పూలరాణి మల్లె:-- యామిజాల జగదీశ్
మల్లెపూవు 
పరిమళాన్ని గాలి
అప్పుగా తీసుకుని
సంచారానికొచ్చింది

యవ్వనంలోనే బోధపడింది
ఉదయంపూట వికసించక
సాయంసంధ్యలో ఎందుకు 
వికసిస్తోందని

నీ పరిమళ మహత్తుతోనే
రాత్రులు నీకు పట్టం కట్టాయి
కోర్కెల నేత మల్లి అని

నూలుపోగంటూ లేకుండా
లెక్కలేనన్ని పూలున్నా
నా అంతరంగం
ఆఘ్రాణించేదీ 
ఆస్వాదించేదీ
నిన్నంటే నిన్నేగా

నీ శ్వేతవర్ణానికీ
నీ అందాల స్వచ్ఛతకూ
ముగ్ధుడై
సాయంత్రపు సూరీడు
పశ్చిమాన ఉదయించడానికి
ఆశపడుతుంటాడు

నిన్ను 
ప్రేమించడానికి
గులాబీకూడా ఆశించడంతో
నీతో కలిసి
మాలికలో అల్లుకుపోతాడు

పూవుతో కలిసి
తావీ పరిమళిస్తుందని 
పుట్టుకొచ్చింది 
నీ మహిమతోనేగా
దీంతో ఒకింత అసూయపడ్డా
గులాబీ ఏమీ చేయలేపోయింది

నీ అందాన్ని 
ఆస్వాదించడానికి
రాత్రంతా మేల్కొని
అంబరాన ఉంటుటున్నాడు
నెలరాజు

మల్లిపూవుని
ఆస్వాదించడానికి
పరిమళాన్ని 
ఆఘ్రాణించడానికి
నెలరాజు
భువికొచ్చినా రావొచ్చు 
ఏదో క్షణాన

పున్నమి నుంచి
వెలుగు పొంది
సాటి లేని గొప్పదనాన్ని
కలుపుకున్నావు
నిన్ను పడగొట్టడానికి
ఒక్క పూవూ లేదీ భూలోకాన
పూలరాణివి నువ్వేని
అందరూ చెప్పుకునే మాటే
అందుకే 
నీ పందిరి మాకందరికీ 
ఆనందాల పందరి!!


కామెంట్‌లు