మిమ్మల్ని చూస్తే...:-- యామిజాల జగదీశ్

 జి.కె. చెస్టర్టన్ ప్రముఖ ఇంగ్లీష్ రచయిత. ఆయన ఒకింత భారీకాయుడు. ఆయనకు తనలాగా లావుగా ఉన్న వాళ్ళంటేనే ఇష్టం. పైగా ఆయనకు తన భారీ కాయాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. 
ఆయన ఓమారు సుప్రసిద్ధ నాటక రచయిత, చమత్కారానికి మారుపేరైన జార్జ్ బెర్నార్డ్ షాను కలవడానికి వెళ్ళారు. బెర్నార్డ్ షా కాస్త సన్నం. ఆయనతో అవీ ఇవీ మాట్లాడిన తర్వాత చెస్టర్టన్ మనసులో అనుకున్నది అడిగేసారుకూడా....
"మిస్టర్ షా! మీరెప్పుడూ ఇలా సన్నగా ఉంటారేంటీ? మీరు ఒళ్ళు పట్టినట్టు ఎప్పుడూ చూడలేదు. ఎందుకలా?" అని అడిగారు.
అందుకు షా జవాబిస్తూ "నా శరీర నిర్మాణం అలాటిది. నేనేం చేయను? అయినా నాకిందులో ఏ దిగులూ లేదు" అన్నారు.
కానీ చెస్టర్టన్ ఆగలేదు.
"మిమ్మల్నెవరైనా విదేశీయులు చూసారంటే మన దేశం అనావృష్టికి గురై అర్థాకలితో అవస్థలు పడుతోందని అనుకుంటారు. అదే నా బాధ"  అన్నారు చెస్టర్టన్.
అంతట బెర్నార్డ్ షా "అలాగా? అయితే అందుకు కారణం మీ భారీకాయమని చూసిన వాళ్ళు ఇట్టే గ్రహిస్తారులెండి" అని చెప్పడంతోనే చెస్టర్టన్ ఇంకేమీ మాట్లాడలేదు.