కుండ పగలకొట్టడం:-- యామిజాల జగదీశ్
 ఇటీవల మా సమీప బంధువైన మండలేముల రామారావు అనే అతను కాలం చేశాడు. పన్నెండో రోజున అతనింటికి నేనూ, మా అన్నయ్య ఆనంద్ వెళ్ళాం. అక్కడ ఎంతమంది పరిచయమయ్యారో చెప్పలేను. సూరి, న్యాసావజ్ఝల, సుసర్ల, కూరెళ్ళవాళ్ళు, రాయప్రోలు, ఇంద్రగంటి, పుల్లాభట్ల, దైత‌, దేవులపల్లి‌, మంగళంపల్లి ఇలా రకరకాల ఇంటిపేర్లున్న వాళ్ళు పరిచయమవడం, వాళ్ళెక్కడెక్కడున్నారు వంటి వివరాలూ ప్రస్తావనకొచ్చాయి.
న్యాసావజ్ఝల (బొబ్బిలి) వారి అమ్మాయి కూడా మాట్లాడుతూ యామిజాల భారతి అనే సాలూరు అమ్మాయితో కలిసి చదువుకున్నానంటూ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వగలరని అడిగారు. ఇంతకూ ఈ యామిజాల వాళ్ళదే వూరు అని అడిగితే సాలూరు వారని, భారతి వాళ్ళ నాన్నగారి పేరు యామిజాల సూర్యప్రకాశరావుగారని చెప్పారు. సాలూరు వాళ్ళయితే మా బంధువులే అయి ఉంటారన్నాను. ఇటీవలి నుంచే నేను యామిజాల వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో తెలుసుకుని నెంబర్లేవైనా దొరికితే ఫోన్ చేసి మాట్లాడటం చేస్తున్నాను. కనుక సూర్యప్రకాశరావు గారుండే సాలూరుకి దగ్గర్లోని శివరాంపురం అగ్రహారమే మా నాన్నగారు పుట్టిపెరిగింది. ఇంట్లో మా అమ్మానాన్నలు చెప్తుంటే వినడమే తప్ప ఆ అగ్రహారానికి వెళ్ళింది లేదు.
అదలా ఉండనిస్తే మా అన్నయ్య వల్ల నాకు యడవల్లి సుధాకర్ అనే ఆయన పరిచయమయ్యారు. వైజాగులో ఉంటున్న ఆయనకు ఫోన్ చేసి మాట్లాడితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిలో ఒకటి - కుండ పగలకొట్టడం. 
ఈ కుండ పగలకొట్టడమేమిటంటే సాలూరు శివరాంపురం పరిసర ప్రాంతాలలో యామిజాల ఇంటిపేరున్న వాళ్ళు వందల్లో ఉండేవారట. దీంతో ఏడాది పొడవునా ఏదో ఒకటి మంచో చెడో చెవినపడుతుండేది. ముట్టు, మైల ఇలా చెవిన పడుతున్నప్పుడల్లా మరే పనులూ చేయడానికి వీలుండేది కాదు. ఇందుకు పరిష్కారం ఏమిటాని ఆలోచించి యామిజాల దాయాదులందరూ ఊళ్ళో ఓ ప్రధానమైన చోట ఓ పెద్దాయన సమక్షంలో కలుసుకున్నారట. రెండు వర్గాలుగా విడివిడిగా కూర్చున్న తర్వాత పెద్దాయన ఏవో కొన్ని మాటలు చెప్పి ఇక మీకూ వాళ్ళకూ మధ్య ఎలాంటి సంబంధాలుం డవు అని చెప్పి అటూ ఇటూ ఉన్న ఇద్దరు ముఖ్యులతో మధ్యలో నీటితో ఉన్న కుండను కాలితో పగలకొట్టించారు. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఎవరికి కావలసిన వాళ్ళు వారితో కలిసిపోయి రెండుగా విడిపోయారు.  ఇలా వేరైపోవడంతో సాలూరు యామిజాల వాళ్ళకూ శివరాంపురం యామిజాలవాళ్ళకూ మధ్య బంధుత్వం లేకుండా పోయింది. ఇంటి పేరు ఒక్కటే అయినా బంధుత్వం ఉండదు. ఎవరైనా చనిపోతే మైలుపట్టడం అనేది ఉండేది కాదు.  
ఇలా కుండ పగలకొట్టిన విషయమొకటైతే మరొకరు చెప్పిందేమిటంటే గంట వాయించి వేరు పడ్డారనే ఆచారమూ అప్పట్లో వాడుకలో ఉండేదని. 
నాకు తెలిసిన యామిజాల ఇంటిపేరున్న వాళ్ళు ఈ రెండు ప్రాంతాలలోనే కాక భీమవరం, రాజాం, నర్సన్నపేట, విజయనగరం‌, రాజమండ్రి తదితర ప్రాంతాలలోనూ ఉన్నారు. మరి వీళ్ళల్లో ఎవరు బంధంవులో కాదో నాకు తెలీదు. నేను పుట్టి పెరిగింది మద్రాసు కావడంతో నాకు మా నాన్నగారివైపు వాళ్ళెవరూ పెద్దగా తెలీదు అనేకన్నా పరిచయాలే లేవన్నది నిజం.