భ్రమలు వద్దు!:-- దోర్బల బాలశేఖరశర్మ

 ఒకప్పటి నా సహచర పాత్రికేయుడు, వృత్తిలో నాకన్నా కొద్ది సంవత్సరాలు సీనియర్ అయిన గోవిందరాజు చక్రధర్ ఇటీవల ఒక గొప్ప పరిశోధనాత్మక పుస్తకం ప్రచురించారు. ఇది నాలాంటి ఎందరో జర్నలిస్టు మిత్రులలో ఉన్న భ్రమలను తొలగిస్తుంది. ప్రత్యేకించి ఈ కాలపు చాలావరకు పత్రికల పట్ల ఉన్న 'పవిత్ర భావన'ను, ఉద్వేగాన్ని, మమకారాన్ని ఇంతటితో తుడిపేస్తుంది. ఈ రచయిత వలె కేవలం ఉత్తమ జర్నలిజాన్ని మాత్రమే కోరుకునే పాఠకుడిగా, దానినే నమ్ముకున్న వ్యక్తిగానే నేను ఇది రాస్తున్నాను.
1981 చివరి నుంచి 1986 అర్ధభాగం వరకు సుమారు ఐదేండ్లపాటు  'ఈనాడు'లో మా రామాయంపేట నియోజక వర్గం తరఫున నేను 'న్యూస్ టుడే' కంట్రిబ్యూటర్ గా పనిచేశాను. నాకప్పుడు ఇరవై ఏళ్ళ వయసు. 'ఈనాడు' మహా సామ్రాజ్య నిర్మాణానికి అక్షరాలెత్తిన ఒక కలం కారులలో నేనొకన్ని. చేరిన తొమ్మిది నెలల్లోనే ఒక అవినీతి వార్త పర్యవసానంగా నాపై హత్యాయత్నం జరగడంతో జర్నలిజాన్నే పూర్తిస్థాయి వృత్తిగా చేసుకోవలసి వచ్చింది. ఈ పుస్తకాన్ని రచయిత నాలాంటి వారందరికీ అంకితం ఇవ్వడం నాకు బాగా నచ్చింది. ప్రాణాలను పణంగా పెట్టి వార్తలు రాసే నిఖార్సయిన జర్నలిస్టులు ఉన్నట్టే, వార్తలను తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకునే వారూ ఉంటారని దీన్నిబట్టి అర్థమవుతుంది.  నా జీవితాన్ని తీవ్ర మలుపు తిప్పిన 'ఈనాడు' పత్రిక అధినేత రామోజీరావుపై వచ్చిన ఈ పుస్తకాన్ని మూడు రోజుల్లో ఆసాంతం చదివి, నాదైన ఈ అభిప్రాయాన్ని నా ఫేస్ బుక్ మిత్రుల కోసం అందిస్తున్నాను. 
***.      ***
ఉన్నది ఉన్నట్టేనా?
కలియుగంలో ధర్మం దారితప్పి,  ధనార్జనే ముఖ్యమై పోతుందన్న వైదిక మత గ్రంథాల వాక్కు అప్పుడే నిజమవుతున్నట్టుంది. పుణ్యభూమి, ధర్మభూమిగా విలసిల్లిన భారతావని సైతం ఇందుకు మినహాయింపు కాదేమో. ధనార్జన కోసం 'కాదేదీ వ్యాపారానికి అనర్హం' అయినప్పుడు మంచీ చెడు, నువ్వు నేను అన్న ప్రస్తావన,  ఉచితానుచితాలేవీ ఉండవు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పత్రికా రంగం కూడా ఫక్తు వ్యాపార కేంద్రమై పోయిందా? అన్న ప్రశ్న ఈ పుస్తకం చదివిన వారికి ఉత్పన్నమవుతుంది. సుమారు 400 పేజీల ఈ గ్రంధం (ఉన్నది ఉన్నట్టు) నిజాయితీ,  నిబద్ధత గల ప్రజాస్వామ్య వాదులు, పత్రికా రచయితలనే కాకుండా సామాన్య పాఠకులను సైతం ఈ రకంగా ఆలోచింప చేస్తుందనడంలో సందేహం లేదు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బయటకు నీతులు చెప్పేవాళ్ళుగా కనిపించే వాళ్లెందరో అంతర్గతంగా గోతులు తీస్తుంటారా? విలువలు, నీతి, న్యాయం, ధర్మం, దయా దాక్షిణ్యాల గురించి మాట్లాడే వాళ్లే ధనార్జనే ధ్యేయంగా వాటికి తిలోదాకాలు ఇస్తుంటారా? వంటి ప్రశ్నలు రేకెత్తడం. 'రామోజీరావు బయోపిక్' వలే కనిపించేలా అందమైన ముఖచిత్రంతో ఉన్న ఈ పుస్తకం కేవలం ఆయన ప్రశంసలకు మాత్రమే పరిమితం కాకుండా విమర్శనాస్త్రాలను సైతం ఎక్కుపెట్టింది. "'రామోజీరావు అంటేనే ఈనాడు, ఈనాడు అంటేనే రామోజీరావు' అన్నంతగా మమేకమైన పరిస్థితిలో ఈ రచయితతో పాటు పలువురు పాత్రికేయ రంగంలోని ఉద్దండులు అనదగ్గ వారు కూడా ఇందులో వ్యక్తపరిచిన కొన్ని స్థిరాభిప్రాయాలు, స్వీయానుభవాలు.. తెలుగువారికి తలమానికం వంటి 'ఈనాడు' విజయ ప్రస్థానాన్ని, ఎందరికో ఆదర్శప్రాయుడైన రామోజీరావు గొప్పతనాన్ని మరీ ముఖ్యంగా గుణగణాల్ని శంకించేలా ఉన్నాయి. 
శీర్షిక 'ఉన్నది ఉన్నట్టు' అన్నది ఎవరికి వర్తిస్తుంది, పుస్తకంలోని విషయాలకా లేక సంబంధిత వ్యక్తికా, సంస్థకా? ఏమైనా, పరిశోధనాత్మక పంథాలో, శాస్త్రీయ కోణంలో సమాచారాన్ని అందించడానికి, విషయ సేకరణకు రచయిత పడిన శ్రమ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తుంది. కేవలం విమర్శే లేదా కేవలం ప్రశంసే అన్నట్టుగా కాకుండా 'నిష్పాక్షిక తపన' ప్రతీ అక్షరంలోనూ కనిపిస్తుంది. 'ఈనాడు' అభిమానులు, రామోజీరావును, ఆయనలోని ఉక్కు క్రమశిక్షణను ప్రేమించేవారు, మరీ మించి జర్నలిజంలో నిబద్ధతను కాంక్షించేవారు మిస్ కాకుండా తప్పక చదవవలసిన పుస్తకమిది. 
నిజానిజాలను పాఠకులకు నివృత్తి చేయవలసిన బాధ్యతను సంబంధితులు తీసుకోగలిగితే అంతకు మించిన గొప్పతనం మరొకటి ఉండదు. ఒక రకంగా ఇది చారిత్రక అవసరం కూడా.
(మీరూ పుస్తకం చదివి, అభిప్రాయాల్ని పంచుకోండి. పుస్తకం వెల: 300 రూ. కావాలనుకొనే వారు సంప్రదించాల్సిన సెల్ నెంబర్: 98498 70250.)