రెక్కలు ::-- లీలా కృష్ణ.-తెనాలి.
ఆ మిన్నుని ముద్దాడినవి ఎన్నెన్నో రెక్కలు..!!
ఈ మిన్నుగన్నది లెక్కకు అందని పూరెక్కలు..!!.

పున్నమినాడు.. సముద్రపు అలలకు పుట్టుకొస్తాయి రెక్కలు.
దట్టమైన పొగమంచుని దాటి రాలేవు సూరీడు రెక్కలు.

వరుణుడు పంపిన లేఖను చదివిన వసంతం..
వెనువెంటనే , మోడుబారిన చెట్టు కొమ్మలకు పంచింది పచ్చని రెక్కలు.

రెక్కలు బరువెక్కినచో.. ఎగరలేవు పక్షులు.
వ్యధలతో బరువెక్కిన గుండెకు తప్పవు తిప్పలు.

రివ్వున రెక్కలు కట్టుకువచ్చే ఆ చిరుగాలి..
కమ్మిన నిదురకు తోడై.. పాడుతుంది లాలి.
లాలి పాటతో, నిదుర కళ్ళకు పడతాయి మూతలు..
నిదురించే మనసును కవ్విస్తాయి.. రెక్కలు కట్టుకు వచ్చే కలలు.

కలల రెక్కలు నేర్పిన లెక్కలతో.. ఈ లోకానికి మెరుగులు దిద్దుతారు మేధావులు.

మెరుపులు మోసే ఆ సూర్యచంద్రులు.. కవుల ఊహలకు.. రెక్కలు ఇచ్చిన వారిలో ప్రధములు.

రెక్కలు ముక్కలు చేసుకుని బ్రతికే వారు శ్రమజీవులు..
తప్పతాగి తిక్కతిక్కగా రెక్కలు ఊపు వారు ... త్రాగుబోతులు.

రెక్క కట్టందే , చుక్క పొడవనిదే.. తెల్లారవు బ్రతుకులు.