జీవితచక్రం:-సత్యవాణి

 పాపాయి పుట్టిందని
పంచదార నోట వేసి
పంచారు ఆనందం
పదిమందికీ
పాపపుట్టి పదకొండవ రోజట
పంచారు చిక్కసం 
తొట్టిలోవేశారట
తొలిపండగ చేశారు పాపకు
బాలసారెట పాపకు బహుమతులు పంచారు
గుప్పిళ్ళు విప్పిందట పాపాయి
ముద్దకుడుములు పంచారు
నవ్విందట చిన్నిపాప
నువ్వుండలు పంచారు
బోర్లా పడిందట పాపాయి
బొబ్బట్లను పంచారు
కూర్చుందట పాపాయి
కుందులను పంచారు
పాకుతోందట పసిపాప
పాకుండలు పంచారు
అన్నం ముట్టిందట పాపాయి
పరమాన్నం పంచారు
పలుకుతోందిట పాపాయి
చిలుకలను పంచారు
అడుగులు వేసిందట పాప
అరిసెలను పంచేరు
బడికి వెళుతుందట పాపాయి
పలకలను పంచారు
పరికిణీపై ఓణీ వేసిందట అమ్మడు
పంచారు అట్లను 
పదిమంది పేరంటాండ్రకు
పెళ్ళికూతురైయ్యిందట అమ్మాయి
పప్పన్నం పెట్టేరు
గర్భవతిట అమ్మాయి
ఘనంగా సీమంతం చేశారు
అమ్మ అయ్యిందట ఆమె
అపురూపం అమ్మాయి రూపం 
అమ్మానాన్నలుఅమ్మమ్మా తాతలైనారట
వారిసంబరాలు అంబరాన్నంటేయట
 ఇదీ జీవితచక్రం
దీనితీరింతే