నవారు, మంచి పనులు మొదలుపెట్టాలనుకున్నవారు అతని దగ్గరకు వెళ్ళి దీవించమని అడగటం మొదలుపెట్టారు. అంతేకాక అతనికి డబ్బులిచ్చేవారు. 

కొన్ని నెలలకే అతని గురించి స్థానికంగానే కాకుండా ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి కూడా తెలుసుకుని ఎందరెందరో వచ్చి పోతుండేవారు. అలా వచ్చిపోతున్న వారందరూ అతనికి డబ్బులూ ఆహారమూ బట్టలూ ఇచ్చిపోతుండేవారు. 

తన రెండు మాటలూ ఎంతలా పని చేసాయో గ్రహించాడు. 

ఓ మంచి అలవాటు జీవితాన్నే మార్చేసింది అనడానికి ఆ బిచ్చగాడే ఓ మంచి ఉదాహరణ.


కామెంట్‌లు