అమ్మ చెప్పిన ధైర్యం :-- యామిజాల జగదీశ్

 అదొక పెద్ద మర్రిచెట్టు. ఆ చెట్టులో ఓ  గూడు. ఓ తల్లి పక్షి, మరో నాలుగు పిల్లలూ అందులో జీవిస్తున్నాయి. 
పిల్ల పక్షులు కీచుకీచుమని అరుస్తున్నాయి.
"ఎందుకే అలా అరుస్తున్నారు? అన్నం పెడుతున్నానుగా" అంది తల్లి పక్షి.
"ఎందుకంటావేమిటమ్మా? విషయం తెలిస్తే నువ్వు మాకన్నా పెద్దగా అరుస్తావు...." అన్నాయి పిల్ల పక్షులు.
"ఏమంటున్నారే?" అని అడిగింది తల్లి పక్షి.
"అదిగో అమ్మా. ఒకడు పెద్ద తాడేసుకుని చెట్టెక్కుతున్నాడమ్మా. బహుశా మనల్ని పట్టుకోవడానికేనేమో?" అన్నాయి పిల్లలు.
వాటి మాటలు విని తల్లి పక్షి నవ్వింది.
"ఎందుకమ్మా నవ్వుతున్నావు? నీకు భయం లేదా?" అన్నాయి పిల్లలు.
"అబ్బే, మనం భయపడాల్సిందేమీ లేదు. అతను మనల్ని వేటాడటానికి రావడం లేదు. మెడకు తాడు బిగించి చనిపోవడానికిగాను తాడు ఈ చెట్టు కొమ్మకి కట్టడానికి వస్తున్నాడు" అంది తల్లి పక్షి. 
"ఎందుకమ్మా? పక్షులమైన మనకే ఉండేందుకు గూడూ ఆహారం దొరుకుతుంటే అతనికి ఈ సువిశాలమైన ప్రపంచంలో అవేవీ దొరకలేదా?" అని ప్రశ్నలవర్షం కురిపించాయి పిల్లలు.
అప్పుడు తల్లి పక్షి చెప్పిందిలా....
"మనలాగా ఈ ప్రపంచంలోని వాటిపై హక్కులు కోసం పోటీపడకుండా ఉంటే బాగానే ఉండేవాడు. కానీ ఈ మనుషులున్నారు చూసావూ,.వాళ్ళ నాగరికత, సంస్కారం ఎంతమాత్రం గిట్టవు. ప్రతి ఒక్కరూ ఇది నాది అది నాది ఒకరితో ఒకరు ఘర్ణపడుతుంటారు. విభేదిస్తుంటారు. తగవులాడుకుంటారు. ప్రకృతితో సర్దుకుపోరు. దీంతో గొడవలు. నిరాశలు. నిస్పృహలు. వారి నాగరికత అంతే. బాధపడేవారు ఉండలేక ఆత్మహత్య చేసుకుంటారు. అలాగే ఇతనూ ఈ చెట్టెక్కి చావడానికొస్తున్నాడుతప్ప మనల్ని పట్టుకోవడొనికి కాదు" అని.
తల్లి చెప్పిన మాటలతో అమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాయి పిల్లపక్షులు.