అమ్మ గొంతుక:- కె ఎస్ అనంతాచార్య

 నేనింకా కోలుకోలుకొనేలేదు
ముడివేసుకున్న అనుబంధాల మూట లోనుంచి జ్ఞాపకాల పరిమళాలు ఇంకా గుప్పు ముంటూనేవున్నాయి!
 ప్రతి కదలికలో  చూపిన ఆచరణలు చెదరని  చక్రాంకితా లై నిలిచాయి!
 కొమ్మల మీద ఆశయాలు
పూలై వికసించాయి
తులసి చెట్టు మీద గోవింద రామ నామం  దళాల పచ్చదనం లో కలిసి 
మురిసి పోయింది!
 సామెతలన్నీ తలపోతల చెరువులో నీటి ముత్యాల యి మెరుస్తున్నాయి!
 
పలికే నోరు మూగపోయినా  
శ్రీపతి స్తుతి మాల  తరంగాలు
చెవుల్లో గింగరాలు పోతున్నాయి!
చేతుల  చేతనత్వం మాయమై జపమాల  ఆగిపోయింది 
తపాల దీక్ష స్వామిని చేరింది. ఎన్నోరాగాలు గుర్తెరిగిన అనురాగం తలచి ఆరుంనొక్క శృతి  కృతి మాకు మిగిల్చి సమర్పణకు సాగిపోయిన దాసురాలు ! 
 ఖాళీ కూర్చి చూసి గుండె బరువైంది ! 
వెక్కి వెక్కి ఏడ్చినా  తిరిగిరాని అమ్మ మా ఇంటి  కొమ్మ
దానిక్రింద బంధుత్వాలు ఆకుపచ్చగా
 ఎదిగి ఒదిగాయి ! 
పీఠాధిపతి కూతురు కదా అందరికి   ప్రేమపీటలు వేయడం సహజాత లక్షణమై అలరింది ! 
భీతి లేక నియమం తప్పక 
నిలబడ్డ ధీరోదాత్త అయిదుగురు బిడ్డలు కళ్ళు మూసినా దుఃఖాన్ని మునిపంట నొక్కి   ఉన్నచోట స్వర్గాన్ని చేసి
కలకుంట్ల వంశ కలికి తురాయై నిలిచింది
రంగనాయకి వి కదా 
తల్లికోడివై చెల్లెలు మరుదులు
 పిల్లల నడిపించిన నాయకన్మణి ! 
 
తొమ్మిది గజాల చీర కట్టి
మడిచార్  లో దర్శన మిచ్చే మా అమ్మ విల్లిపుత్తూర్ గోదమ్మ ! 
పెరుమాళ్ళ తిరువడి గళ్ చేరిన 
వడలిపోని విరి కొమ్మ!
 తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లిన
అమ్మ గొంతుకై  పలుకుతున్నా ! 
సరస్వతి పీట ముందు కన్నీటి కావ్యాన్నై
నిలుచున్నా ! 
ఆశయ సాధనలో అడుగులు వేసే దిశగా కదులుతున్నా!
( మా అమ్మ జ్ఞాపకంలో..)