సామెత కథ : ఎం. బిందు మాధవి

 జుట్టు ఉంటే కొప్పులెన్నైనా ముడవచ్చు!
‘సుశీల’, ‘రాఘవ’ మధ్య తరగతి భార్యా భర్తలు. ఉండేది పెద్ద నగరమైనా, అందులోనే మధ్య తరగతివారికి అన్ని విధాలా సౌకర్యం గా ఉండే కాలనీలో ఇల్లు తీసుకుని ఉంటున్నారు. సుశీల స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నది.భర్త ఏదోఒక ప్రైవేట్ కంపెనీలో గుమాస్తాగా పని చేస్తున్నాడు.
పెద్దలు ఇచ్చిన ఆస్తులంటూ పెద్దగా ఏమీ లేవు. ఉన్నంతలో, వచ్చిన జీతాల్లో ఏదో గుట్టుగా అప్పులు లేకుండా జీవితాలు గడుపుతున్నారు. పెద్దగా ‘ఫీజులు’, ‘డొనేషన్లు’ కట్టలేక ఉన్న ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. వాళ్ళిద్దరు మంచి తెలివైనవాళ్ళు, అన్ని క్లాసుల్లోను ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ, స్కాలర్ షిప్ కి ఎంపికయ్యారు.
రాఘవ ‘తండ్రి’ సెకండరీ స్కూల్ ‘హెడ్ మాస్టర్’ గా చేసి రిటైర్ అయ్యారు. సర్వీస్ లో ఉండగానే ఒక పిల్ల పెళ్ళి చేశారు. రెండో పిల్ల పెళ్ళి ఇప్పుడు కుదిరింది. పెద్దగా వెనకేసుకున్న డబ్బేమీ లేకపోవటంతో రాఘవని కొద్దిగా ‘సర్దుబాటు’ చెయ్యమని అడిగారు.
అనుకోకుండా అదే సమయానికి, సుశీల చెల్లెలి పెళ్ళి కూడా కుదిరింది. సుశీల కి తండ్రి లేడు. తల్లి సుబ్బమ్మ ఇంట్లో చిన్నగా అప్పడాలు, వడియాలు చేసి, బట్టలు కుట్టి, ఇరుగు పొరుగు ఇళ్ళకి సాయాలకి వెళ్ళి ఏదో తనకి చేతనైనంతలో ఇల్లు గడుపుతూ రెండొ కూతురు కవిత ని చదివించింది.
ఇప్పుడు ‘పెళ్ళి’ అంత పెద్ద ‘ఖర్చు’ పెట్టటానికి కనీసంలో కనీసం డబ్బు కూడా ‘సర్దుబాటు’ కాలేదు. అలా అని సుశీలని డబ్బు సాయంచెయ్యమని అడగ తల్చుకోలేదు. తను ‘అప్పడాలు వడియాలు’ అమ్మే ‘షావుకారు’ని, తన చేత బట్టలు కుట్టించుకునే వారిని ఎంతో కొంత సాయం చెయ్యమని అడిగింది. పిల్ల పెళ్ళి అవ్వగానే, మరి కొంత ఎక్కువ సమయం పని చేసి వారి అప్పు తీరుస్తానని చెప్పింది. సుబ్బమ్మ పనితనం మీద, నిజాయితీ మీద నమ్మకం ఉండటం చేత వాళ్ళు డబ్బు ఇవ్వటానికివెంటనే ఒప్పుకున్నారు.
కావల్సిన మొత్తం ఏర్పాటు చేసుకున్నానని ఎంత అనుకున్నా , కాస్తో కూస్తో ‘ఆపద్ధర్మాని’కి అంటూ చేతిలో కొంత మొత్తం ఉంచుకోవాలి కనుక తన ఒంటి మీద ఉన్న ‘గాజుల జత’ ‘తాకట్టు’ పెట్టి కొంత ‘పైకం’ తీసుకున్నది.
ఆడపడుచు పెళ్ళికి డబ్బు సర్దుబాటు చెయ్యమని మామగారు భర్తని అడిగారని తెలిసి, సుశీల తన చెల్లి పెళ్ళి కుదరటం , పాపం ఒంటరి ఆడ మనిషి అయి ఉండీ నోరు తెరిచి తల్లి తనని సాయం చెయ్యమని అడగకపోవటం గురించి భర్తతో ప్రస్తావించింది.
రాఘవ మరదలి పెళ్ళి కుదిరినందుకు సంతోషించి, తను ఉన్న పరిస్థితిలో రెండు పెళ్ళిళ్ళకీ నిజంగా సహాయం చెయ్యవలసిన స్థానంలో ఉండి కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు తన మీద తనే జాలి పడ్డాడు.
సుశీలతో ‘మీ అమ్మగారు నోరు తెరిచి అడగకపోయినా సాయం చెయ్యవలసిన బాధ్యత మనమీద ఉన్నది. కానీ నాన్నగారికి ఉన్నంతలో డబ్బు సర్దుబాటు చేస్తానని ఇప్పటికే మాటిచ్చాను. కాబట్టి నెమ్మది మీద మీ అమ్మగారికి కూడా డబ్బు సర్దుదాము, ఏమీ అనుకోవద్దని చెప్పు’ అన్నాడు.
సుశీల "జుట్టు ఉంటే కొప్పులెన్నైనా ముడవచ్చు", ‘మన దగ్గర లేకే కదా ఈ అవస్థ. మా అమ్మకి డబ్బు ఇవ్వకూడదనే ఉద్దేశ్యం మీకు లేదని నాకు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు సానుభూతితో, సానుకూలంగా ఆలోచించ టమే సంస్కారం ఉన్న వ్యక్తులుగా మనం చెయ్య గలిగిన పని’ అన్నది.