తేనెలొలికే తెలుగు-:- రామ్మోహన్ రావు తుమ్మూరి

 విశ్వ వ్యాప్తంగా తెలుగు మాట్లాడే వాళ్లు కోట్లసంఖ్యలో ఉన్నారు.కాని రాను రాను 
వాడేవాళ్లు తగ్గి  భాష ఎక్కడ అంతరించిపోతుందోనన్న భయం కొంత మందికి లేకపోలేదు.ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునేమో అనిపిస్తుంది కూడా.ఇంత అందమైన మన మాతృభాషఅంతరించకుండా ఉండాలంటే 
ఒక తరం నుండి ఇంకొక తరానికి అది అందించబడాలె.మన తెలుగులో చాటువులు అని ఉన్నాయి.వాటికి  తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.అసలు చాటువంటే ఏమిటి?కవులైన వారు కొన్ని కొన్ని సందర్భాలలో స్పందించి అప్పటికప్పుడు చెప్పిన పద్యాలే చాటువులుగా నిలచి పోయాయి.శ్రీనాథుని చాటువులకు మంచి పేరున్నది.పలనాటి సీమకు వెళ్లినపుడు అక్కడి పరిస్తథితిని గమనించి కింది పద్యాలు చెప్పాడట.
చిన్ని చిన్ని రాళ్లు చిల్లర దేవుళ్లు
నాగులేటి నీళ్లు నాపరాళ్లు
సజ్జజొన్నకూళ్లు సర్పంబులును తేళ్లు
పలనాటిసీమయే పల్లెటూళ్లు
అలాగే 
రసికుడు పోవడు పలనా
డెసగంగా రంభయైన ఏకులు వడకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన దొన్న కూడే గుడుచున్
జొన్నకలి జొన్నయంబలి
జొన్నన్నము జొన్నప్సరు జొన్నలెదప్పన్
సన్నన్నము సున్నజుమీ 
పన్నుగ పలనాటిసీమ ప్రంతమునందున్
ఇంకాఆయనవి చాలానే ఉన్నాయి.
కుళ్లాబెట్టితి కోకజుట్టితిమహాకూర్పాసమున్ దొడవితిన్
వెల్లుల్లిని దిలపిష్ఠమున్ మెసవితిన్విశ్వస్తవడ్డించగా
చల్లాయంబలి ద్రావితిన్ రుచులదోసంబంచు బోనాడితిన్
తల్లీకన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీవాథుడన్
అలాగే 
“దీనారటంకాలదీర్థమాడించితి”
“చిన్నారి పొన్నారి చిరుతకూకటినాడు”
వంటి రసవత్తరమైన పద్యాలు చాటువులుగా తెలుగు భాషను జీవద్భాషగా చేస్తున్నాయి.ఆనాటి చరిత్ర తెలుసుకోవడానికి ఇలాంటి మరెందరి చాటువులో మనకు సాహిత్యచరిత్రలో దర్శనమిస్తాయి.
ఆంధ్రభోజుడుగా పిలువబడ్డ శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్టదిగ్గజాలుగా పేర్కొనబడే కవులలో 
తెనాలి రామకృష్ణకవి ఒకరు.ఈయన చాటువులుకూడా చాలా ప్రసిద్ధి గాంచినవే.
మేకకు మేకమేక మెకమేకకుతోకకు మేక మేక అనే పద్యం
కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ 
అన్న పద్యానికి రాజుగారి వద్ద ఒకరకంగా,సేవకుని వద్ద ఒకరకంగా చెప్పిన చాటువులు కవుల చతురతకు నిదర్శనాలు.
అలాగే అల్లసాని పెద్దన 
నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు క
ప్పురవిడెమాత్మకింపయిన భోజన మూయలమంచమొప్పుత
ప్పరసెడు మిత్రుడూహ తెలియంగల పాఠక లేఖకోత్తముల్
దొరకినగాని యూరకకృతుల్ రచియింపుమటన్న శక్యమే
ప్రసిద్ధమైన చాటువు.అప్పట్లో కవులు ఎంతటి వైభవాలు పొందారో తెలిపే పద్యం.ఇంకా అనేక మందివి అనేక చాటువులున్నాయి.ఇవి చాటువుల ఉదాహరణలు మాత్రమే