గతితార్కికత:-సి.యస్.రాంబాబు
చిగురించే ఆశ చిరాయువు 
అని తృప్తి పడుతుంటే
కాటువేసిన మనిషి కనపడుతుంటాడు 

పచ్చనాకు పసిడికన్నా గొప్పది 
ప్రాణవాయువై పలకరిస్తుంటుంది 
చీకటి చివరిన వెలుగురేఖ 
'లైఫ్ లైన్'లా మెరుస్తుంటుంది

కాంక్రీట్ అరణ్యంలోనూ 
వేణుగానంలా 
చెట్టు ఊపిరి చింతలను 
మరిపిస్తుంటుంది

నైజం మారని మనిషికి 
నేర్పేదెవ్వరని తొలిచే బాధను 
దిగమింగుకుంటూ 
నల్లని తార్రోడ్డు తర్కిస్తూ తాత్వికంగా సాగిపోతోంది